వైసీపీ ఎంపీ వేమిరెడ్డికి ఏమైందీ మళ్లీ?
వైఎస్సార్ సీపీ నెల్లూరు జిల్లా నాయకుడు, పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎందుకు కోపం వచ్చింది? భార్యకు సీటు ఇవ్వనన్నారా..
వైఎస్సార్ సీపీ నెల్లూరు జిల్లా నాయకుడు, పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎందుకు కోపం వచ్చింది? ఎంతో ప్రశాంతంగా, నిబ్బరంగా ఉండే మనిషి ఆయన. అటువంటి వ్యక్తికి కోపం వచ్చిందంటే కొంచెం అనుమానించాల్సిన వ్యవహారమే. నెల్లూరు జిల్లాతో పాటు సిటీలోనూ పట్టు సంపాయించిన వేమిరెడ్డి సొంతపార్టీలో కుమ్ములాటలను తట్టుకోలేకపోతున్నారని వినికిడి. కొంతకాలం స్థానిక ఎమ్మెల్యేలతో, మరికొంత కాలం అసమ్మతివర్గంతో ఆయన కొట్టుమిట్టాడుతుంటే ఇప్పుడు పార్టీ అధిష్టానమే పట్టించుకోలేదని తెలుస్తోంది. ఆయనకు తెలియకుండానే నెల్లూరులో పార్టీ అభ్యర్థులను మారుస్తున్నారంటూ పెద్దఎత్తున ప్రచారం జరగడంతో వేమిరెడ్డి ఎవరికీ చెప్పకుండా ఢిల్లీ వెళ్లారంటున్నారు.
అసలేం జరిగిందంటే...
ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వైసీపీ అధిష్టానం వచ్చే లోక్ సభ ఎన్నికల్లో నెల్లూరు నుంచి బరిలోకి దింపాలని నిర్ణయించింది. ఆయన పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ అధిష్టానమే అభ్యర్థుల్ని నిర్ణయిస్తుంది. అందులో ఎవరికీ ఎటువంటి అనుమానం ఉండాల్సిన పని లేదు. అయితే పార్లమెంటుకు పోటీ చేయబోతున్న వ్యక్తికి ఓమాట చెప్పడం ఆనవాయితీ. కానీ ఇప్పుడు ఆ ఆనవాయితీకి భిన్నంగా జరగడమే వేమిరెడ్డి ఆగ్రహానికి కారణం అంటున్నారు.
నెల్లూరు సిటీ సమన్వయకర్తగా నెల్లూరు డిప్యూటీ మేయర్ ఎండీ ఖలీల్ అహ్మద్‌ను నియమిస్తూ వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నెల్లూరు లోక్‌సభ సభ్యునిగా బరిలోకి దిగాలని వేమిరెడ్డికి చెప్పిన అధిష్టానం... తనను సంప్రదించకుండా, మాట మాత్రమైనా చెప్పకుండా నెల్లూరు సిటీ సమన్వయకర్తగా ఖలీల్‌ను నియమించడంపై వేమిరెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారంటున్నారు. “విలువ లేనిచోట ఇమడలేనని, నెల్లూరు లోక్‌సభ బరిలో తాను నిలబడటం లేదని చెప్పినట్లుగా” వేమిరెడ్డి సన్నిహితులు చెబుతున్నారు.
వేమిరెడ్డి తన భార్యకు సీటు అడిగారా?
పార్టీ అధిష్టానానికి వేమిరెడ్డికి మధ్య గ్యాప్ రావడానికి కారణం ఆయన తన భార్య ప్రశాంతికి సీటు అడగడమే అంటున్నారు. నెల్లూరు పార్లమెంటుకు తాను పోటీ చేయాలంటే నెల్లూరు నగరంలో తన భార్య ప్రశాంతికి సీటు ఇవ్వాలని వేమిరెడ్డి షరతు పెట్టారని, అందువల్లే పార్టీ అధిష్టానం ఇప్పుడు ఆయన్ను పక్కనపెట్టిందని నెల్లూరులో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని వేమిరెడ్డి వర్గీయులు తీవ్రంగా ఖండించారు.
