‘బీఆర్ఎస్ చచ్చిన పాముతో సమానం’ బీజేపీ అధ్యక్షుడు
పాలనలో రెండుపార్టీలు విఫలమవ్వటంతో తెలంగాణ(Telangana)కు తీరని నష్టంజరిగినట్లు చెప్పారు;
బీఆర్ఎస్ ను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు చచ్చిన పాముతో సమానంగా పోల్చారు. 2028 ఎన్నికల్లో తమటార్గెట్ కాంగ్రెస్ పార్టీయే కాని బీఆర్ఎస్(BRS) ఎంతమాత్రం కాదన్నారు. కుటుంబకలహాల్లో ముణిగిపోయి, అవినీతి, అవకతవకలపై కేసులు, విచారణలను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ప్రజాధరణను కోల్పోయిందని అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు. ‘తెలంగాణ జర్నలిస్ట్స్ యూనియన్’ అధ్యక్షుడు కప్పర ప్రసాదరావు అధ్యక్షతన గురువారం ‘మీట్ ది ప్రెస్’ జరిగింది. ఈ సందర్భంగా రామచంద్రరావు(BJP President Ramachandra Rao) మాట్లాడుతు కాంగ్రెస్, బీఆర్ఎస్ పై ధ్వజమెత్తారు. పాలనలో రెండుపార్టీలు విఫలమవ్వటంతో తెలంగాణ(Telangana)కు తీరని నష్టంజరిగినట్లు చెప్పారు. బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో ఎలాంటి నష్టంజరిగిందో ఇప్పుడు కాంగ్రెస్(Telangana Congress) రెండే పాలనలో కూడా అదే జరుగుతోందని ఆరోపించారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలు, మూల్యాంకనంలో లోపాల కారణంగా వివాదాలు పెరిగి కోర్టు విచారణను ఎదుర్కొన్నట్లు గుర్తుచేశారు. ఈ కారణంగానే అప్పటి ప్రభుత్వం గ్రూప్ 1లో ఒక్కఉద్యోగాన్ని కూడా భర్తీచేయకుండా నిరుద్యోగులకు అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఇఫుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా నిరుద్యోగులకు అలాంటి అన్యాయమే జరుగుతోందన్నారు. గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనంలో జరిగిన లోపాలపై హైకోర్టు సీరియస్ అవటాన్ని అధ్యక్షుడు ఉదాహరణగా చెప్పారు. ఉద్యోగాలు భర్తీచేయకుండా రెండుప్రభుత్వాలూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నట్లు ధ్వజమెత్తారు.
అవినీతి, అవకతవకలతో పరిపాలించిన బీఆర్ఎస్ ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చుంటే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా అదే పంథాలో పాలన చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ‘పరిపాలనా పక్షవాతం’ వచ్చినట్లు అభివర్ణించారు. 20నెలల కాంగ్రెస్ పాలనలో రోడ్ల భద్రతలేదు, వ్యవసాయరంగంలో పురోగతి లేదు, పోలీసుల రాజ్యం నడుస్తోంది, మున్సిపాలిటీల్లో అభివృద్ధి కనబడటంలేక పోవటంతో పాటు రెండుప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్వీర్యం చేసినట్లు అధ్యక్షుడు మండిపడ్డారు. అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలనాపక్షవాతం వచ్చిందని తాను అన్నట్లుగా సమర్ధించుకున్నారు. కాంగ్రెస్,బీఆర్ఎస్ నుండి తెలంగాణను రక్షించుకోవాలన్న నినాదంతో తొందరలోనే ‘సేవ్ తెలంగాణ’ ఉద్యమం మొదలుపెట్టబోతున్నట్లు రామచంద్రరావు తెలిపారు.
రాజ్యాంగానికి దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వల్లే తీరని అన్యాయం జరిగిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అధికారంలో నుండి దిగిపోవాల్సిన పరిస్ధితి వచ్చినపుడు అప్పట్లో ఇందిరాగాంధి ఎమర్జెన్సీ విధించిన విషయాన్ని గుర్తుచేశారు. నరేంద్రమోదీ, అమిత్ షా వల్ల రాజ్యాంగానికి వచ్చిన ముప్పు ఏమీలేదన్నారు. ప్రభుత్వం నుండి వచ్చిన బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్లు అభిప్రాయాలు చెప్పకుండా తమదగ్గర ఫైళ్ళను అట్టేపెట్టుకుంటున్నారన్న ఆరోపణలకు సమాధానమిస్తు ఫిరాయింపు ఎంఎల్ఏల మీద నిర్ణయం తీసుకోకుండా అసెంబ్లీ స్పీకర్ ఎంతకాలమైనా ఫైలును తమదగ్గరే పెట్టుకోవచ్చా ? అని ఎదురుప్రశ్నించారు. 20నెలల కాంగ్రెస్ పాలనలో ఏ శాఖ, ఏ రంగంలోనూ అభివృద్ధి కనిపించటంలేదన్నారు. దావోస్, సింగపూర్, కొరియాలో పర్యటించిన రేవంత్ ఎన్ని పెట్టుబడులు తెచ్చారని ప్రశ్నించారు.
