గూండాలకు కాంగ్రెస్ అండ
బిఆర్ఎస్ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు
ఉప ఎన్నికల నేపథ్యంలో జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో గూండాలకు రేవంత్ రెడ్డి అండగానిలిచారని బిఆర్ఎస్ ప్రదాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సంచనలనమయ్యాయి. కాంగ్రెస్ నేత ఫసియుద్దీన్ కు ఇద్దరు గన్ మెన్ లు ఎందుకు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరును ప్రశ్నించారు.
కార్పోరేటర్ ఫసీయుద్దీన్ కు గన్ మెన్లు ఎందుకు?
బోరబండ కార్పోరేటర్ ఫసియు ద్దీన్ ఇటీవలె కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకుముందు ఆయన బిఆర్ఎస్ లో కీలక నేతగా పనిచేశారు. బిఆర్ ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఫసియుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరడం బిఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దివంగత బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తో ఫసియుద్దీన్ కు విభేధాలుండేవి. జిహెచ్ఎంసీ తొలి డిప్యూటి మేయర్ గా పనిచేసిన ఫసీయుద్దీన్ కాంగ్రెస్ అధికారంలో రాగానే ఇద్దరు గన్ మెన్లు ఇవ్వడం చర్చనీయాంశమైంది. కార్పోరేటర్ కు ఇద్దరు గన్ మెన్ లు కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ర్యాలీలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న అఖిల్ పహిల్వాన్ ఎందుకున్నారని ఆయన ప్రశ్నించారు.
రిజ్వి రాజీనామాకు రాజకీయ ఒత్తిళ్లే ప్రధాన కారణం
సీనియర్ ఐఏఎస్ అధికారి రిజ్వి రాజీనామాకు రాజకీయ ఒత్తిళ్లే కారణమని ఆర్ ఎస్ ప్రవీణ్ ఆరోపించారు. పదేళ్ల సర్వీసు ఉండగానే రిజ్వి విఆర్ఎస్ తీసుకోవడం వెనక కాంగ్రెస్ పార్టీ ఒత్తిడే ప్రధాన కారణమని ఆయన విమర్శించారు.
ఈ విషయంలో మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు చట్టప్రకారం నడచుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వ ఆదేశాలనుపాటించకూడదని ఆయన పిలుపునిచ్చారు. రిజ్వి రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడం వెనక కాంగ్రెస్ పార్టీ హస్తముందని ఆర్ఎస్ ప్రవీణ్ అన్నారు.
రేవంత్ రెడ్డి పరామర్శించలేదు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత గురుకుల పాఠాశాలలకు చెందిన 110 మంది విద్యార్థులు చనిపోయినప్పటికీ వాళ్ల కుటుంబాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించలేదని అన్నారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. సైదాబాద్ జువైనల్ హోం లో 10 మంది బాలలపై రేప్ జరిగినా మంత్రి సీతక్క స్పందించడం లేదన్నారు.