‘ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసును సీబీఐకి అప్పగించండి ’

బీఎస్పీ తమిళనాడు చీఫ్ ఆర్మ్‌స్ట్రాంగ్ మృతికి నివాళి అర్పించారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలంటే కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు.

Update: 2024-07-07 07:32 GMT

బీఎస్పీ తమిళనాడు అధ్యక్షుడు కె ఆర్మ్‌స్ట్రాంగ్ మృతిపై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేశారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. ఇప్పటివరకు అరెస్టయిన వారు అసలు నిందితులు కాదని, బాధిత కుటుంబానికి న్యాయం జరగాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థకు కేసు అప్పగించాలని ఆమె తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ను కోరారు.

మాయావతి చెన్నైలో 52 ఏళ్ల ఆర్మ్‌స్ట్రాంగ్‌కు నివాళిలర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యను బట్టి చూస్తే..రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదనిపిస్తుందన్నారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న నమ్మకం లేదని, కేసును సీబీఐకి అప్పగించాలని ఆమె డిమాండ్ చేశారు. ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యతో రాష్ట్రవ్యాప్తంగా దళితులు ఆందోళన చెందుతున్నారని, వారికి భద్రత కల్పించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

ప్రతీకార హత్య..

ఆర్మ్‌స్ట్రాంగ్‌ శుక్రవారం రాత్రి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. పెరంబూర్‌లో నివాసం ఉంటున్న ఆయనపై ఆరుగురు దుండగులు కత్తితో దాడిచేసి హతమార్చారు. ఈ కేసులో ఇప్పటికే పున్నై బాలు, అతని అనుచరులు రాము, తిరువెంగడం, తిరుమలై, సెల్వరాజ్, మణివణ్ణన్, సంతోష్, అరుళ్‌ లొంగిపోయారు. ఆర్కాడు సురేష్‌ హత్యకు పగ తీర్చుకునేందకే ఆర్మ్‌స్ట్రాంగ్‌ను హత్య చేసినట్లు నిందితులు వాగ్మూలం ఇచ్చారు.

‘హత్యలో రాజకీయ కోణం లేదు’

కాగా ఆర్మ్‌స్ట్రాంగ్‌ హత్యలో రాజకీయ కోణం లేదని గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనరు సందీప్‌రాయ్‌ రాథోర్‌ తెలిపారు. హత్య కేసులో సంబంధం ఉన్న వారిని అరెస్టు చేయడానికి 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హత్య జరిగిన మూడు గంటల్లో ఎనిమిది మంది లొంగిపోయినట్లు పేర్కొన్నారు.

Tags:    

Similar News