దావోస్ పర్యటనలో రు. 70 వేల కోట్లు, సింగపూర్ పర్యటనలో రు. 10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్న ముఖ్యమంత్రి మరి ఆపెట్టుబడులు ఎక్కడున్నాయో జనాలకు సమాధానాలు చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగులకు జీతాలు కూడా సమయానికి ఇవ్వటంలేదని ఎద్దేవా చేశారు. 100 రోజుల్లో ఆరుగ్యారెంటీలను అమలుచేస్తామని 2023 ఎన్నికల్లో హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ 20నెలల పాలనలో ఎన్ని గ్యారెంటీలను అమలుచేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పెట్టుబడుల ఆకర్షణ కోసం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బృందం విదేశాలకు తిరిగిన ఖర్చులు కూడా వృధాఅయినట్లు ఎద్దేవా చేశారు.
ప్రజలు బీఆర్ఎస్ వైఫల్యాలను చూశారు, ఇపుడు కాంగ్రెస్ వైఫల్యాలను గమనిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు బీజేపీవల్లే సాధ్యమవుతుందని జనాలు నమ్ముతున్నట్లు చెప్పారు. బీజేపీకి పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆధరణ పెరుగుతున్నట్లు చెప్పారు. రైతులు, విద్యార్ధుల అవస్తలను చూస్తుంటే చాలా బాధ కలుగుతోందన్నారు. తెలంగాణకు అవసరమైనంత యూరియాను కేంద్రప్రభుత్వం సరఫరా చేసినా ఎందుకు కొరత వస్తోందో ఆలోచించాలన్నారు. అర్ధరాత్రుళ్ళ నుండి రైతులు యూరియా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారో ప్రభుత్వం చెప్పాలన్నారు. యూరియాను కొందరు బ్లాక్ మార్కెట్ కు తరలించి అమ్ముకోవటంతోనే యూరియా కొరత వచ్చినట్లు రామచంద్రరావు ఆరోపించారు.
బీఆర్ఎస్ హయాంలో జరిగిన ప్రాజెక్టుల అవినీతిపై మాట్లాడుతు, కాళేశ్వరం, మేడిగడ్డలో అవినీతి జరిగిందని తేల్చటం కాదని, నిర్మాణ లోపాలు, నాణ్యతాలోపాలతో పాటు నిర్వహణ లోపాలపైన కూడా సమగ్రమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అప్పుడే కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల అవినీతిలో ఎవరి వాటాలు ఎంతో బయటపడతాయని ప్రభుత్వానికి సూచించారు. రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలుగా ఇవ్వటంలేదని మండిపోయారు. ఆర్ధికనిర్వహణలో లోపాలవల్లే ఇలాంటి పరిస్ధితి తలెత్తిందన్నారు. పరిపాలనలో బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య ఎలాంటి తేడా లేదన్నారు.
బీసీలకు పెద్దపీట
తొందరలో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీలకు తమ పార్టీ 42శాతం సీట్లు కేటాయిస్తుందని ప్రకటించారు. మొదటినుండి బీజేపీ అంటేనే బీసీల పార్టీగా అభివర్ణించారు. తొందరలో జరగబోయే జూబ్లిహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక అభ్యర్ధి ఎంపికపై పార్టీ కమిటి కసరత్తు చేస్తోందన్నారు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎంపీలు, ఎంఎల్ఏలు, సీనియర్ నేతలందరినీ కలుస్తునే ఉన్నట్లు ఒకప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పార్టీలో తనకు ఎవరితోను అభిప్రాయభేదాలు లేవన్నారు. గోషామహల్ ఎంఎఏ రాజాసింగ్ గురించి మాట్లాడటం టైం వేస్టని రామచంద్రరావు కొట్టిపారేశారు. స్ధానిక ఎన్నికలను తొందరగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. లోకల్ బాడీస్ లేకపోవటం వల్ల కేంద్రం నుండి రావాల్సిన నిధులు ఆగిపోతున్నట్లు గుర్తుచేశారు.
