ఏపీ మునిసిపాలిటీల్లో ఎగురుతున్న పసుపు జెండా
మునిసిపాలిటీల్లో వైఎస్సార్సీపీ జెండాను తెలుగుదేశం పార్టీ పీకేస్తోంది. ఇటీవల కోన్ని మునిసిపాలిటీల్లో జరిగిన ఎన్నికలు బలాలను నిరూపించాయి.;
తెలుగుదేశం, దాని మిత్ర పక్షాలైన జనసేన, బీజేపీలు మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీలపై కన్నేసింది. ఇప్పటి వరకు సుమారు 70 శాతం మునిసిపాలిటీల్లో అనధికారికంగా తెలుగుదేశం ప్రభుత్వం పాలిస్తోంది. పేరుకు వైఎస్సార్సీపీ తరపున గెలిచిన వాళ్లే కాని, పాలించేది తెలుగుదేశం పార్టీ తరపున కావడం విశేషం. నాలుగేళ్ల క్రితం జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయఢంగా మోగించింది. మొత్తం 100 మునిసిపాలిటీల్లో ఎన్నికలు జరిగితే కేవలం మూడు మునిసిపాలిటీల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది. మిగిలిన 97 మునిసిపాలిటీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ తరువాత జరిగిన మిగిలిన 23 మునిసిపాలిటీల్లోనూ వైఎస్సార్ సీపీ విజయం సాధించింది. ఐదు మునిసిపాలిటీల్లో మాత్రమే టీడీపీ రెండంకెల స్థానాలు దాటింది. మిగిలిన చోట సింగిల్ డిజిట్, జీరోకే పరిమితమయ్యారు.
కాంగ్రెస్ పార్టీ ఈ చిత్రంలో ఎక్కడా కనిపించలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంపై ప్రజలు ఉంచిన విశ్వాసమే ఈ అద్భుతమైన విజయానికి కారణమని వైఎస్ఆర్సీ అప్పట్లో పేర్కొంది. వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టిన తరువాత 22 నెలల్లో ఆయన అమలు చేసిన సంక్షేమ ఎజెండా ఈ ఫలితాలను ఇచ్చిందని వైఎస్సార్సీపీ ప్రకటించింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇద్దరు బీజేపీ వార్డు సభ్యులు గెలిచారు. ఆ మునిసిపాలిటీ టీడీపీ వశమైంది.
26 జిల్లాల్లో 123 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. వీటిలో 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మునిసిపాలిటీలు 29 నగర పంచాయతీలు ఉన్నాయి.
97 చోట్ల వైఎస్సార్సీపీ గెలుపు
2021 మార్చిలో 100 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగ్గా 97 చోట్ల వైఎస్సార్సీపీ విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ మూడు చోట్ల గెలుపొందింది. 13 మునిసిపల్ కార్పొరేషన్ లు వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుంది. 57 మునిసిపాలిటీలు, 27 నగర పంచాయతీల్లో విజయకేతనాన్ని ఎగుర వేసింది. అనంతపురం, నెల్లూరు కార్పొరేషన్లలో ఒక్క డివిజన్ కూడా టీడీపీ గెలవలేదు. పుంగనూరు, రాయచోటి, పులివెందుల, ధర్మవరం, వెంకటగిరి, పిడుగురాళ్ల, మాచర్ల, తుని మునిసిపాలిటీల్లో తెలుగుదేశం పార్టీ ఒక్క వార్డును కూడా గెలుచుకోలేకపోయింది.
