కాంగ్రెస్ కండువాలని బీఆర్ఎస్ నిరూపించగలదా ?
ఫిరాయింపు ఎంఎల్ఏలకు రేవంత్ కప్పింది కాంగ్రెస్ కండువాలే అని బీఆర్ఎస్ ఎలా నిరూపించగలదు ?;
ఫిరాయింపు ఎంఎల్ఏలు కప్పుకున్నది కాంగ్రెస్ పార్టీ కండువాలే అని బీఆర్ఎస్ నిరూపించగలదా ? ఇపుడిదే అంశంపై ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య పెద్దచర్చ జరుగుతోంది. బీఆర్ఎస్(BRS) లో నుండి పదిమంది ఎంఎల్ఏలు కాంగ్రెస్(Telangana Congress) లోకి ఫిరాయించినపుడు ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) వాళ్ళకి కాంగ్రెస్ కండువాలు కప్పి సాధరంగా ఆహ్వానించారని బీఆర్ఎస్ నేతలు గోలచేస్తున్నారు. అయితే తమకు రేవంత్ కప్పింది కేవలం జాతీయ జెండాలోని మూడురంగుల కండువాలు మాత్రమే అని ఫిరాయింపు ఎంఎల్ఏలు ఎదురుదాడులకు దిగారు. ఇక్కడే ఫిరాయింపు ఎంఎల్ఏలకు రేవంత్ కప్పింది కాంగ్రెస్ కండువాలే అని బీఆర్ఎస్ ఎలా నిరూపించగలదు ? అన్నది పెద్ద పాయింట్ అయిపోయింది.
ఎందుకంటే ఫిరాయింపు ఎంఎల్ఏల మెడలపై మూడురంగుల కండువాలు కనబడుతున్నది వాస్తవమే. అయితే అవి కాంగ్రెస్ కండువాలు కావని ఫిరాయింపులు వాదిస్తున్నారు. కప్పుకున్న కండువాలు కాంగ్రెస్ పార్టీ కండువాలని బీఆర్ఎస్ నిరూపించే అవకాశాలు దాదాపు లేవు. అందుకనే పదేపదే ఆరోపణలు మాత్రమే చేస్తోంది. ఇక కాంగ్రెస్ సమావేశాల్లో ఫిరాయింపులు ఎందుకు పాల్గొంటున్నారని బీఆర్ఎస్ అడుగుతున్నది. తాము అభివృద్ధి కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటున్నామని, ప్రోటోకాల్ ప్రకారం తమకుఆహ్వానాలు అందుతున్నాయి కాబట్టి తాము హాజరవుతున్నట్లు ఫిరాయింపులు చెబుతున్నారు. నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించటంలేదని బీఆర్ఎస్ ఎంఎల్ఏలు గోలచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
ప్రోటోకాల్ ప్రకారం నియోజకవర్గాల్లో జరుగుతున్న కార్యక్రమాలకు తమను ఆహ్వానించటంలేదని, ప్రభుత్వం ప్రోటోకాల్ ను తుంగలో తొక్కుతున్నదని బీఆర్ఎస్ ఎంఎల్ఏలు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నారు. మెదక్ ఎంఎల్ఏ కొత్త ప్రభాకరరెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గం ఎంఎల్ఏ వాకిటి సునీతా లక్ష్మరెడ్డి ప్రోటోకాల్ ప్రకారం తమను ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలకు పిలవటంలేదని చాలా పెద్ద గొడవలు చేశారు. ఒకవైపు బీఆర్ఎస్ ఎంఎల్ఏల విషయంలో ప్రోటోకాల్ పాటించటంలేదని గొడవచేస్తు మరోవైపు ఫిరాయింపు ఎంఎల్ఏలు మాత్రం ఎందుకు కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు హజరవుతున్నారని అడగటం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కే చెల్లింది. తాము కాంగ్రెస్ పార్టీ మీటింగులకు వెళ్ళటంలేదని ప్రభుత్వ కార్యక్రమాలకే హాజరవుతున్నట్లు ఫిరాయింపు ఎంఎల్ఏలు చెబుతున్నారు.
ఇక పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసిన ఫొటోను బీఆర్ఎస్ చూపిస్తోంది. రాహుల్ ను కలిసి ఫొటో దిగినంత మాత్రాన తాను కాంగ్రెస్ లో చేరిపోయినట్లేనా అని పోచారం ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఫొటోలు దిగటం పార్టీ మారినట్లుగా సాంకేతికంగా నిరూపించే సాక్ష్యంకాదు. ఏదేమైనా ఫిరాయింపుల్లో పదిమంది ఎంఎల్ఏలు కాంగ్రెస్ లో చేరిపోయినట్లుగా బీఆర్ఎస్ నిరూపించలేందనే ప్రచారం జరుగుతోంది. ఖైరతాబాద్ ఎంఎల్ఏ దానం నాగేందర్ విషయంలో మాత్రం సమస్యలేదు. దానం పార్టీ ఫిరాయింపుల చట్టంకింద బుక్ అవటం దాదాపు ఖాయమని అర్ధమవుతోంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఎంఎల్ఏగా ఉంటు కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీగా పోటీచేశారు కాబట్టి. చివరకు ఫిరాయింపుల వివాదం ఎలా ముగుస్తుందో చూడాల్సిందే.