సర్పంచ్ స్థానానికి ఒకే కుటుంబంలో ఐదుగురు పోటీ

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు, అత్తా, కోడళ్లు పోటీ చేయడంతో హీరాపూర్ రికార్డుల్లోకి

Update: 2025-12-03 12:28 GMT
Adilabad Hirapur panchayati Record Breaks

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామ పంచాయతీ రికార్డుల్లోకి ఎక్కింది.  ఈ పంచాయితీ ఎస్ సి జనరల్ రిజర్వ్ అయ్యింది. దీంతో ఈ పంచాయితీ సర్పంచ్ పదవికి ఆడ, మగ ఇద్దరూ పోటీచేయచ్చు.  ఈ పంచాయతీ ఎన్నికల్లో హీరాపూర్ నుంచి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అత్తా కోడళ్లు నామినేషన్లు దాఖలు చేయడంతో  వార్తల్లోకెక్కింది.


ఈ పంచాయతీ ఎన్నికలు ఒకే కుటుంబంలో విభేధాలకు ఆజ్యం పోశాయి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఏమాయికుంటకు చెందిన తొడసం లక్ష్మి బాయి హీరాపూర్ గ్రామ సర్పంచ్ గా నామినేషన్ దాఖలు చేసింది. గతంలో ఆమె ఇదే స్థానం నుంచి సర్పంచ్ గా గెలిచింది. హీరాపూర్ గ్రామ పంచాయతీ ఎస్ సి జనరల్ కేటగిరి అయినా పోటీలేకుండానే లక్ష్మి బాయి గెలుస్తుందనే చాలామంది అనుకున్నారు.  


అయితే కొన్ని పంచాయతీల్లో జరిగే చిత్ర విచిత్రాలే హీరాపూర్ గ్రామ పంచాయతీలో కూడా జరిగింది.  గ్రామంలో మహిళలెవరూ లక్ష్మి బాయికి పోటీగా నిల్చోకపోగా మద్దతుగా ఉన్నారు.  అయితే ఎవరూ ఊహించని రీతిలో  లక్ష్మి బాయి కోడలు తొడసం మహేశ్వరే అత్తకు పోటీగా  సర్పంచ్ గా నామినేషన్ దాఖలు చేసి షాక్ ఇచ్చింది.  లక్ష్మిబాయి గ్రామాభివృద్దికి కృషి చేస్తానని ఒకవైపు ప్రచారం చేసుకుంటుంటే మరోవైపు కోడలే నామినేషన్ దాఖలు చేస్తుందని ఎవరూ ఊహించలేదు.  నామినేషన్ వేయటమే కాకుండా నిరక్షరాస్యులైన తన అత్తకన్నా తానే గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేయగలనని ప్రచారం కూడా మొదలుపెట్టేసింది.    

ఒకే కుటుంబంలో ఐదుగురు


అత్తా, కోడళ్ళ వ్యవహారం ఇలాగుండగా వారి కుటుంబంలోనే ముగ్గురు అన్నదమ్ములు కూడా సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేయటంతో మొత్తం గ్రామానికే షాక్ కొట్టినట్లయ్యింది. ఏమాయికుంటకు చెందిన జాదవ్ కిషన్, దేవ్ కబాయి దంపతులకు ప్రతాప్ సింగ్, కుబేర్ సింగ్, అనార్ సింగ్, రామ్ లఖన్ సింగ్ అనే నలుగురు కుమారులు ఉన్నారు.  తండ్రి జాదవ్ కిషన్ ఒకసారి సర్పంచ్ గా, ముత్నూరు ఎంపీటీసీగా గెలిచాడు.

తండ్రి మరణానంతరం నాలుగో కుమారుడు ఏమాయికుంట సర్పంచ్ గా పోటీ చేసి గెలిచాడు. ప్రస్తుతం ఎస్సీ జనరల్ కావటంతో  నాలుగో కుమారుడు రామ్ లఖన్ సింగ్  సర్పంచ్ గా నామినేషన్ దాఖలు చేశాడు. అప్పటి వరకు రాజకీయాలకు దూరంగా ఉన్న సోదరులు జాదవ్ కుబేర్ సింగ్ , అనార్ సింగ్ కూడా సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు.  ఒకే కుటుంబం నుంచి ముగ్గురు అన్నదమ్ములు, అత్తా కోడళ్లు నామినేషన్ వేయడంతో గ్రామస్థులు గందరగోళంలో పడిపోయారు.  ఎవరికి ఓటు వేయాలో గ్రామస్తులు తేల్చుకోలేకపోతున్నారు. అందుకనే కుటుంబంలో ఐదుగురు పోటీపడటం కాకుండా ఎవరో ఒక్కరే పోటీలో ఉండాలని గ్రామస్తులు ఐదుగురికి స్పష్టంగా చెప్పారు. అయితే ఐదుగురిలో ఒక్కరు కూడా నామినేషన్ ఉపసంహరించుకోకపోవటంతో  ఐదుగురు అభ్యర్థులుూ   పోటీలో ఉండటంతో  హీరాపూర్ గ్రామ పంచాయతీ రికార్డుల్లో కెక్కింది.

Tags:    

Similar News