అందరి కళ్ళు ఈ విమానంపైనేనా ? దీని కథేమిటో చూద్దామా ?
డిసెంబర్ 9వ తేదీన ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ED) పర్యవేక్షణలో ఈ విమానం వేలంపాట జరగబోతోంది
ఇపుడందరి కళ్ళు ఈ విమానంపైనే నిలిచింది. బేగంపేట విమానాశ్రయంలో నిలిపి ఉంచిన ఫాల్కన్ విమానం ‘హాకర్ 800 A’ వేలానికి వచ్చింది. డిసెంబర్ 9వ తేదీన ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ED) పర్యవేక్షణలో ఈ విమానం వేలంపాట జరగబోతోంది. కారణం ఏమిటంటే విమానం తాలూకు యాజమాన్యం చేసిన మోసపూరిత వ్యాపారంలో బాధితులకు డబ్బులు పంపిణీ చేయటం కోసమే ఈడీ విమానాన్ని వేలం జరగబోతోంది. వేలం ద్వారా వచ్చిన డబ్బును బాధితులకు పంపిణీ చేయాలని ఈడీ ఇప్పటికే డిసైడ్ అయ్యింది.
ఇంతకీ విషయం ఏమిటంటే కొంతకాలం క్రితం ఫాల్కన్ యాజమాన్యం ‘ఫేక్ ఇన్ వాయిస్ డిస్కౌంటింగ్ స్కీము’ పేరుతో చేసిన రు. 792 కోట్ల మోసం బయటపడింది. బాధితుల ఫిర్యాదుతో సైబరాబాద్ ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ ఈ ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన కేసు నమోదుచేసుకుని దర్యాప్తు మొదలుపెట్టింది. ఎకనమిక్ అఫెన్స్ వింగ్ నమోదుచేసిన మూడు ఎఫ్ఐఆర్ ల ఆధారంగా ఈడీ కూడా రంగంలోకి దిగి మనీల్యాండరింగ్ కోణంలో దర్యాప్తు మొదలుపెట్టింది. ఈడీ దర్యాప్తులో పెట్టుబడిదారులను రు. 792 కోట్లకు ఫేక్ ఇన్వాయిస్ పేరుతో యాజమాన్యం మోసంచేసినట్లు గుర్తించింది. తమ సంస్ధలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీలను ఆశచూపించి ఫాల్కన్ యాజమాన్యం భారీ ఎత్తున పెట్టుబడులను రాబట్టింది.
మొదట్లో కొందరికి అధిక వడ్డీలను చెల్లించిన యాజమాన్యం తర్వాత వడ్డీలు చెల్లించటం మాట దేవుడెరుగు అసలుకే ఎసరుపెట్టింది. దాంతో ప్రతినెలా రావాల్సిన వడ్డీలు రాకపోయేసరికి పెట్టుబడిదారులు యాజమాన్యాన్ని నిలదీశారు. సంస్ధ ఛైర్మన్ అమర్ దీప్ సోదరుడు సందీప్ కుమార్, సంస్ధ ఛార్టెడ్ ఎకౌంటెంట్ శరద్ చంద్ర తోష్నివాల్, క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేటు లిమిటెడ్ సీఓఓ ఆర్యన్ సింగ్ ఛాబ్రాను పోలీసులు అరెస్టుచేశారు. పైన చెప్పిన వారిపై కేసులు నమోదు కాకముందే సంస్ధ ఛైర్మన్ అమర్ దీప్ ప్రత్యేక విమానంలో విదేశాలకు పారిపోయాడు.
అమర్ దీప్ కోసం ఈడీ ఎంత ప్రయత్నించినా ఆచూకీ కనిపెట్టలేకపోయింది. దర్యాప్తులో తేలింది ఏమిటంటే అమర్ దీప్ తనఅవసరాల కోసం సొంతంగా 2024లో ఒక విమానాన్నే కొన్నాడు. ఆ విమానంలోనే విదేశీలకు పారిపోయాడు. విదేశాల్లో సదరు విమానాన్ని మెడికల్ ఎయిర్ అంబులెన్స్ గా అద్దెకు ఇచ్చి గంటకు 3500 డాలర్లు సంపాదిస్తున్నాడని ఈడీ అధికారులకు తెలిసింది. విమానంతో పాటు యజమాని అమర్ దీప్ పై ఈడీ లుకౌట్ నోటీసులు జారీచేసింది. దీంతో దేశంలోకి హాకర్ 800 ఏ విమానం వచ్చినా, అమర్ దీప్ వచ్చినా వెంటనే ఈడీ అధికారులకు తెలిసిపోతుంది.
ఈ నేపధ్యంలోనే శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో హాకర్ 800ఏ విమానం 2025 మార్చి 7వ తేదీన ల్యాండయినట్లు ఈడీకి సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన ఈడీ అధికారులు హాకర్ 800ఏ విమానాన్ని స్వాధీనం చేసుకుని బేగంపేట విమానాశ్రయంలో ఉంచారు. ఈడీ చెప్పిన ప్రకారం ఫాల్కన్ యాజమాన్యం పెట్టుబడిదారులనుండి రు. 1700 కోట్లు వసూలుచేసింది. ఇందులో కొంతమొత్తాన్ని పెట్టుబడిదారులకు చెల్లించినా ఇంకా చెల్లించాల్సిన రు. 792 కోట్ల బకాయిలు ఉండిపోయాయి. యాజమాన్యినికి చెందిన రు. 18.63 కోట్ల విలువైన ఆస్తులను కూడా ఈడీ ఎటాచ్ చేసుకుంది.
బాధితులకు న్యాయంచేయటంలో భాగంగానే హాకర్ విమానాన్ని వేలంవేయాలని ఈడీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన న్యాయ, పరిపాలనా పరమైన ప్రక్రియను ఈడీ పూర్తిచేసి వేలంపాట నోటీసులను జారీచేసింది. ఈనెల 7వ తేదీవరకు విమానాన్ని కొనుగోలు చేయదలచుకున్న పార్టీలు ప్రత్యక్షంగాచూసి తనిఖీ చేసుకోవచ్చు. 9వ తేదీన జరగబోయే వేలంపాటలో విమానం ఎంత ధరకు అమ్ముడవుతుందన్న విషయం తేలుతుంది. విమానాన్ని వేలంలో అమ్మినా బాధితులకు ఇవ్వాల్సిన రు. 792 కోట్లయితే రావన్నది వాస్తవం. చివరకు ఏమవుతుందో చూడాలి.