జొన్నగిరి బంగారు గనుల్లో తుషార్ గాంధీ పాత్ర ఏమిటీ?

అమెరికా , ఉక్రెయిన్ మధ్య బెడిసిన ఖనిజ ఒప్పందం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇప్పుడు కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ మైన్స్ ను తాకాయి..;

Update: 2025-03-06 02:30 GMT
జొన్నగిరి గోల్డ్ మైన్స్ ఉన్న ప్రాంతం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మధ్య జరిగిన ఘర్షణ ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ మైన్స్ ను తాకింది. అమెరికా-ఉక్రెయిన్ ఖనిజ ఒప్పందం ప్రమాదంలో పడింది. ఉక్రెయిన్ లో మైనింగ్ చేయాలనుకున్న కార్పొరేట్ సంస్థల చూపు ఇప్పుడు జొన్నగిరి మీద పడింది. సరిగ్గా ఈ సమయంలోనే విదేశీ కార్పొరేట్ సంస్థలను జొన్నగిరిలోకి అనుమతించవద్దన్న డిమాండూ పెరుగుతోంది. ఈ పరిస్థితిని తక్షణమే ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ICAR పాలక మండలిలో రైతుల ప్రతినిధి వేణుగోపాల్ బదరవాడ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఇందులో మహాత్మాగాంధీ ముని మనుమడు తుషార్ గాంధీ పాత్ర కూడా ఉందని బదరవాడ ఆరోపించారు. తుషార్ పాత్రపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
అసలేమిటీ జొన్నగిరి గోల్డ్ మైన్స్...
మౌర్యుల కాలంలో "సువర్ణగిరి"గా ఖ్యాతి గాంచిన ప్రాంతం. భారతీయ ఖనిజ సంపదకు కేంద్రబిందువు. ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు జిల్లాలో ఉంది. దీనిపేరే జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్. దేశంలోనే తొట్టతొలి పెద్ద ప్రైవేట్ బంగారు గని. జొన్నగిరి, ఎఱ్ఱగుడి, పగడిరాయి గ్రామాల సమీపంలో ఉంది. ఓపెన్ పిట్, ప్రాసెసింగ్ సౌకర్యం దీని ప్రత్యేకత. ఏడాదికి దాదాపు 750 కిలోగ్రాముల బంగారాన్ని వెలికితీయవచ్చునని అంచనా. ప్రస్తుతం ఈ గని జియోమైసోర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (GMSI) యాజమాన్యంలో ఉంది. త్రివేణి ఎర్త్‌మూవర్స్ ప్రైవేట్ లిమిటెడ్, డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (DGML)కీ భాగస్వామ్యం ఉంది.

2021 డిసెంబర్ లో ప్రయోగాత్మకంగా ఉత్పత్తి ప్రారంభమైంది. 2024 అక్టోబర్ నాటికి పూర్తిస్థాయిలో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాలనుకున్నారు గాని సాధ్యపడలేదు. ఇటీవల ఓ రైతు భూమిలో రూ. 2 కోట్ల విలువైన వజ్రం బయటపడడంతో జొన్నగిరి ప్రాంతంలో అసంఖ్యాక ఖనిజ సంపద ఉందనే దానికి నిదర్శనంగా చెబుతున్నారు. దీంతో తిరిగి ఈ ప్రస్తావన తెరపైకి వచ్చింది. అమెరికా- ఉక్రెయిన్ మధ్య ఖనిజ ఒప్పందం కుదరకపోవడం కలిసి వచ్చింది. దాదాపు 300మందికి ప్రత్యక్షంగా, మరో 300 మందికి పరోక్ష ఉపాధిని కల్పిస్తుందని అంచనా. ఈ గనిలో మొత్తం 65 లక్షల టన్నుల ఖనిజ వనరులు ఉన్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లెక్కవేసింది.
గ్రామసభలు ఆమోదం తెలిపాయా?
బంగారు గనుల్లో అన్వేషణ కార్యకలాపాలు త్వరలో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇప్పటికే గ్రామసభలు జరిగాయి. రైతులు, స్థానికులకు ఉపాధి కల్పించాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కోరింది. జొన్నగిరి, పగిడిరాయి, తుగ్గలి, ఎర్రగుడి, కొత్తూరు, గోల్లవానిపల్లె గ్రామాల ప్రజలు ఈ గనుల్లో తవ్వకాలకు అంగీకరించినట్టు పత్తికొండ రెవెన్యూ అధికారులు చెప్పారు.
స్థానికుల ఆందోళనలు...
గనుల్లో తవ్వకాలు ప్రారంభమైతే భూగర్భజలాలు తగ్గిపోతాయనే భయం రైతుల్ని వెంటాడుతోంది. పత్తికొండ నియోజకవర్గం ఇప్పటికే పర్యావరణ సమస్యలను ఎదుర్కొంటోంది. విపరీతమైన వేడి గాలులతో అల్లాడుతోంది. ఇప్పుడు ఈ తవ్వకాలో- అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటి వనరులు ఇంకిపోతే జీవనోపాధి దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. "కంపెనీ 600 మీటర్ల లోతు వరకు బోర్లు తీయాలనుకుంటోంది. ఇలా జరిగితే రైతుల బోర్లలోని నీరు ఎండిపోతుందని భయపడుతున్నాం. రైతుల ప్రయోజనాలను ఎలా కాపాడతారో స్పష్టత ఇవ్వాలని అధికారులను కోరుతున్నాం" అన్నారు జొన్నగిరి గ్రామ ప్రముఖుడు ఓబులేశు.