మూడు చోట్ల తెలుగుదేశం
తెలుగుదేశం పార్టీ రెండు మునిసిపాలిటీలు, ఒక నగర పంచాయతీలో విజయం సాధించింది. అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపాలిటీలో 36 వార్డులు ఉండగా అందులో వైఎస్సార్సీపీ 16, తెలుగుదేశం పార్టీ 18, బీజేపీ 2 సీట్లు గెలుచుకుంది. దీంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ప్రకాశం జిల్లా నగర పంచాయతీలో 20 వార్డులు ఉంటే అందులో వైఎస్సార్సీపీ 7 వార్డులు, టీడీపీ 13 వార్డులు గెలుచుకుంది. దీంతో ఇక్కడ టీడీపీ గెలిచింది. ఇక కృష్ణా జిల్లా కొండపల్లి మునిసిపాలిటీలో 29 వార్డులకు గాను వైఎస్సార్సీపీ 14, తెలుగుదేశం పార్టీ 14 స్థానాల్లో గెలుపొందారు. బిజెపి ఒక స్థానంలో గెలిచింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ బీజేపీ మద్దతుతో మునిసిపాలిటీని గెలుచుకుంది.
13 మునిసిపాలిటీల్లో టీడీపీ జీరో
అనంతపురం, నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ లలో తెలుగుదేశం, దాని మిత్ర పక్షాలకు ఒక్క సీటు కూడా దక్కలేదు. అనంతపురంలో ఉన్న 48 డివిజన్ లలోనూ వైఎస్సార్ సీపీ వారే గెలిచారు. నెల్లూరులో ఉన్న 54 డివిజన్ లలోనూ వైఎస్సార్సీపీనే గెలిచింది. ఇక పుంగనూరు, రాయచోటి, పులివెందుల, ధర్మవరం, వెంకటగిరి, పిడుగురాళ్ల, మాచర్ల, తుని మునిసిపాలిటీల్లో తెలుగుదేశం, దాని మిత్ర పక్షాలు పార్టీలు ఒక్క సీటు కూడా గెలవలేకపోయాయి. ఈ మునిసిపాలిటీల్లో జీరో ఫలితాలు ప్రతిపక్షాలు వచ్చాయి. కనిగిరి, జమ్మలమడుగు, యర్రగుంట్ల నగర పంచాయితీల్లోనూ ఒక్క సీటు కూడా టీడీపీ గెలవలేదు.
ఏ పార్టీకి ఎన్ని వార్డులు
కార్పొరేషన్ లలో 725 డివిజన్ లకు 2021లో జరిగిన ఎన్నికల్లో 619 డివిజన్లలో వైఎస్సార్సీపీ, 79 డివిజన్లలలో టీడీపీ, 7 డివిజన్లలో జనసేన, ఒక చోట కాంగ్రెస్, 18 చోట్ల బీజేపీ సభ్యులు గెలిచారు. మునిసిపాలిటీల్లో 1819 వార్డులకు ఎన్నికలు జరుగగా 1518 వార్డుల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. 232 వార్డుల్లో టీడీపీ, 15 వార్డుల్లో జనసేన, 4 వార్డుల్లో కాంగ్రెస్, 50 వార్డుల్లో బీజేపీ గెలిచింది. ఇక నగర పంచాయతీల్లో 578 వార్డులకు ఎన్నికలు జరిగితే 438 వార్డుల్లో వైఎస్సార్సీపీ, 118 వార్డుల్లో టీడీపీ, 6 వార్డుల్లో జనసేన, 4 వార్డుల్లో కాంగ్రెస్, 10 వార్డుల్లో బీజేపీ గెలిచాయి.
