డిసిసి అధ్యక్ష ఎన్నికల్లో కులమే కొలబద్ద
బీసీ నాయకులకు అవకాశం పై పెరుగుతున్న వత్తిడి, ఇరకాటంలో కాంగ్రెస్ అధిష్టానం
దక్షిణ తెలంగాణలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎన్నికల్లో కుల సమీకరణలు కీలకం కానున్నట్లు రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో వెనుకబడిన కులాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే అంశంలో ప్రతిష్టంబన ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ నాయకత్వానికి కనీసం పార్టీ పదవుల్లోనైనా ఆ వర్గం వారికి అనుకూలంగా వ్యవహరించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
రాబోయేది స్థానిక ఎన్నికల పార్టీ బీ ఫామ్స్ అన్ని డీసీసీ అధ్యక్షుడి చేతుల మీదుగా పంపిణీ అయ్యే అవకాశం ఉండటం వల్లే ఈ పదవికి క్రేజ్ వచ్చింది.
జిల్లాల వారీగా నెలకొన్న కాంగ్రెస్ అంతర్గత రాజకీయ పరిస్థితుల్ని పరిశీలిస్తే ఇదే స్పష్టమవుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూసినట్లయితే రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటి మరియు పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు, ఇన్‌చార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచనలతో సామాజిక సమీకరణాలను సమతుల్యం చేస్తూ డిసిసి అధ్యక్షుని నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న కోమటి రెడ్డి పద్మాకర్ రెడ్డి, టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ యాదవ్, జిల్లా కిసాన్ సెల్ మాజీ అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వెలిచల రాజేంద్రరావు డిసిసి రేసులో ఉన్నారు.
డీసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వారిలో ముగ్గురు రెడ్డి సామాజికవర్గం, ఇద్దరు బీసీ సామాజికవర్గం, ఒకరు వెలమ సామాజికవర్గం. ఏ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తారు, ఎవరికి అధ్యక్ష పదవి వస్తుందనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలతో సహా అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేలా అధ్యక్షుల ఎంపిక జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఖమ్మంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అనుచరులు ప్రధానంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. ప్రస్తుతం టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నూతి సత్యనారాయణ గౌడ్, మధిర నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వర్గం నుంచి వైరా మాజీ మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, పీసీసీ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాస్ రెడ్డి రేస్లోఉన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గం నుంచి కార్పొరేటర్ కమర్తపు మురళి ఇప్పటికే దరఖాస్తు చేశారు. ఖమ్మం డి సి సి అధ్యక్ష పదవికి ఐదుగురు పేర్లను అధిష్టానానికి పరిశీలకులు పంపినట్లు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది .
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోనూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గాలకు చెందిన నేతలే ప్రధానంగా డీసీసీ పోటీలో ఉన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు పొదెం వీరయ్యతో పాటు కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మోత్కూరి ధర్మారావు, నాగ సీతారాములు, నేతలు కొత్వాల శ్రీనివాస్, కోనేరు సత్యనారాయణ, తుళ్లూరి బ్రహ్మయ్య, బాలశౌరి, కంచర్ల చంద్రశేఖర్, వూకంటి గోపాలరావు, చింతలపూడి రాజశేఖర్, దేవీ ప్రసన్న, ఎడవల్లి కృష్ణ, బుడగం శ్రీనివాస్, సరెళ్ల నరేశ్, జూపల్లి రమేశ్ ప్రధానంగా పోటీలో ఉన్నారు.
నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్ష పదవికి పోటీ అత్యంత కీలకమైన రాజకీయ పోటీగా మారింది, ఇద్దరు సీనియర్ నాయకులు మాజీ మంత్రి కె. జానారెడ్డి మరియు ప్రస్తుత రోడ్లు మరియు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ విధేయులకు ఆ స్థానాన్ని దక్కించుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. జానారెడ్డి కొండేటి మల్లయ్యకు మద్దతు ఇస్తుండగా, వెంకట్ రెడ్డి గుమ్ముల మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తున్నారు.
బీసీ సంఘం నేతలు సైతం డి సి సి అధ్యక్ష పదవిని బీసీ కులాలకు చెందిన వ్యక్తికి ఇవ్వాలని ఎఐసిసి మాజీ ప్రధాన కార్యదర్శి బిశ్వ రంజన్ మొహంతి కి వినతి పత్రం సమర్పించారు. 2009 సంవత్సరం నుండి నల్గొండ డిసిసి అధ్యక్ష పదవి వెనుకబడిన తరగతి అభ్యర్థికి దక్కలేదని, ఆ పదవిని ఎస్సీ, ఎస్టీ మరియు ఓసి వర్గాల నాయకులు నిర్వహిస్తున్నారని బిసి నాయకులు ఎత్తి చూపారు. ప్రస్తుతం జిల్లాలో ఏ బిసి నాయకుడు కూడా ఎంపీ, ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహించడం లేదని వారు వివరించారు.
ఈ పదవికి జి. మోహన్ రెడ్డి, కె. మల్లయ్య, సుంకరబోయిన నర్సింహ యాదవ్, దయాకర్ గౌడ్, పున్న కైలాష్ మరియు అనేక మంది దరఖాస్తులు సమర్పించారు.
నల్గొండ డిసిసి పగ్గాలు ఎవరు చేపట్టాలో నిర్ణయించే ముందు, సీనియారిటీ, కుల ప్రాతినిధ్యం మరియు సంస్థాగత బలాన్ని సమతుల్యం చేసుకుని కాంగ్రెస్ అధిష్టానం ఆ పదవికి వ్యక్తిని నిర్ణయించే అవకాశం ఉంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో హనుమకొండ డీసీసీ పదవి కోసం సీనియర్ నాయకులు ఎనుగల వెంకట్రామ్ రెడ్డి, బత్తిని శ్రీనివాస్, పింగలి నరసింహ రెడ్డి పోటీ పడుతుండగా, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలిగా కొనసాగాలని ఎర్రబెల్లి స్వర్ణ ప్రయత్నిస్తున్నారు. అయితే, మంత్రి కొండా సురేఖ, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి తమ మద్దతుదారులకే మద్దతు ఇస్తున్నట్లు సమాచారం.
మహబూబాబాద్ డి సి సి అధ్యక్ష పదవికి ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి సన్నిహితుడు వెన్నం శ్రీకాంత్ రెడ్డి పోటీలో ముందు వరుసలో ఉన్నాడు. ఆ పదవిని బీసీ అభ్యర్థికి కేటాయించాలని కోరుతున్న నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఘనపురపు అంజయ్య కూడా పోటీలో ఉన్నారు.