తిరుపతి జిల్లాలో వైసిపి తరం మారింది, అయితే, జనామోదం పొందాల్సి ఉంది...
తిరుపతి జిల్లాకు చెందిన వైసిపి కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సునాయాసంగా కొడుకులకి ఎమ్మెల్యే సీట్లు ఇప్పించుకున్నారు. అయితే, జనం ఏమంటారో చూడాలి.
By : The Federal
Update: 2024-01-26 11:26 GMT
-దినేష్ గునకల
తిరుపతి జిల్లాలో ఎలాంటి సమస్యలు లేకుండా ఇద్దరు ఎమ్మెల్యేలు తమ వారసుకుల పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి ఆమోదం పొందారు. చాలా నియోజకవర్గాలలో ప్రజా వ్యతిరేకత వల్ల ఎమ్మెల్యేలను మార్చాల్సి వస్తున్నది. మార్పు ఉన్నచోటంతా అసంతృప్తి రాజుకుంటూ ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్యేలు సునాయాసంగా తమ కొడుకులకు అసెంబ్లీ సీట్లు దక్కేలా జగన్ ని ఒప్పించడంలో విజయవంతమయ్యారు.
వారెవరో కాదు, తిరుపతి జిల్లా రాజకీయాల్లో గురు శిష్యులుగా ఉన్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. వారిద్దరు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కొడుకులను గెలిపించుకునేందుకు కష్టపడాల్సి వస్తోంది. జగన్ ఆమోదం పొందినా జనామోదం పొందడం అంత ఈజీ కాదు. అయితే, ఈ పరీక్ష నెగ్గేందుకు భూమన్ తనయుడు, డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి, చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారు.
తిరుపతి జిల్లా నుంచి నుంచి ఇద్దరు రాజకీయ వారసులకు వైసీపీ అధిస్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇది అనివార్యం అయ్యింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించింది వైసీపీ హై కమాండ్ ఇప్పటికే తండ్రికి తగ్గ తనయులుగా రాజకీయాల్లో దూకుడును ప్రదర్శిస్తున్నారు భూమన అభినయ్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి.
వారి సేవలను గుర్తించిన వైసీపీ తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల సమన్వయకర్తలుగా ప్రకటించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యేగా రెండోసారి విజయం సాధించిన భూమన కరుణాకర్ రెడ్డి ఇక ఇవే ఆఖరి ఎన్నికలని ప్రకటించడం, ఆ తర్వాత వారసుడిగా భూమన అభినయ్ తిరుపతి రాజకీయాల్లో కీలకం అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన భూమన అభినయ్ అభివృద్ధిలో కీలకంగా మారారు. అయితే, ఇంతవరకు బాగానే ఉంది. అయితే, రాష్ట్రంలో రాజకీయాలు బాగా వేడెక్కుతున్నాయి. వైఎస్ షర్మిల తానే వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలి నంటు కాంగ్రెస్ నాయకత్వం చేపట్టింది. అలాగే మరొక వైపు తెలుగు దేశం పార్టీ , జనసేనల కూటమి కూడా ఉధృతంగా జగన్ వ్యతిరేక ప్రచారం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అభినయ్ , మోహిత్ ల ఎన్నికల ప్రవేశం ఆసక్తి కరంగా మారింది.
డిప్యూటి మేయర్ గా అభినయ్
తిరుపతి మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం యజ్ఞంలా చేపట్టిన అభినయ్ తిరుపతి నగర అభివృద్ధిలో జనంలో మార్కులు కొట్టేసే ప్రయత్నం చేశారు. గత ఆరు నెలల క్రితమే తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దూకుడు పెంచిన అభినయ్ తిరుపతి పాలిటిక్స్ లో కీలకమయ్యారు.
టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి అయ్యాక తిరుపతి అభివృద్ధి పరుగులు పెట్టించడంలో అభినయ్ కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధిష్టానం నిర్వహించిన రీజినల్ కోఆర్డినేటర్ల సమీక్ష లోనే తిరుపతి వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి భూమన అభినయ్ పేరును ప్రకటించింది. ఇప్పుడు అధికారికంగా భూమన అభినయ్ రెడ్డిని తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించింది
చెవిరెడ్డి గుడ్ విల్ తో మోహిత్ రెడ్డి
ఇక తిరుపతి జిల్లాలో మరో రాజకీయ వారసుడిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని వైసీపీ అధిష్టానం గుర్తించింది. ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సీఎం జగన్ టీమ్‌గా పనిచేసేందుకు సిద్దం కావడంతో 2024 సార్వత్రిక ఎన్నికలకు దూరమవుతున్నట్లు ప్రకటించి కొడుకును ఆశీర్వదించమని మోహిత్ రెడ్డిని తెరమీదకి తీసుకొచ్చారు.
ఇందులో భాగంగానే ముందుచూపుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుపతి రూరల్ ఎంపీపీగా ఏకగ్రీవ ఎన్నికకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పావులు కదిపారు. అంతేకాకుండా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా తన పదవీకాలం ముగియడంతో గత ఏడాది తుడా చైర్మన్ గా కూడా మోహిత్ రెడ్డి కి సీఎం జగన్ ఆశీస్సులతో అవకాశం కల్పించారు.
తుడా చైర్మన్ గా టీటీడీ పాలక మండలి ఎక్స్ అఫిషియో సభ్యుడిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి అవకాశం కల్పించిన తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన వారసుడిగా కొడుకుకు రెడ్ కార్పెట్ వేయించారు.
ఒకవైపు పొలిటికల్ పవర్ తో పాటు గన్ మెన్ సౌకర్యం ఉన్న రెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో గడపగడపకు వెళుతున్నారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి దూకుడును గుర్తించిన వైసీపీ అధిష్టానం చంద్రగిరి సమన్వయకర్తగా అవకాశం కల్పించింది. ఈ మేరకు తిరుపతి జిల్లాలో ఇద్దరికీ రాజకీయ వారసత్వాన్ని అప్పజెప్పిన వైసీపీ అధిష్టానం అసెంబ్లీకి పంపేందుకు సిద్ధమైంది.