ప్లేట్ ఫిరాయిస్తున్న వైఎస్సార్ సీపీ మేయర్లు, చైర్మన్ లు
వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోగానే తెలుగుదేశం పార్టీ వైపు ఒక్కరొక్కరుగా వరుస కట్టి చేరి పోతున్నారు. నేరుగా మెజారిటీ సభ్యులు చేరటంతో తెలుగుదేశం పార్టీ జెండా పాతుతోంది. ఇటీవల కొన్ని జిల్లాల్లో ఖాళీగా ఉన్న మేయర్లు, చైర్మన్ లు, డిప్యూటీ చైర్మన్లు, వార్డు సభ్యుల పోస్టులకు ఎన్నికలు జరిగాయి. మూడు సార్లు వాయిదా పడి కిందాపైన పడిన తరువాత తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఒక్క పాలకొండ నగర పంచాయతీని మాత్రం స్వాధీనం చేసుకోలేకపోయింది. ఉదాహరణకు ప్రకాశం జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్, మార్కాపురం, గిద్దలూరు మునిసిపాలిటీలు, దర్శి, కనిగిరి నగర పంచాయతీలు ఉన్నాయి. ఒంగోలు కార్పొరేషన్ మేయర్ తో పాటు మిగిలిన సభ్యుల్లో సగం మందికి పైన టీడీపీ, జనసేనలో చేరారు. దీంతో మునిసిపల్ కార్పొరేషన్ టీడీపీ వశమైంది. మార్కాపురంలోనూ టీడీపీ మునిసిపాలిటీని స్వాధీనం చేసుకుంది. గిద్దలూరులోనూ అదే పరిస్థితి ఉంది. ఇక దర్శిలో అప్పట్లో టీడీపీనే గెలిచింది. కనిగిరి కూడా రేపోమాపో తెలుగుదేశం జెండా పాతుతోంది.
తిరుపతి మునిసిపాలిటీలో 48 డివిజన్ లు ఉంటే అక్కడ టీడీపీ ఒక్క డివిజన్ లో మాత్రమే గెలిచింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కిడ్నాప్ లు, ఇతర దండోపాయాలు ఉపయోగించి తెలుగుదేశం పార్టీ స్వాధీనం చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా తుని నగర పంచాయతీని తెలుగుదేశం పార్టీ స్వాధీనం చేసుకుంది. కాకినాడ రూరల్ కూడా టీడీపీ చేతుల్లోకి వెళుతోంది. ఇలా ఒకటేమిటి మునిసిపాలిటీల్లో దాదాపు 70 శాతం వరకు తెలుగుదేశం పార్టీ వశమయ్యాయి. కొందరు వార్డు సభ్యులు ప్రలోభాలకు లొంగి తెలుగుదేశం పార్టీని ఆశ్రయించారు. మరి కొందరు భయపడి చేరుతున్నట్లు ప్రకటించారు. పిడుగు రాళ్ల మునిసిపాలిటీ 33 వార్డుల్లో ఒక్కటి కూడా తెలుగుదేశం గెలవలేదు. ఇటీవల మునిసిపల్ చైర్మన్ పదవికి జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించినట్లు ప్రకటించుకుంది.
మరో ఏడాదిలో ఎన్నికలు
వచ్చే సంవత్సరం మార్చిలో మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ విధంగా మునిసిపాలిటీలు మారిపోవడం తెలుగుదేశం పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడిందనే భావన పలువురు రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ తన బలాన్ని నిరూపించుకునేందుకు రానున్న మునిసిపల్ ఎన్నికల్లో అధికార పార్టీని తట్టుకుని పోరాటం చేస్తుందా? లేక వదిలేస్తుందా? అనేది వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో కూడా సుమారు 80 శాతం సర్పంచ్ లు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారు.
రాజకీయాల్లో ఏవైనా జరగొచ్చని చెప్పేందుకు మునిపల్ ఎన్నికల్లో గెలుపొందిన వారే ఉదాహరణ. తాము వైఎస్సార్ సీపీ గుర్తుపై గెలిచి బహిరంగంగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వారి సభ్యత్వం నిబంధనల ప్రకారం రద్దు కావాలి. వడ్డించే వాడు ఉంటే చివరి బంతిలో కూర్చున్నా పంచభక్ష్య పరమాణాలు తినొచ్చన్న చందంగా పార్టీల్లోని వ్యక్తులు మారి పోయారు. 2014లో అధికారం చేపట్టిన ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కూడా ఇచ్చిన విషయం మనం చూశాం. పార్టీ మారుతున్నట్లు ప్రకటించగానే పదవులు కూడా పోవాలి. కానీ ఏకంగా మంతులు కాగలిగారు. అందువల్ల తెలుగుదేశం పార్టీకి వాపా, బలుపా అని చెప్పటానికి కూడా లేదు.