నెల్లూరు సిటీ స్థానానికి తన భార్య ప్రశాంతిని పోటీ చేయిస్తానంటూ తానేనాడూ జగన్ ముందు ప్రతిపాదన ఉంచలేదని, సీఎం కార్యాలయమే నెల్లూరు సిటీకి ప్రశాంతి పేరు ప్రతిపాదించిందని వేమిరెడ్డి సన్నిహితులు చెబుతున్నారు. నెల్లూరు సిటీకి ఇప్పటి వరకు ప్రాతినిధ్యం వహించిన అనిల్ కుమార్ యాదవ్ ను నరసరావుపేట ఎంపీగా పోటీ చేయిస్తుండడంతో ఇక్కడ సీటు ఖాళీ అయింది. అప్పుడు ప్రశాంతి పేరు కూడా తెరమీదికి వచ్చింది.
ఈనేపథ్యంలో ఉన్నట్టుండి నెల్లూరు డెప్యూటీ మేయర్ ఖలీల్ ను సమన్వయకర్తగా నియమించారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఖలీల్ వేమిరెడ్డిని కలిసేందుకు ప్రయత్నించినా ఆయన (వేమిరెడ్డి) ఇష్టపడలేదని సమాచారం. ఖలీల్ కలుస్తామంటున్నారని ఆయన వ్యక్తిగత సహాయకుడు ఫోన్‌లో కోరగా... తానెవరినీ కలువదలచుకోలేదంటూ ఫోన్ పెట్టేశారు. శనివారం తన కుటుంబంతో కలసి వేమిరెడ్డి ఢిల్లీ కి వెళ్లిపోయారు. కొంతకాలంగా నెల్లూరు జిల్లాపై జగన్‌కు స్పష్టత రావడం లేదు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా అనిల్‌కుమార్ యాదవ్‌ను కొనసాగించడంపై మీనమేషాలు లెక్కించారు. దీనిపై వేమిరెడ్డిని జగన్ ఒప్పించారని ప్ర చారం జరిగింది. ఇప్పుడు అనిల్‌ను నరసారావుపేట లోక్‌సభకు ప్రకటించారు. ఆ వెంటనే ఖలీల్‌ను నెల్లూరు సిటీ సమన్వయకర్తగా ప్రకటించారు. తనకు తెలియకుండా జరుగుతున్న ఈ పరిణామాలపై వేమిరెడ్డి కినుక వహించారు. ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఖలీల్ అనిల్ కుమార్ మనిషని టాక్...
వేమిరెడ్డి పెద్ద పారిశ్రామికవేత్త. అనేక వ్యాపారాలున్నాయి. అందులో మైనింగ్ కూడా ఒకటి. నెల్లూరు జిల్లాలో క్వార్డ్జ్ తవ్వకాల వ్యవహారంలో వేమిరెడ్డి విన్నపాన్ని వైసీపీ అధిష్ఠానం పట్టించుకోలేదు. దీంతో మనస్తపానికి గురైన ఆయన కొంతకాలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ప్రచారానికి పుల్‌స్టాప్ పెట్టారు. దీంతో జగన్ ఆయన్ను పిలిపించి బుజ్జగించి పోటీకి ఒప్పించారు.
ఇప్పుడు మళ్లీ సిటీ ఇన్‌చార్జి విషయంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌ను నరసారావుపేట ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన క్రమంలో నెల్లూరు సిటీకి పలువురి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇందులో వీపీఆర్ సతీమణి ప్రశాంతిరెడ్డి పేరు కూడా ఉంది. అయితే ఎవరూ ఊహించని విధంగా అనిల్ వర్గానికి చెందిన కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎం.డి. ఖలీల్ పేరు ప్రకటించారు. తనకు మాటమాత్రంగా చెప్పకుండా ఇన్‌చార్జిని ప్రకటించడంతో వీపీఆర్ మనస్తాపానికి గురైనట్లు తెలిసింది. దీనికి తోడు కందుకూరు టికెట్ ఎమ్మెల్యే మహిధర్‌రెడ్డికే ఇవ్వాలని ఆయన గట్టిగా కోరినా వైసీపీ అధినేత పక్కన పెట్టారు. ఈ కారణాలన్నీ వీపీఆర్‌ని కలతకు గురిచేసినట్లు చెబుతున్నారు.
మొత్తం మీద వైసీపీకి గత ఎన్నికల్లో పట్టుకొమ్మగా నిలిచిన నెల్లూరు జిల్లా ఇప్పుడు అంత బలంగా లేదు. నెల్లూరు జిల్లా వైసీపీ రాజకీయాలు అస్థిరంగా ఉన్నాయి. మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.