చెరుకు ధర పెంపుపై కర్ణాటక రైతుల పట్టు
సీఎం తో సమావేశానికి విముఖత వ్యక్తం చేసిన రైతు సంఘాలు
By : The Federal
Update: 2025-11-06 11:43 GMT
కర్ణాటక చెరుకు రైతులను ఆ రాష్ట్ర మంత్రి హెచ్ కే పాటిల్ బెంగళూర్ లో ఉన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తో సమావేశానికి ఆహ్వానించారు. అక్కడి రైతులు టన్ను చెరుకు రూ. 3500 డిమాండ్ చేస్తుండటంతో సంక్షోభం ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఆఫర్ ను రైతులు తిరస్కరించారు. తమకు మద్దతు ధర ప్రకటిస్తే నిరసనలను ఉపసంహరించుకుంటామని చెప్పారు.
ఉత్తర కర్ణాటక లో రైతుల నిరసన
గుర్లాపూర్ క్రాస్ వద్ద రైతులు చేస్తున్న నిరసన ఏడో రోజుకు చేరుకుంది. ఈ నిరసనలు బెళగావి, బాగల్ కోట్, హవేరితో సహ అనేక ఉత్తర కర్ణాటక జిల్లాలకు విస్తరించాయి.
న్యాయ పార్లమెంటరీ వ్యవహరాల మంత్రి ప్రభుత్వం తరఫున రైతు ప్రతినిధులను కలిసి, ముఖ్యమంత్రితో కలిసి చర్చలు జరపడానికి వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు.
ఈ ఆందోళనలకు వివిధ రైతు సంఘాలు, సంస్థలు, ప్రతిపక్ష బీజేపీ సభ్యులు విద్యార్థుల నుంచి మద్దతు లభించింది. బెళగావి ప్రాంతంలో కీలక మార్గాలలో నిరసన తెలుపుతున్న రైతులు టైర్లు, దిష్టి బొమ్మలను తగలబెట్టి నిరసన తెలిపారు.
మంత్రి చర్చలు..
రైతుల డిమాండ్లను విన్న తరువాత గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి తో సమావేశం ఏర్పాటు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, మధ్యాహ్నం నాటికి తుది నిర్ణయం తీసుకుంటామని పాటిల్ తెలిపారు.
‘‘నవంబర్ 7 న ఉదయం చక్కెర కర్మాగారాలలో సమావేశం ఉంటుంది. ఆ తరువాత అధికారులతో సమావేశం ఉంటుంది. వారి నుంచి అభిప్రాయాలను స్వీకరించిన తరువాత నవంబర్ 7 న తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించబోతున్నాం. ఇది రైతులకు అనుగుణంగా ఉంటుంది’’ అని ఆయన అన్నారు. సమావేశానికి రావాల్సిందిగా రైతుల ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించారు.
రైతుల తరఫున పోరాటం చేస్తున్న శ్రీ శశికాంత్ గురూజీ ఈరోజు సాయంత్రం నాటికి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తేనే నిరసనను ఉపసంహరించుకుంటామని అన్నారు.
‘‘ మా నిరసన కొనసాగుతుంది. మేము దానిని వదిలి పెట్టి ముఖ్యమంత్రి కలవడానికి బెంగళూర్ కు వెళ్లినట్లయితే, అది మా తోటి రైతులకు తప్పుడూ సందేశాన్ని పంపుతుంది. ’’ అని ఆయన అన్నారు.
బెళగావికి చెందిన జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి సతీశ్ జార్కీహోళీ, లక్ష్మీ హెబ్బాళ్కర్ లు రైతులను కలవకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
రాష్ట్ర సహాయం కోరుతున్న రైతులు..
చక్కెర కర్మాగారాలు టన్నుకు రూ. 3500 కంటే తక్కువ చెల్లిస్తే, రాష్ట్రం లోటును భర్తీ చేయాలని రైతు నాయకుడు చునప్ప పూజారి ప్రభుత్వాన్ని కోరారు.
బెళగావిలో జరిగిన రైతుల నిరసనలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయేంద్రను రైతు నాయకులు సత్కరించారు. కర్ణాటక ముఖ్యమంత్రి బీజేపీ ఎంపీ బస్వరాజ్ బొమ్మై మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను తక్షణమే జోక్యం చేసుకుని చెరుకు రైతుకు టన్నుకు రూ. 3500 చొప్పున అందేలా చూడాలని కోరారు.
రైతుల డిమాండ్ ను తీర్చడానికి చక్కెర కర్మాగారాలు టన్నుకు రూ. 3,300 చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం టన్నుకు రూ. 200 చెల్లించాలని బొమ్మై సూచించారు. ప్రభుత్వంలోని అనేక మంది మంత్రులు చక్కెర పరిశ్రమలపై స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని, అందుకే ముఖ్యమంత్రి స్వయంగా ఈ సమస్యను పరిష్కరించడంలో ముందడుగు వేయాలని ఆయన అన్నారు.