బీసీ రిజర్వేషన్ల ఆమోదం గంటలో అయిపోతుందా..?

ధర్నాలు, గిర్నాలు అంటూ రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారన్న బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్.;

Update: 2025-07-30 12:14 GMT

బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, బీజేపీ రెండూ కూడా చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నాయని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ విమర్శించారు. గంటలో అయిపోయే పనిని కూడా వీళ్లు కావాలనే తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. బీసీలకు న్యాయం చేయాలన్న ఉద్దేశం ఉంటే వారికి 42శాతం రిజర్వేషన్లు కల్పించడం బీజేపీ, బీఆర్ఎస్‌కు పెద్ద పనా? అని అన్నారు. కానీ వారికి రిజర్వేషన్లు కల్పించాలన్న చిత్తశుద్ధి లేదని, అందుకే ఎప్పటికప్పుడు కుంటి సాకులు చెస్తూ కాలం వెళ్లదీస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తలుచుకుంటే గంటలోపే బీసీ బిల్లుకు పార్లమెంటులో ఆమోదం లభిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. కానీ వాళ్లు కావాలనే దీనిని తేల్చకుండా సాగదీస్తున్నారని అన్నారు. అసెంబ్లీ, శాసన మండలి ఆమోదం తెలిపిన బిల్లుపైనే ఆర్డినెన్స్ సాధ్యం కాదంటూ బీజేపీ, కాంగ్రెస్‌ మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటికయినా బూటకపు మాటలు, బుకాయింపు బాటలు మానుకోవాలని అన్నారు.

‘‘ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. చట్టసవరణ చేసి తొమ్మిదో షెడ్యూల్‌లో చేరిస్తేనే బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైన రక్షణ లభిస్తుంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ.. లోక్‌సభలో ప్రైవేటు బిల్లు పెట్టాలి. రాహుల్ గాంధీ అడగరు, మోదీ చేయరు, అన్నట్లు ఉంది. ఆర్టికల్ 243డీ లోని సీ క్లాజ్‌కు సవరణ చేసినా కూడా బీసీ రిజర్వేషన్లు సాధ్యమవుతుంది. సీఎం స్థానంలో కూర్చున్న రేవంత్ రెడ్డి.. ధర్నాలు, పోరాటాలు అని డ్రామాలు ఆడుతున్నారు. తమ నేత రాహుల్ గాంధీతో కలిసి వెళ్లి మోదీని కలిస్తే బీసీ రిజర్వేషన్లకు పరిష్కారం వస్తుంది కదా. బీజేపీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ హయాంలో ఆమోదించిన, రేవంత్ రెడ్డి హాయంలో ఆమోదించిన బిల్లులను తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలి’’ అని డిమాండ్ చేశారు.

రిజర్వేషన్లు గంట పనా..!

వినోద్ కుమార్ అన్నట్లు రిజరవేషన్లకు చట్టబద్ధత కల్పించడం గంటలో జరిగిపోయే పనా అంటే రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. మోదీ, రాహుల్ గాంధీ కలిసి వచ్చినా రిజర్వేషన్ల బిల్లుకు ఆమోద ముద్ర వరకే పడుతుందని, ఆ తర్వాత న్యాయపరమైన చిక్కుల గురించి వినోద్ కుమార్ మరుస్తున్నట్లు ఉన్నారని విశ్లేషకులు చెప్తున్నారు.

Tags:    

Similar News