బీసీ ముఖ్యమంత్రి అభ్యర్ధి ప్రకటనపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తు ‘బీసీ ముఖ్యమంత్రి అభ్యర్ధిని డిసైడ్ చేయాల్సింది రామచంద్రరావు కాద’ని సరదాగా అన్నారు. ఓట్లచోరీ జరిగిందన్న రాహుల్ గాంధి ఆరోపణలను ప్రస్తావించినపుడు ‘బడాచోర్లు ఓట్లచోరి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంద’న్నారు. పార్టీలో అసంతృప్తుల గురించి అడిగిన ప్రశ్నకు ‘పార్టీలో పదవులు తక్కువ..పదవులను ఆశిస్తున్న నేతల సంఖ్య చాలా ఎక్కువ’ అన్నారు. పదవుల సంఖ్యకు మించి వాటిని ఆశిస్తున్న నేతలున్నపుడు అసంతృప్తి సహజంగానే ఉంటుందన్నారు. భర్తీచేయాల్సిన పార్టీ పదవులు ఇంకా 650 ఉన్నట్లు చెప్పారు. పార్టీలో అసంతృప్తులంటు కొందరు చేస్తున్న ప్రచారాన్ని రామచంద్రరావు కొట్టిపారేశారు. అసంతృప్తులంటు వస్తున్న వార్తల్లో ఎక్కువభాగం మీడియా వల్లే అని చురకలంటించారు.
హైడ్రా శ్వేతపత్రం రిలీజ్ చేయాలి
హైడ్రా కార్యక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని అధ్యక్షుడు డిమాండ్ చేశారు. జలవనరులను కాపాడటానికి ఇప్పటివరకు హైడ్రా ఎన్ని కబ్జాలను, ఎన్ని ఆక్రమణలను తొలగించింది ? ఎన్ని జలవనరులను కాపాడిందో చెప్పాలన్నారు. హైడ్రా కూల్చివేతల్లో బడాబాబులవి ఎన్ని నిర్మాణాలున్నాయి, మధ్య, దిగువ మధ్య తరగతి ప్రాపర్టీలు ఎన్ని ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓల్డ్ సిటీలో ఆక్రమణలపై హైడ్రా ఏమైనా సర్వేచేసిందా ? ఎన్ని ఆక్రమణలను తొలగించిందో సమాధానం చెప్పాలని అడిగారు. హైడ్రా పనితీరుపై సీరియస్ స్టడీ అవసరమని రామచంద్రరావు అభిప్రాయపడ్డారు. అక్రమనిర్మాణాలకు, జలవనరులను ఆక్రమించి నిర్మాణాలు చేయటానికి బీజేపీ కూడా వ్యతిరేకమే అన్నారు. జలవనరులను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. 111 జీవోను ఎవరూ ఉల్లంఘించేందుకు లేదని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు.
డ్రగ్స్ పెద్ద సమస్య
ప్రస్తుత సమాజంలో డ్రగ్స్ పెద్ద సమస్యగా మారిందన్నారు. డ్రగ్స్ తయారీ, వినియోగం నియంత్రణపై అందరు కృషి చేయాలన్నారు. డ్రగ్స్ వల్ల ఒకతరం నిర్వీర్యమయ్యే ప్రమాదం వచ్చిందని వాపోయారు. ఈనెల 21వ తేదీన బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో ‘యాంటీ డ్రగ్స్ ర్యాలీ’ని నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు చెప్పారు.
బీజేపీ ఫార్మర్ ఫ్రెండ్లీ
తమ పార్టీని ఫార్మర్ ఫ్రెండ్లీ పార్టీగా రామచంద్రరావు సమర్ధించుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, యువత పార్టీపట్ల ఆకర్షితులవుతున్నట్లు చెప్పారు. రైతుల సంక్షేమం కోసం నరేంద్రమోదీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నట్లు తెలిపారు.
ఓవైసీ ఫోబియా
సెప్టెంబర్ 17వ తేదీని అధికారికంగా ‘తెలంగాణవిమోచనదినోత్సవం’ నిర్వహించేందుకు ప్రభుత్వానికి ఓవైసీ(ఏఐఎంఐఎం) ఫోబియా పట్టుకుందన్నారు. విమోచన దినోత్సవంపై కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒకమాట అధికారంలోకి వచ్చిన తర్వాత మరోమాట మాట్లాడుతోందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తామన్నారు. బీజేపీని బలోపేతం చేయటానికి ప్రజాఉద్యమాలు చేయబోతున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు. అడ్వకేట్స్, జర్నలిస్టు ప్రొటెక్షన్ యాక్ట్ చాలా అవసరమని మరో ప్రశ్నకు సమాధానంగా నారపురాజు రామచంద్రరావు చెప్పారు.