స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని ముందు చెప్పినా ఇప్పడు ఎవరూ పట్టించుకోలేదని ఓ రైతు మద్దులేటి ఆరోపిస్తున్నారు. స్థానికులకు బదులు రాజస్థాన్, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల నుండి వచ్చిన వారికి ఉద్యోగాలు కల్పిస్తున్నారని, స్థానికులు మాత్రం ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తుందని చెప్పారు.
ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ వల్ల భారీగా కాలుష్య సమస్యలు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. బంగారు గనుల పరిశ్రమ పూర్తి స్థాయిలో ప్రారంభమైతే మరింత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానికుల ఆవేదన. పైలట్ ప్రాజెక్ట్ వల్ల వందల ఎకరాలు ధూళితో నిండిపోయాయి. అసలు పరిశ్రమ ప్రారంభమైతే కలిగే నష్టాన్ని ఊహించలేమన్నది వారు ఆందోళన వ్యక్తం చేశారు.
తుషార్ గాంధీ పాత్ర ఏమిటీ?
మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీకి మైనింగ్ చేయబోయే కంపెనీకి సంబంధం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. తాను సలహాదారుగా ఉన్న కంపెనీ కోసం ఆయన ఇటీవల కర్నూలు జిల్లాలో పర్యటించినట్టు గనుల శాఖ అధికారులు ధృవీకరిస్తున్నారు. 2017లో ఆయన ఒకసారి, ఆ తర్వాత మరోసారి వచ్చినట్టు గనుల శాఖకు అదనపు డైరెక్టర్ గా వ్యవహరించిన నటరాజ్ చెప్పారు.
1,500 ఎకరాల్లో ఖనిజాల అన్వేషణకు జియోమైసోర్ సర్వీసెస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌కు లైసెన్స్ ఇచ్చారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధీనంలోని జొన్నగిరి, ఎర్రగుడి వంటి రక్షిత ప్రాంతాల వరకు మైనింగ్ ఏరియా ఉంది. డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (DGML), దాని అనుబంధ జియోమైసోర్ సర్వీసెస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ మైనింగ్ ప్రమోటర్లుగా ఉన్నారు. ఆయా గ్రామాల ప్రజలను ఒప్పించేందుకు, వాళ్లకున్న అనుమానాలను తీర్చేందుకు మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీని ఉపయోగించుకున్నారని సమాచారం.
మైనింగ్ కంపెనీలపై జనాభిప్రాయం..
సహజంగా మైనింగ్ కంపెనీలపై ప్రజలకు సదాభిప్రాయం ఉండదు. వాళ్లకు వ్యాపారం తప్ప మరేమీ పట్టదన్న అభియోగమూ ఉంది. వ్యాపారదోపిడీకి మారుపేరుగా ఈ కంపెనీలపై ముద్ర ఉంటుంది. అటువంటి ఇమేజ్ ను పారదోలడానికి సహజంగా పెద్ద కంపెనీలు పేరున్న వ్యక్తులను తమ సలహాదారులుగా నియమించుకుంటాయి. తుషార్ గాంధీ కూడా అలాగే వచ్చి ఉంటారన్నది ఇక్కడి వారి అభిప్రాయం.
తుగ్గలి మండలంలోని చెన్నంపల్లి ప్రజలకైతే సాక్షాత్తు మహాత్మాగాంధీ వచ్చినట్టే చెప్పారు. తుషార్ తప్ప మరెవ్వరికీ మైనింగ్ కంపెనీతో సంబంధం లేదనే నమ్మించారు. ఈ మైనింగ్ కంపెనీ నుంచి వచ్చే ఆదాయాన్ని గ్రామ ప్రజలకు పంపిణీ చేస్తారని చెప్పారు. గ్రామస్తులకు బంగారు మైనింగ్ కంపెనీలో ఉద్యోగాలు, గ్రామంలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తారని వాగ్దానం చేశారు.
ఏయే కంపెనీలో ఎవరెవరు?
