బీఆర్ఎస్ నిజనిర్ధారణ బృందాలా ? కొత్తగా ఏమి తేలుస్తాయి ?
నిజం ఏమిటో తేల్చటానికా లేకపోతే కేటీఆర్ ఆరోపణలే నిజమని చెప్పటానికా ఈ బృందాలు ?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైఖరి చాలా విచిత్రంగా ఉంది. ముందే తీర్పు చెప్పేసి తర్వాత తీరిగ్గా విచారణ మొదలుపెట్టినట్లుంది తన వ్యవహారం. హిల్ట్(హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ ఫర్మేషన్)లో రు. 5 లక్షల కోట్ల భూ కుంభకోణం జరిగిందని(KTR) కేటీఆర్, మాజీమంత్రి హరీష్(Harish Rao) తదితరులు ప్రతిరోజు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తునే ఉన్నారు. వీళ్ళ ఆరోపణలపై పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) ఎన్ని వివరణలు ఇచ్చినా వీళ్ళుమాత్రం ఆరోపణలు మానటంలేదు. విచిత్రం ఏమిటంటే ప్రభుత్వం ఇంకా హిల్ట్(HILT Policy) పై విధానపరమైన నిర్ణయం తీసుకోలేదు, ఉత్తర్వులు జారీచేయలేదని మంత్రి చెబుతున్నా వీళ్ళు వినటంలేదు. హిల్ట్ విధానం ఇంకా చర్చలదశలోనే ఉందని మంత్రి అంటున్నా బీఆర్ఎస్ నేతలు మాత్రం రేవంత్ ప్రభుత్వం రు. 5 లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు నానా గోలచేస్తున్నారు.
ఇపుడు పెద్ద జోక్ ఏమిటంటే హిల్ట్ రూపంలో ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడినట్లు తేల్చేసిన కేటీఆర్ కొత్తగా నిజనిర్ధారణ బృందాలను ఏర్పాటుచేయటమే. కేటీఆర్ నియమించిన బృందాలు హైదరాబాద్ చుట్టుపక్కలున్న పారిశ్రామికవాడల్లో బుధ, గురువారాల్లో పర్యటిస్తాయి. స్ధానిక నేతలను, ప్రజలను కలిసి వాస్తవ మార్కెట్ విలువకు, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని తెలుసుకుంటాయి. కేటీఆర్ ఆధ్వర్యంలో మాజీమంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ ఆలీ, శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనాచారి నేతృత్వంలో ఎనిమిది బృందాలు ఉప్పల్, చర్లపల్లి, మౌలాలి, కుషాయిగూడ, జీడిమెట్ల, కూకట్ పల్లి ప్రాంతాలతో పాటు సనత్ నగర్, బాలానగర్, మేడ్చల్ ఇండస్ట్రియల్ పార్క్, కాటేదాన్, హయత్ నగర్, బారాదరి పారిశ్రామికవాడల్లో పర్యటిస్తున్నాయి. కేటీఆర్ చెబుతున్న కుంభకోణం నిజమే అని తేల్చటానికి ప్రత్యేకంగా నిజనిర్దారణ బృందాలెందుకో ?
నిజనిర్ధారణ బృందాలు దేనికి ?
కుంభకోణం జరిగిందని ముందే నిర్ణయించేసి ఆరోపణలు చేస్తున్న కేటీఆర్ ఇపుడు కొత్తగా నిజనిర్ధారణ పేరుతో ఎనిమిది బృందాలను ఏర్పాటుచేయటంలో అర్ధం ఏమిటి ? క్షేత్రస్ధాయిలో పర్యటించిన బృందాలు రేవంత్ ప్రభుత్వం లక్షల కోట్ల భూకుంభకోణానికి పాల్పడిందనే కదా చెబుతాయి. ఇంతోటిదానికి మళ్ళీ నిజనిర్ధారణ బృందాలతో పనేముంది ? రు. 5 లక్షల కోట్ల విలువైన భూములను రేవంత్ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కేటీఆర్ పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. 9,300 ఎకరాలను మార్కెట్ విలువకన్నా అతి తక్కువ ధరలకే ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయబోతున్నట్లు విరుచుకుపడుతున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ రేటులో 30శాతానికే రెగ్యులరైజ్ చేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు రేవంత్ ప్రభుత్వం కుట్రచేస్తోందని కేటీఆర్ అంటున్నారు.
