వీరు వైఎస్సార్‌సీపీకే ఎందుకు అనుకూలం!
వీరంతా వైఎస్సార్‌పీపీకే అనుకూలంగా ఉన్నారు. తమ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే ఎందుకు గెలిచారు.
Byline : G.P Venkateswarlu
Update: 2024-03-03 09:37 GMT
రాష్ట్ర విభజన తరువాత ఏజెన్సీలోని గిరిజన ఓటర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు. వాళ్ల మనసుల్లో స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దేవుడిగా ఉన్నాడు. అందుకు ప్రధాన కారణం వైద్య ఉచితంగా చేయించడం. వారి పిల్లలకు ఉచితంగా చదువులు చెప్పించడం. విద్యుత్‌కు బిల్లులు తీసుకోకుండా ప్రభుత్వమే చెల్లించడం. పోడు వ్యవసాయం చేసుకునేందుకు లక్షల మంది గిరిజనులకు భూమి హక్కు పత్రాలు ఇప్పించి ఫారెస్ట్ వారి ఆక్షేపణల నుంచి కాపాడటం. రాష్ట్ర విభజన తరువాత గిరిజనుల్లో ఈ సంక్షేమ పథకాలు బాగా నాటుకుపోయాయి. వైఎస్సార్‌ను ఎంతగా అభిమానించారో వైఎస్ జగన్‌ను కూడా అంతగానే అభిమానిస్తున్నారని చెప్పొచ్చు. నియోకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులందరినీ గెలిపించడమే అందుకు నిదర్శనం.
ఏడు అసెంబ్లీల్లోనూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలే..
ఏజెన్సీ ప్రాంతమైన అరకు పార్లమెంట్‌ను తీసుకుంటే పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే 2019 ఎన్నికల్లో గెలిచారు. 2024 ఎన్నికల్లో ఎవరిని ఓటర్లు ఆదరిస్తారో తెలియదు కాని తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంట్ పరిధిలోని ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించలేదు. వైఎస్సార్‌సీపీ మాత్రం పార్లమెంట్‌తో పాటు ఏడు అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించింది.
రాజకీయాలకు దూరమైన కొత్తపల్లి గీత
గత ఎన్నికల్లో అరకు లోక్ సభకు గొడ్డేటి మాధవి ఎన్నికయ్యారు. ఆమెకు 2.24,098 ఓట్ల మెజారిటీ వచ్చింది. కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ అభ్యర్థి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్‌ను ఓడించారు. మాధవి మొదటి సారి రాజకీయాల్లోకి వచ్చి అనూహ్యంగా అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం విశేషం. మాధవి గతంలో సీపీఐ ఎమ్మెల్యేగా గెలిచి విశేష సేవలందించిన దేముడు కుమార్తె. అరకు పార్లమెంట్ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. మొదటిసారి కిశోర్ చంద్రదేవ్ గెలవగా 2014లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొత్తపల్లి గీత టీడీపీ అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణిపై గెలుపొందారు. ఆమె ఆ తరువాత వైఎస్సార్‌సీపీకి దూరమై తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు. తరువాత తెలుగుదేశం పార్టీ నుంచి కూడా దూరంగా ఉండి గత ఎన్నికల్లో రాజకీయాల్లో కనిపించకుండా పోవడం విశేషం. గిరిజనులు ఒక పార్టీ తరపున గెలిచి ఆ తరువాత పార్టీ మారిన వారిని కూడా క్షమించలేదు. వైఎస్సార్‌సీపీ తరుపున గెలిచి ఆ తరువాత టీడీపీ తరుపున పోటీ చేసిన వారిని చిత్తుగా ఓడించారు. ఈ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో మొదట్లో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యం పార్టీకి బాగానే ఓట్లు వచ్చాయి. ఆ తరువాత పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జనసేన పార్టీకి కూడా ఓట్లు రావడం విశేషం. కమ్యూనిస్టుల తరుపున ఎవరైనా పోటీ చేస్తే వారిని కూడా ఇక్కడి ఓటర్లు ఆదరిస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా భాగ్యలక్ష్మి
2024 ఎన్నికల్లో అరకు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రస్తుతం పాడేరు ఎమ్మెల్యేగా ఉన్న కె భాగ్యలక్ష్మిని వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో అరకు నుంచి భాగ్యలక్ష్మి గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని గిరిజన గూడేల్లోని ముఖ్య నాయకులు వ్యాఖ్యానించడం విశేషం. అరకు పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గల్లో గిరిజనులు ఎక్కువ మంది గత పదేళ్లుగా క్రిష్టియన్ మతానికి ఆకర్షితులవుతున్నారు. వారికి కావాల్సిన నిత్యావసరాలన్నీ ఫాస్టర్ల ద్వారా తీరుతుండటంతో పాస్టర్లు చెప్పినట్లు వింటున్నారు. క్రిష్టియన్ అనగానే వారికి వైఎస్‌ఆర్ కుటుంబం కూడా గుర్తుకు వస్తుందని కొందరు చెబుతున్నారు.
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా..
వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా సిటింగ్ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి ఎన్నికల బరిలో ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరనేది ఇంకా వెల్లడి కాలేదు. గత ఎన్నికల్లో నిమ్మల జయకృష్ణ కళావతిపై పోటీ చేసి ఓడారు.
కురుపాం నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా పాముల పుష్పా శ్రీవాణి ఉన్నారు. ఈమె ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తొయ్యక జగదీశ్వరిని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. పార్టీలో సీనియర్ నాయకురాలైనా కొత్తగా ఈ నియోజకవర్గంలో పోటీకి దిగారు.
పార్వతీపురం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా అలజంగి జోగారావు ఉన్నారు. ఈయనకే వచ్చే ఎన్నికల్లో సీటు కన్‌ఫాం అయింది. తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్‌ఆర్‌ఐ విజయ్ బోనెల ఎంపికయ్యారు. ఆయన రాజకీయాలకు కొత్త కావడం విశేషం.
సాలూరు నుంచి ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర ఎమ్మెల్యేగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి గుమ్మడి సంధ్యారాణి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఈమె కూడా టీడీపీలో సీనియర్ నాయకురాలు.
అరకు వ్యాలీ నుంచి శెట్టి పల్గుణ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే సిటింగ్‌ను కాదని ఇక్కడ రేగం మత్స్యలింగంను వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ప్రకటించింది. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సియ్యారి దొన్నుదొరను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది.
పాడేరు సిటింగ్ ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మిని పార్లమెంట్‌కు పంపించి ఇక్కడ మత్స్యరాస విశ్వేశ్వరరాజును వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ప్రకటించింది. టీడీపీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.
రంపచోడవరం నుంచి సిటింగ్ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. టీడీపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు.