ఫిరాయింపు ఎంఎల్ఏ ‘దానం’ సంచలన ప్రకటన

దానం(Khairatabad MLA Danam Nagendar) ప్రకటన విన్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు.;

Update: 2025-09-14 08:26 GMT
BRS MLA Danam Nagendar

ఫిరాయింపు ఎంఎల్ఏల్లో ఖైరతాబాద్ ఎంఎల్ఏ దానంనాగేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హిమాయత్ నగర్ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఆదివారం ఉదయం ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా దానం మాట్లాడుతు తాను బీఆర్ఎస్(BRS) తరపున గెలిచినా ప్రస్తుతం కాంగ్రెస్(Telangana Congress)లో ఉన్నట్లు చెప్పారు. దానం(Khairatabad MLA Danam Nagendar) ప్రకటన విన్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఎందుకంటే 10మంది ఫిరాయింపు ఎంఎల్ఏల(BRS Defection MLAs)పై అనర్హత వేటువేయించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) చేస్తున్న ప్రయత్నాలు అందరికీ తెలిసిందే. అనర్హత వేటు వేయించేందుకు కేటీఆర్ సుప్రింకోర్టులో కేసులు దాఖలు చేసి విచారణ కూడా చేయించారు.

సుప్రింకోర్టు ఆదేశాల ప్రకారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫిరాయింపులపై విచారణ చేస్తున్నారు. ఇప్పటికి 8మంది ఫిరాయింపు ఎంఎల్ఏలు స్పీకర్ నోటీసులకు సమాధానాలు ఇచ్చేశారు. ఇంకా దానంతో పాటు స్టేషన్ ఘన్ పూర్ ఎంఎల్ఏ కడియం శ్రీహరి సమాధానాలు ఇవ్వాల్సుంది. ఎలాగైనా అనర్హత వేటునుండి తప్పించుకోవాలని ఫిరాయింపు ఎంఎల్ఏలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే చాలామంది తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని, కాంగ్రెస్ లోకి మారలేదని పదేపదే ప్రకటిస్తున్నారు. ఈనేపధ్యంలో తాను బీఆర్ఎస్ తరపున గెలిచినా ప్రస్తుతం కాంగ్రెస్ లో కంటిన్యు అవుతున్నట్లు దానం చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఏ ధైర్యంతో దానం కాంగ్రెస్ లో ఉన్నట్లు ప్రకటించారో అర్ధంకావటంలేదు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. అదేమిటంటే ఫిరాయింపు పదిమంది ఎంఎల్ఏల్లో తొమ్మిదిమంది ఏదోవిధంగా అనర్హత వేటునుండి తప్పించుకునే అవకాశాలున్నాయి. దానంకు మాత్రం అవకాశంలేదు. ఏదోరోజు తప్పకుండా దానంపై అనర్హత వేటుపడటం ఖాయమనే ప్రచారం అందరికీ తెలిసిందే. దానంపైన అనర్హత వేటు ఎందుకు పడుతుంది ? ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన దానం 2024 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీచేశారు.

ఒకపార్టీ తరపున ఎంఎల్ఏ మరో పార్టీ తరపున పార్లమెంటుకు ఎలాగ పోటీచేయగలరు ? అప్పట్లో అనర్హతపై దానంకు సరైన క్లారిటిలేదో లేకపోతే ఏదైతే అది అయ్యిందనే తెగింపుతోనే దానం కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీచేశారో తెలీదు. ఇప్పుడైతే అనర్హత వేటుపడటం ఖాయమని అర్ధమవుతోంది. తనకు స్పీకర్ నుండి నోటీసులు ఇంకా అందలేదన్నారు. నోటీసులు అందుకున్న ఎంఎల్ఏలు సమాధానాలు ఇచ్చారని అయితే తనకు ఇంకా అందలేదన్నారు. నోటీసులు అందినాక తాను న్యాయనిపుణులతో సంప్రదించి స్పీకర్ కు సమాధానం ఇస్తానని దానం చెప్పారు.

ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసి...

కాంగ్రెస్ లో మరోచర్చ కూడా జరుగుతోంది. అదేమిటంటే ఖైరతాబాద్ ఎంఎల్ఏగా రాజీనామా చేయటానికి దానం సిద్ధంగా ఉన్నారని. ఎందుకంటే ఖైరతాబాద్ ఎంఎల్ఏగా రాజీనామా చేసి తొందరలోనే జరగబోయే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీచేయటానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారని. అయితే జూబ్లీహిల్స్ టికెట్ దక్కేది అనుమానంగా ఉండటం వల్లే ఇంకా ఖైరతాబాద్ ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయలేదు. జూబ్లీహిల్స్ టికెట్ ఖాయమైతే వెంటనే ఖైరతాబాద్ ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయటానికి రెడీగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.

రెంటికి చెడ్డ రేవడి

ఇక్కడే మరోవిషయం గుర్తుచేసుకోవాలి. అదేమిటంటే 2004లో అసిఫ్ నగర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ టికెట్ దక్కకపోవటంతో టీడీపీలో చేరిపోటీచేశారు. ఆఎన్నికల్లో దానంగెలిచారు. అయితే దివంగత వైఎస్సార్ నాయకత్వంలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అందుకని వెంటనే టీడీపీ ఎంఎల్ఏగా రాజీనామాచేశారు. దానం ఉద్దేశ్యం ఏమిటంటే ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేయాలని. గెలిచిన తర్వాత వైఎస్ క్యాబినెట్లో మంత్రి అవ్వాలని దానం ఆశించారు. అందులో భాగంగానే టీడీపీ ఎంఎల్ఏగా రాజీనామా చేశారు. వెంటనే ఉపఎన్నికలు వచ్చాయి. అనుకున్నట్లుగానే కాంగ్రెస్ టికెట్ సాధించి ఉపఎన్నికలో పోటీచేశారు. అయితే ఓటర్లు తిరస్కరించటంతో ఓడిపోయారు. ఇపుడు దానం ఆలోచనలు చూస్తుంటే అప్పటి అసిఫ్ నగర్ ఉపఎన్నిక ఫలితం గుర్తుకొస్తోంది అందరికీ. చివరకు ఏమవుతుందో చూడాలి.

Tags:    

Similar News