కాళేశ్వరంపై మళ్ళీ హైకోర్టుకు వెళ్లిన హరీష్
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టకుండా చూడాలంటూ పిటిషన్;
బీఆర్ఎస్ పార్టీలో కాళేశ్వరం కమిషన్ నివేదిక టెన్షన్ పెరిగిపోతుందా? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. ఇందుకు కమిషన్ నివేదికను సస్పెండ్ చేయాలని కోరుతూ మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి హైకోర్టును ఆశ్రయించడం నిదర్శనంగా మారుతోంది. ఇప్పటికే ఒకసారి ఈ అంశంపై కేసీఆర్, హరీష్ రావు.. ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇద్దరూ వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. కేసీఆర్, బీఆర్ఎస్ ప్రతిష్టకు భంగం కలిగించాలన్న ఉద్దేశంతోనే ఈ నివేదికను సిద్ధం చేశారంటూ వారు తమ పిటిషన్‌లో ఆరోపించారు. కానీ ఆ పిటిషన్ల విచారణ సమయంలో న్యాయస్థానం భారీ షాక్ ఇచ్చింది. వారి వాదనను అసెంబ్లీలో జరిగే చర్చ సమయంలో వినిపించుకోవాలని తెలిపింది. వారి పిటిషన్లను రద్దు చేసి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కానీ ఇప్పుడు మరోసారి హరీష్ రావు.. ఇదే అంశంపై మళ్ళీ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం కీలకంగా మారింది.
అసెంబ్లీ సమావేశాలే కారణమా..!
కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఇప్పటికే ఒకసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఎదురు దెబ్బ తిన్న హరీష్ రావు.. ఇప్పుడు మళ్ళీ ఎందుకు మరో పిటిషన్ వేశారు? అన్నది కీలకంగా మారింది. అయితే తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడంతోనే హరీష్ రావు ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. కోర్టులో మరో పిటిషన్ వేయడం ద్వారా అసెంబ్లీలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చ జరగకుండా ఆలస్యం చేయాలని హరీష్ రావు ప్లాన్ చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కోర్టులో ఉన్న అంశంపై అసెంబ్లీలో చర్చించలేమని, తమ అభిప్రాయాలు చెప్పలేమని తెలిపి కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చకు వాయిదా వేయాలని హరీష్ రావు అనుకుని ఉండొచ్చని అంటున్నారు విశ్లేషకులు.
హరీష్ పిటిషన్ కేసీఆర్ ప్లానా..!
దీంతో పాటుగానే హైకోర్టులో రెండో పిటిషన్ దాఖలు చేయాలన్న హరీష్ రావు నిర్ణయం వెనక కేసీఆర్ సూచనలు ఉన్నాయన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న క్రమంలో శుక్రవారం ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో పలువురు కీలక నేతలతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఆ సమయంలోనే కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీ చర్చ అన్న అంశం కూడా చర్చించారు. ఆ సమయంలోనే మరో పిటిషన్ దాఖలు చేయాలని కేసీఆర్ సూచించారని, ఆయన సూచనల మేరకే శనివారం ఉదయం హరీష్ రావు.. అంశంపై మరోసారి హైకోర్టును ఆశ్రయించారని వాదన వినిపిస్తోంది.
అవినీతికి భయపడే ఈ ప్లాన్..!
అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్‌పై విచారణ జరిగితే ఎక్కడ గత ప్రభుత్వం అవినీతి బట్టబయలు అవుతుందో అని ఇలాంటి పన్నాగాలు పన్నుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. నిజంగానే అవినీతి జరగకపోతే కేసీఆర్ స్వయంగా అసెంబ్లీ వచ్చి వివరణ ఇవ్వాలని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అలా రాని పక్షంలో కాళేశ్వరంలో అవినీతి జరిగిందనే భావించాల్సి ఉంటుందని కూడా వెంకట్‌రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం న్యాయబద్దంగా, చట్టప్రకారం కమిషన్‌ను వేసిందని, దాని నివేదికను కూడా సమగ్రంగా చర్చించి, అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత చట్ట ప్రకారమే తదుపరి కార్యాచరణ నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అసలు కాళేశ్వరంలో అవినీతి జరిగిందా? లేదా? అనేది తేల్చడం కోసమే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించనున్నామని కోమటిరెడ్డి చెప్పారు.