డక్కన్ గోల్డ్ మైనింగ్ కంపెనీ చైర్మన్ (DGML) చార్లెస్ E.E. దేవనిష్ తన సొంత డబ్బును ఆస్ట్రేలియన్ ఇండియన్ రూరల్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ (AIRDF)లో పెట్టారని, మహాత్మాగాంధీ ప్రవచించిన గ్రామీణ స్వావలంబనకు కృషి చేస్తున్నారని కూడా మైనింగ్ కంపెనీ ప్రముఖులు తెలిపారు. డక్కన్ కంపెనీ గనుల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రాంతాలలో ఈ తరహా ప్రచారం బాగా సాగింది. ఈ కార్యక్రమాలను అమలు చేయడానికి తుషార్ గాంధీ AIRDFతో కలిసి పని చేస్తున్నారని చెప్పుకుంటూ వచ్చారు. జియోమైసోర్ కంపెనీలో 80 శాతం పెర్త్‌కు చెందిన ఆస్ట్రేలియన్ ఇండియన్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ (AIR) యాజమాన్యంలో ఉంది. మిగిలిన 20 శాతం సైప్రస్‌కు చెందిన సన్ మైనింగ్ అండ్ ఎక్స్‌ప్లోరేషన్ లిమిటెడ్ కి ఉంది. AIR ప్రమోట్ చేసిన రామా మైన్స్ (మారిషస్)కి DGMLలో 58 శాతం వాటాను కలిగి ఉంది. DGMLకి పూర్తి అనుబంధ సంస్థ ఇండోఫిల్ రిసోర్సెస్ ఎక్స్‌ప్లోరేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటె. ఈ సంస్థ కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో బంగారం కోసం అన్వేషణ జరుపుతోంది. జోన్నగిరిలో జియోమైసోర్ అన్వేషణలో ఉంది.
ఇదంతా పెద్ద కుంభకోణం...
ఐసీఏఆర్ సభ్యుడైన వేణుగోపాల్ బదరవాడ తుషార్ గాంధీ పాత్రపై తీవ్రమైన అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన మహాత్మా గాంధీ వారసత్వాన్ని ఉపయోగించి జొన్నగిరి బంగారు గని ప్రాజెక్టుకు ప్రజల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈమేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సుదీర్ఘలేఖ రాశారు. పర్యావరణ అనుమతిని రద్దు చేయాలని, జొన్నగిరి బంగారు గని మైనింగ్ వల్ల దీర్ఘకాలిక పర్యావరణ నష్టం జరుగుతుందని వివరించారు. జియోమైసోర్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీ భారత నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తోందని, తుషార్ గాంధీ, చార్లెస్, జియోమైసోర్, డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ పై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రికి రాసిన లేఖలో వేణుగోపాల్ చేసిన ఆరోపణలు, డిమాండ్లు ఇలా ఉన్నాయి.
"భారతదేశంలోనే ఇదో ఘోరమైన దోపిడీ. అదే జొన్నగిరి బంగారు గని స్కాం. విదేశీ కార్పొరేట్ సంస్థలు అవినీతికి మోసానికి పాల్పడుతూ అక్రమ మైనింగ్ జరుపుతున్నాయి. ఈ విదేశీ శక్తులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తక్షణమే జోక్యం చేసుకోవాలి. దేశ సంపదను రక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలి. విదేశీ కంపెనీలు భారత ఖనిజ సంపదను దోచుకుపోతుండగా మౌనం పాటించడం అన్యాయంగా ఉంటుంది. దేశ భద్రత, రైతుల భవిష్యత్తు, భారత సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ప్రభుత్వ తక్షణ చర్యలే మార్గం. విదేశీ సంస్థలు అక్రమంగా తవ్విన బంగారాన్ని స్వాధీనం చేసుకుని, ప్రభుత్వ ఆధ్వర్యంలో మైనింగ్ జరపాలి" అని వేణుగోపాల్ ప్రధానమంత్రిని కోరారు. ఇదే లేఖలను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి కూడా పంపారు.
ఈ వ్యవహారంలో జాతీయ భద్రత ఇమిడి ఉన్నందున సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మైనింగ్ వ్యవహారంతో- తుషార్ గాంధీ, చార్లెస్, ఆస్ట్రేలియా ఇండియన్ రూరల్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్, లయన్స్ గోల్డ్ (లండన్), జియోమైసోర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్, ఇతర విదేశీ సంబంధిత సంస్థలు ముడిపడి ఉన్నందున ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరపడమే ఉత్తమం అని వేణుగోపాల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Tags:    

Similar News