పవన్ కల్యాణ్‌కు పర్మినెంట్ అడ్డాగా పిఠాపురం మారుతుందా?
పిఠాపురంలో ఇల్లు నిర్మించుకునేందుకు పొలం కూడా కొనుగోలు చేశారు. పార్టీ కార్యాలయాన్ని నిర్మించేందుకు ప్లాన్ సిద్ధం చేశారు.;
నారా చంద్రబాబు నాయుడు కుప్పంను, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల మాదిరిగా పిఠాపురంను పవన్ కల్యాణ్ తన పర్మినెంట్ అడ్డాగా మర్చుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. అయితే కుప్పంను తన అడ్డా మార్చుకునేందుకు చంద్రబాబుకు అనేక సంవత్సరాలు పట్టింది. తన సొంత నియోజక వర్గమైన చంద్రగిరి నుంచి చంద్రబాబు రాజకీయ ఆరంగేట్రం చేశారు. తొలుత చంద్రగిరి నుంచే చంద్రబాబు పోటీ చేశారు. తొలి సారి అక్కడ నుంచి గెలుపొందినా..రెండో సారి ఓటమి చవి చూశారు. తర్వాత తన మకాంను అదే జిల్లాలోని కుప్పంకు మార్చుకున్నారు. చంద్రగిరిలో చెల్లుబాటు కామని కుప్పంకు వెళ్లారు. 1989లో కుప్పం నుంచి పోటీ చేసి గెలుపొందిన చంద్రబాబు ఇక కుప్పంను తన అడ్డాగా మర్చుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. అక్కడ టీడీపీ బలంగా ఉండటం, బీసీ ఓటర్లు ఎక్కువుగా ఉండటంతో కుప్పంను తన పర్మినెంట్ అడ్డాగా మార్చుకున్నారు. స్థానికులతో మమేకం అవుతూ తన మీద స్థానికుల్లో నమ్మకం కలిగిస్తూ వచ్చారు. ఎన్టీఆర్‌కు స్వయాన అల్లుడు కావడం, అనతి కాలంలోనే టీడీపీలో కీలక నేతగా ఎదిగిన చంద్రబాబుకు కుప్పంను తన చేతిలోకి తెచ్చుకోవడానికి దోహద పడ్డాయి. అలా కుప్పంను తన వశం చేసుకునేందుకు చంద్రబాబుకు దశాబ్దాల కాలం పట్టిందనే చెప్పొచ్చు. నాటి నుంచి నేటి వరకు కుప్పం నుంచే పోటీ చేస్తూ గెలుపొందుతూనే వస్తున్నారు. ఎనిమిది సార్లు కుప్పం నుంచి పోటీ చేసి చంద్రబాబు గెలుపొందారు.