దానంకు కాంగ్రెస్ షాక్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో(Jubilee Hills by poll) స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో బీఆర్ఎస్ (BRS)ఎంఎల్ఏ దానంనాగేందర్(Danam Nagendar) పేరును ప్రకటించింది
కాంగ్రెస్ అధిష్ఠానం వైఖరి ఎవరికీ అర్ధంకావటంలేదు. విషయం ఏమిటంటే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో(Jubilee Hills by poll) స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఖైరతాబాద్ బీఆర్ఎస్ (BRS)ఎంఎల్ఏ దానంనాగేందర్(Danam Nagendar) పేరును ప్రకటించింది. స్టార్ క్యాంపెయినర్లుగా 40 మందితో అధిష్ఠానం జాబితాను విడుదలచేసింది. అందులో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth), పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ గౌడ్(Bomma) తో పాటు మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, ఎంపీలు, సీనియర్ నేతలున్నారు. వీరితో పాటు దానంనాగేందర్ పేరును కూడా పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో దానం పేరును అధిష్ఠానం ఎందుకు ప్రకటించిందో ఎవరికీ అర్ధంకావటంలేదు.
దానం పేరును స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చటంపై కాంగ్రెస్ లో పెద్దఎత్తున చర్చజరుగుతోంది. కారణంఏమిటంటే పార్టీ ఫిరాయింపుల ఆరోపణలపై పదిమంది బీఆర్ఎస్ ఎంఎల్ఏలు అనర్హత వేటును ఎదుర్కొంటున్నారు. వీరి అనర్హతపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ కూడా జరుపుతున్నారు. పదిమంది ఫిరాయింపు ఎంఎల్ఏలపై ఎలాగైనా అనర్హత వేటు వేయించి, ఉపఎన్నికలు వచ్చేట్లు చేయాలని బీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఎంఎల్ఏలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందగౌడ్, పల్లా రాజేశ్వరరెడ్డి తదితరులు సుప్రింకోర్టులో కేసులు దాఖలుచేసిన విషయం తెలిసిందే. వీళ్ళ కేసు విచారణ సందర్భంగానే ఫిరాయింపులపై విచారణ జరిపి మూడునెలల్లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను సుప్రింకోర్టు ఆదేశించింది. దాని ఫలితమే స్పీకర్ విచారణ.
స్పీకర్ విచారణను ఎదుర్కొంటున్న వారిలో దానంకూడా ఉన్నారు. మిగిలిన తొమ్మిదిమంది ఎంఎల్ఏల వ్యవహారం ఎలాగున్నా దానంపైన మాత్రం అనర్హత వేటు ఖాయమనే ప్రచారం బాగా జరుగుతోంది. కారణం ఏమిటంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఖైరతాబాద్ నియోజకవర్గంలో గెలిచిన దానం 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేశారు. దీంతోనే దానం బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించారన్నది నిర్దారణైపోయింది. దీనికి ప్రత్యేకంగా స్పీకర్ విచారణే అవసరంలేదు. అయితే పార్టీ ఫిరాయింపు, అనర్హతపై దానం నోరిప్పటంలేదు.
ఇలాంటి నేపధ్యంలో తాజాగా కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో దానం పేరుండటం కచ్చితంగా షాకిచ్చే అంశమే అనటంలో సందేహంలేదు. బీఆర్ఎస్ ఎంఎల్ఏ పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఎలాగుంటుంది ? ఈ విషయం బీఆర్ఎస్ పార్టీకి దీపావళి సందర్భంగా లడ్డూలాగ దొరికింది. జాబితా ప్రకటనతో దానంను కాంగ్రెస్ అధిష్ఠానం వదిలించుకోవాలని అనుకుంటోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రేవంత్ కు తెలీకుండా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పేర్లను అధిష్ఠానం ప్రకటించే అవకాశంలేదు. కాంగ్రెస్ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కేటీఆర్ తదితరులు సుప్రింకోర్టుకు చూపిస్తే ఫిరాయింపుపై అప్పుడు దానం ఏమి సమాదానం చెబుతారు ? చూడబోతే దానంకు కాంగ్రెస్ అధిష్ఠానం షాకిచ్చిందా ? అనే ప్రచారం పెరిగిపోతోంది. కాంగ్రెస్ పార్టీ తనంతట తానే దానం బీఆర్ఎస్ లో నుండి తమపార్టీలోకి ఫిరాయించాడని రాతపూర్వకంగా నిర్దారణచేసినట్లయ్యింది. తాజా పరిణామంపై దానం ఏమని సమాధానం చెబుతారో చూడాలి.