మాగుంటకు వైసీపీ ద్వారాలు క్లోజ్, చెల్లని బాలినేని సిఫార్స్

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నెలకొన్న బాలినేని-మాగుంట ప్రతిష్టంభనకు వైసీపీ అధిష్టానం ఎట్టకేలకు చాలా సున్నితంగా తెరదించింది.

Byline :  Amaraiah Akula
Update: 2024-01-19 07:44 GMT
Magunta Srinivasulu Reddy

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నెలకొన్న బాలినేని-మాగుంట ప్రతిష్టంభనకు వైసీపీ అధిష్టానం ఎట్టకేలకు చాలా సున్నితంగా తెరదించింది. కీలక నేతలతో చర్చలు జరిపి.. తమ డిమాండ్లు నెరవేర్చుతున్నట్టే సర్దిచెప్పడంతో పాటు ‘తానొవ్వక.. ఇతరుల్ని నొప్పింపక’ అన్నట్టుగా బాలినేనిని ఎంపీ విషయంలో సైడ్‌ చేయించారు. దీంతో జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అభ్యర్థుల మార్పులు చేర్పులపై కసరత్తు ప్రారంభించింది వైసీపీ. అలకబూనిన నేతలంతా లైన్‌లోకి వచ్చినా.. సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో మాత్రం టెన్షన్‌ కొనసాగుతూనే ఉంది.

మాగుంటపై పట్టుబట్టవద్దు...
ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి టికెట్‌ విషయంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పంతం పట్టడంతో వైసీపీ అధిష్టానం సైతం కాస్త ఇబ్బందులు ఎదుర్కొంది. గత కొంతకాలంగా సాగుతున్న ఈ ఎపిసోడ్‌కు ముగింపు ఇచ్చేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే కీలక నేతలైన సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి... బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో చర్చలు జరిపారు. బాలినేనికి సంబంధించి డిమాండ్లు నెరవేర్చేందుకు సీఎం జగన్‌ సిద్ధంగా ఉన్నారని.. మాగుంట విషయంలో వెనక్కి తగ్గాలని సూచించారు.
ఇప్పుడు కలుస్తావా చెప్పన్నా...
అంతేకాదు.. బాలినేని వచ్చిన విషయం సీఎంకు తెలియదని.. ఎప్పుడైనా అపాయింట్‌మెంట్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ క్రమంలోనే బుధవారం సీఎం జగన్‌తో భేటీ అయ్యారు మాజీ మంత్రి బాలినేని. ఎంపీ మాగుంట విషయంలో విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన మాటలే.. జగన్‌ కూడా రిపీట్‌ చేయడంతో బాలినేని చల్లబడ్డారు. తనకు కావాల్సిన మిగతా విషయాలపై చర్చించి తర్వాత బయటకు వచ్చేశారాయన. దీంతో 20 రోజులుగా ఒంగోలులో నెలకొన్న టికెట్‌ ప్రతిష్టంభనకు తెరపడింది.
ఇక.. ప్రకాశం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న మిగతా సెగ్మెంట్ల మార్పులపై కసరత్తు ప్రారంభించింది వైసీపీ అధిష్టానం. అటు.. ఎంపీ మాగుంటకు ఛాన్స్‌ లేదన్న క్లారిటీ ఇవ్వడంతోపాటు కొత్త అభ్యర్థి అన్వేషణ ప్రారంభించింది. అయితే.. ఏపీ రెడ్డి కార్పొరేషన్‌ చైర్మన్‌ చింతలచెరువు సత్యనారాయణరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితోపాటు బాలినేని కుమారుడు ప్రణీత్‌రెడ్డి పేర్లను పరిశీలిస్తోంది. ఇక దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ సైతం ఒంగోలు లోక్‌సభ బరిలో ఉండాలన్న పట్టుదలతో ఉన్నా.. ఆయన్ను వేరే సెగ్మెంట్‌ నుంచి బరిలో దింపాలని వైసీపీ చూస్తోంది.
మద్దిశెట్టి సంగతి మాకొదిలిపెట్టు...
ఒంగోలు సీటు ఇవ్వని పక్షంలో కనిగిరి లేదా గిద్దలూరు టికెట్‌ ఇవ్వాలని పట్టుబడుతున్నారు మద్దిశెట్టి. మరోవైపు కనిగిరి సీటు కోసం సిట్టింగ్‌ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మార్కాపురంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డితోపాటు.. వైసీపీ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి టికెట్‌ రేసులో ఉన్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడంతో అక్కడ కొత్త అభ్యర్థిని ప్రకటించనున్నారు.
బాలినేనికి ఇచ్చిన ఆప్షన్స్ ఇవే....
Delete Edit
బాలినేనికి వైసీపీ అధిష్టానం రెండు ఆప్షన్స్ కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో సిట్టింగ్‌ స్థానమైన ఒంగోలు ఒకటైతే, రెండోది వైసీపీకి కంచుకోటగా ఉన్న గిద్దలూరు. ఇందులో బాలినేని ఏ ఆప్షన్‌ ఎంచుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. ఈ రెండింటిలో అధిష్టానం కేటాయించిన చోటు నుంచి పోటీ చేస్తారా ? లేక ఒంగోలే కావాలని పట్టుబడతారా అన్నది సస్పెన్స్‌గా మారింది.
మాగుంటకు మూసుకుపోయిన ద్వారాలు..
ఇక సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులురెడ్డికి సొంత పార్టీలో ద్వారాలు మూసుకుపోవడంతో.. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలతో మాగుంటతోపాటు ఆయన అనుచరులు చర్చలు సాగించినట్లు వార్తలు వస్తున్నాయి. వైసీపీలో సీటు రాకపోయిని వెనక్కి తగ్గేది లేదని.. ఆయన కుటుంబం ఎవరో ఒకరు కచ్చితంగా బరిలో నిలుస్తారని మాగుంట వర్గీయులు చెబుతున్నారు. ఒకవేళ ఒంగోలు ఎంపీగా శ్రీనివాసరెడ్డి కొడుకు ప్రణీత్‌రెడ్డిని వైసీపీ అధిష్టానం ఫైనల్‌ చేస్తే.. మాగుంట కుమారుడు రాఘవ టీడీపీ నుంచి బరిలో దిగే అవకాశముంది. అదే జరిగితే.. ఇప్పటి వరకు మిత్రులుగా ఉన్న రెండు కుటుంబాలు వైరి వర్గంగా ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది.
మొత్తంగా ప్రకాశం జిల్లా వైసీపీలో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడటంతో కొత్త అభ్యర్థులు ఎవరన్న చర్చ సాగుతోంది. ఇక బాలినేని డిమాండ్లను అధిష్టానం ఏమేరకు నెరవేరుస్తుంది ? ఆయన ఎంచుకునే నియోజకవర్గం ఏదన్నది మాత్రం వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News