మరోసారి హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అంశంపైనే ఆయన ఈరోజు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అంశంపైనే ఆయన ఈరోజు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో తనకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కల్పించేలా స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసు విచారించిన న్యాయస్థానం.. స్పీకర్ కార్యదర్శికి నోటీసులు జారీ చేసి.. విచారణను వాయిదా వేసింది. కాగా ఇప్పుడు జగన్ తన వ్యక్తిగత భద్రత అంశంపై మరో పిటిషన్ దాఖలు చేశారు. తనకు గతంలో ఉన్న భద్రతనే కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలని జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీపై ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని, అందులో భాగంగానే తనకు భద్రతను కూడా తగ్గించేసిందని ఇటీవల తెగ ప్రచారం కూడా జరిగింది.
పాత భద్రతే కావాలి..
‘‘నాకు గతంలో ఉన్న స్థాయి భద్రతనే కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయండి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే నాకున్న భద్రతను కూడా తొలగించింది. నన్ను అంతమొందించడమే కూటమి ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకున్నట్లు అనిపిస్తోంది. నాకు ప్రాణహాని ఉందన్న అంశాన్ని పరిశీలించకుండా నాకున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తొలగించి సాధారణ వాహనాలను కేటాయించింది. వీటిని మార్చాలని, నాకు గతంలో ఉన్న భద్రతనే కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని విన్నవించుకుంటున్నాను’’ అని జగన్ తన పటిషన్‌లో పేర్కొన్నారు. అయితే కొన్ని రోజులగా జగన్ భద్రత విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కక్ష పూరితంగానే ప్రభుత్వం జగన్ భద్రతను తగ్గించేసిందని వైసీపీ శ్రేణులు తీవ్ర ఆరోపణలు చేశాయి.
అదేం లేదు: అధికారులు
అయితే జగన్ భద్రతపై విమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలోనే ఈ అంశంపై పోలీసు శాఖ, ప్రభుత్వ వర్గాలు గతంలోనే క్లారిటీ ఇచ్చారు. తాము నిబంధనల ప్రకారమే జగన్‌కు భద్రత కల్పించామని చెప్పారు. జగన్‌కు కేటాయించిన వాహనాలు కండిషన్‌లో లేవని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని, జగన్ తన వ్యక్తిగత వాహనంలో వచ్చినంత సేపు కాన్వాయ్ వాహనం కూడా వెనకే వచ్చిందని, కండిషన్‌లో లేకుండా అదెలా సాధ్యమైందని కూడా వారు ప్రశ్నించారు. జగన్ భద్రతపై జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమేనని కూడా తోసిపుచ్చారు. ‘‘జగన్‌కు జెడ్ ప్లస్ భద్రత కొనసాగుతోంది. సీఎం హోదాలో అదనంగా ఇచ్చే భద్రతను మాత్రమే తొలగించాం. ఆయనకు సీఎం హోదా భద్రత ఇవ్వడం కుదరదు’’ అని ప్రభుత్వ వర్గాలు తేల్చి చెప్పాయి. మరి ఈ పిటిషన్‌పై కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.