దుద్దిళ్ళ ఏమన్నారు
కేటీఆర్ ఆరోపణలకు మంత్రి దుద్దిళ్ళ గట్టిగానే సమాధానమిచ్చారు. మంత్రి ఏమన్నారంటే ప్రభుత్వ భూములపై ఎవరికీ హక్కులను బదిలీచేయటం లేదన్నారు. గత ప్రభుత్వాలు పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించటంలో భాగంగా కొందరికి శాశ్వతంగా తక్కువ రేట్లకు అమ్మేసినట్లు చెప్పారు. మరికొందరికీ దీర్ఘకాలానికి ప్రభుత్వ భూములను లీజుకు ఇచ్చినట్లు వివరించారు. లీజుకు ప్రభుత్వ భూములను తీసుకున్న వారికి హిల్ట్ పాలసీ వర్తించదన్నారు. ఎవరైతే శాశ్వతంగా భూములను కొనుగోలు చేసి పరిశ్రమల ఏర్పాటుచేసి ఇపుడు ఖాయిలాపడ్డాయో అలాంటి పరిశ్రమలకు చెందిన భూములకు మాత్రమే హిల్ట్ విధానం వర్తిస్తుందని స్పష్టంచేశారు. అప్పట్లో పరిశ్రమల ఏర్పాటు కోసం భూములను కొనుక్కొని ఇపుడు ఇతరత్రా అవసరాలకు ఉపయోగించుకోవాలని అనుకున్న వారికే హిల్ట్ పాలసీలో ధరలు నిర్ణయించి కన్వర్షన్ ఫీజును వసూలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు చెప్పారు. కేటీఆర్ అండ్ కో చెబుతున్నట్లు 9,300 ఎకరాలు కాదని కేవలం 4,500 ఎకరాల్లో మాత్రమే హిల్ట్ పాలసీని వర్తింపచేయబోతున్నట్లు వివరించారు.
ఇపుడు తాము ఆలోచిస్తున్న పాలసీని గతంలో బీఆర్ఎస్ కూడా అమలుచేసిన విషయాన్ని దుద్దిళ్ళ గుర్తుచేశారు. పరిశ్రమల ఏర్పాటు పేరుతో ప్రభుత్వ భూములపై తమకు కావాల్సిన వ్యక్తులకు యాజమాన్య హక్కులను బదిలీచేసిన చరిత్ర బీఆర్ఎస్ దే అని ఎదురుదాడి చేశారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్యం బారినుండి కాపాడేందుకు, ఓఆర్ఆర్ లోపలున్న ప్రజలకు స్వచ్చమైన గాలి, తాగునీరు అందించటంతో పాటు ఖాయిలాపడిన పరిశ్రమల భూములను వినియోగంలోకి తీసుకుని రావాలన్నదే తమ ప్రభుత్వ అభిమతంగా చెప్పారు.
సిరీస్ అనే ఫార్మా కంపెనీకి బీఆర్ఎస్ ప్రభుత్వం వంద ఎకరాలను ఏ పద్దతిలో దారాదత్తం చేసిందో చెప్పాలని మంత్రి ఎదురు ప్రశ్నించారు. ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ఫ్రీహోల్డ్ పద్దతిలో చాలామందికి దారాదత్తం చేసినపుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి నిబంధనలు గుర్తుకురాలేదా అని సూటిగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు కావాల్సిన వ్యక్తులకు ప్రభుత్వ భూమిని ఎలాగ అప్పగించేసిందో చెప్పాలని నిలదీశారు. మొత్తానికి ప్రభుత్వం తరపున ఎలాంటి వివరణలు వచ్చినా సరే తాము ముందుగానే అనుకున్న ఆరోపణలనే పదేపదే చేయాలని ఫిక్సయిపోయిన కేటీఆర్ ఇపుడు నిజనిర్ధారణ కమిటీలని క్షేత్రస్ధాయిలో తిరుగుతున్నారు.