ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై బిజెపి నిరసన

గాంధీభవన్ ముట్టడికి యత్నం.. పలువురు నేతలు అరెస్ట్

Update: 2025-12-03 14:00 GMT

నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. నాంపల్లిలోని గాంధీభవన్ ముట్టడించేందుకు ర్యాలీగా బయలుదేరిన బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో బీజేపీ నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. బిజెపి కార్యాలయానికి గాంధీ భవన్ కూత వేటు దూరంలో ఉండటంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు గాంధీ భవన్ వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హిందూ దేవుళ్లపై వ్యాఖ్యలు చేసినట్టు బిజెపి శ్రేణులు ఆరోపిస్తున్నాయి. దీనిపై బీజేపీ నేతలు బుధవారం స్పందిస్తూ ఆందోళన చేపట్టారు.

సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పే వరకు తాము పోరాటం చేస్తామని హెచ్చరించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యల్లో ఎటువంటి తప్పు లేదని కాంగ్రెస్ పార్టీ నేతలు సమర్థిస్తున్నారు. నేతల మధ్య ఏమైనా మనస్పర్థలు ఉంటే వాటిని అధిగమించి అందరిని కలుపుకుని పోవాలనే ఉద్దేశ్యంతో సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్ల ప్రస్తావన తీసుకొచ్చారని చెప్పారు.

హిందూ దేవుళ్లను కించపరిచే ఉద్దేశ్యం సీఎం రేవంత్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు స్పష్టం చేస్తున్నారు. అదీకాక రేవంత్ రెడ్డి ప్రజా పాలన చూసి బీజేపీ నేతలు ఓర్వలేకపోతున్నారని, అందుకే సీఎం రేవంత్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

రేవంత్ వ్యాఖ్యలు సరి కాదు :రాంచందర్ రావు

హిందు దేవుళ్లపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని తెలంగాణ బీజేపీ చీఫ్‌ రాంచందర్‌ రావు అన్నారు. హిందువులు మూడు కోట్ల మంది దేవుళ్ళను పూజిస్తారని, ఇంత మంది దేవుళ్లు ఉన్నారా? అని రేవంత్ మాట్లాడుతున్నారని రాంచందర్‌రావు విమర్శించారు. సీఎం రేవంత్‌కి మజ్లీస్ పార్టీ దేవుళ్ళను విమర్శించే దమ్ముందా? అని రాంచందర్ రావు సూటిగా ప్రశ్నించారు.

అవహేళన చేస్తే ఊరుకోం : కిషన్ రెడ్డి

హిందువులకు సంబంధించిన దేవీదేవతలను అవహేళన చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఒక హిందువుగా ఉంటూ, హిందువుల మీద, దేవీదేవతల మీద రేవంత్‌రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు. మజ్లిస్ సహవాస దోషం వల్లే రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడుతున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో హిందువులంతా ఏకం కావలసిన సమయం ఆసన్నమైందన్నారు. ఏ ఓట్లతో అయితే రేవంత్‌రెడ్డి అధికార పీఠమెక్కి మాట్లాడుతున్నారో..అదే ఓట్లతో కాంగ్రెస్ పార్టీకి బుద్దిచెప్పాలని మరో కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు.

Tags:    

Similar News