శివ.. శివ.. 300 కోట్లు ఎలా సంపాయించావురా నాయనా!

'మనం చిల్లర దొంగల్ని ఉరి తీస్తూ.. గజదొంగల్ని ప్రజా సేవకులుగా ఎంచుకుంటాం' అన్నది ప్రాచీన గ్రీకు సామెత. మరిప్పుడు ఈ అధికారిని ఏమనాలి?

Update: 2024-02-07 14:38 GMT
శివబాలకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాలు (ఫైల్ ఫోటో)

అంతులేని అవినీతి కథ ఇది. 'మనం చిల్లర దొంగల్ని ఉరి తీస్తూ.. గజదొంగల్ని ప్రజా సేవకులుగా ఎంచుకుంటాం' అన్నది ప్రాచీన గ్రీకు సామెత. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో దొరికి ఓ ప్రజాసేవకుడు అదే ఓ ప్రభుత్వ ఉద్యోగి ఏకంగా సుమారు 300 కోట్ల రూపాయలకు పైగా అవినీతికి పాల్పడ్డారంటే.. జనం నివ్వెరపోతున్నారు. పేదలు చెల్లించే మూల్యమే అవినీతి అంటారు పోప్‌ ఫ్రాన్సిస్‌. పేదల రక్తాన్ని పీల్చి పిప్పి చేసే అవినీతి జలగలు పుట్టడానికి సమాజంలో పారదర్శకత, జవాబుదారీ తనం లేకపోవడమే కారణమనేది జగమెరిగిన సత్యం. అవినీతి వ్యవస్థను మార్చగల స్పృహను కోల్పోవడం వల్లే హైదరాబాద్‌లో ఓ అధికారి వందల కోట్లు సంపాయించగలిగారు. అవినీతిరత్నంగా పేరుగాంచారు HMDA మాజీ డైరెక్టర్‌, రేరా కార్యదర్శి శివబాలకృష్ణ. ఈయన మొత్తం 300 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులున్నాయంటే సామాన్యుడికి వళ్లు జలదరిస్తుంది. శివబాలకృష్ణను 8 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించిన తర్వాత ఏసీబీ అధికారులు చెప్పిన వివరాలు విస్మయం కలిగిస్తున్నాయి. ఆయనకు 214 ఎకరాల భూమి, 29 ఓపెన్‌ ప్లాట్స్‌, 7 అపార్ట్‌మెంట్లు, ఒక విల్లా ఉన్నట్టు ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌ సుదీంద్ర చెప్పారు. వీటన్నింటి విలువ సుమారు 300 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా వేశారు. ఇంకా గుర్తించాల్సిన ఆస్తులు అనేకం ఉన్నాయి. బ్యాంకు లాకర్స్‌లో 18 తులాల బంగారాన్ని, మరికొన్ని పాస్‌ పుస్తకాలను గుర్తించారు. రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులపై దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌ సుదీంద్ర.

8 రోజుల పాటు విచారణలో ఎన్నో విషయాలు...

8వ రోజుల పాటు శివబాలకృష్ణను విచారించిన ఏసీబీ అధికారులు ఆయనకు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టుకు తరలించారు. ఆదాయానికి మించిన అక్రమ ఆస్తుల కేసులో రెరా మాజీ కార్యదర్శి శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 8 రోజుల పాటు శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు విచారించారు. తాజా దర్యాప్తులో శివబాలకృష్ణకు భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఆయన భార్య, పిల్లలు, సోదరుడు నవీన్, మేనల్లుడు భరత్​ పేరు మీద ఆస్తులు ఉన్నాయని విచారణలో వెలుగులోకి వచ్చినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. 150 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు 15 ఓపెన్​ ప్లాట్లను కూడా గుర్తించారు. ఇవే కాకుండా నల్గొండ, మహబూబ్‌నగర్‌, జనగామ జిల్లాల్లో శివబాలకృష్ణకు ఆస్తులున్నాయని తెలుసుకున్నారు.

ముగిసిన శివబాలకృష్ణ కస్టడీ...

మరోవైపు, హెచ్​ఎండీఏ మాజీ డైరెక్టర్​ శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది. మరో ఐదు రోజులు కస్టడీని పొడిగించాలని ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టును కోరునున్నట్లు సమాచారం. గతంలో నిందితుడ్ని పది రోజులు ఏసీబీ అధికారులు కస్టడీకి అడగగా కోర్టు 8 రోజులకు అనుమతి ఇచ్చింది. శివబాలకృష్ణ ఇచ్చిన సమాచారం మేరకు హెచ్ఎండీఏ, రెరా ఉద్యోగులను కూడా విచారించినట్టు తెలుస్తోంది. నిందితుడితో కలిసి పనిచేసిన ఉద్యోగులకు నోటీసులిచ్చి విచారించారించినట్టు అధికారులు తెలిపారు. విచారణలో భాగంగా శివబాలకృష్ణ అనుమతులిచ్చిన రియల్ ఎస్టేట్ వెంచర్ల పై ఆరా తీశారు. వీటితో పాటు కోర్టు వివాదాల్లో ఉన్న భూములకు కూడా నిందితుడు అనుమతులు ఇచ్చినట్లు తెలుసుకున్నారు. మాన్యువల్ అనుమతులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందన్న దానిపైనా విచారించారు.

తొలిదాడి ఎప్పుడంటే...

గత నెల 24వ తేదీన శివబాలకృష్ణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ రోజే వంద కోట్ల రూపాయలకు పైగా అక్రమ ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. అందులో 40 లక్షల రూపాయల నగదు, రెండు కిలోల బంగారు ఆభరణాలు, ఆస్తిపత్రాలు, బ్యాంకు డిపాజిట్లు, ఖరీదైన 60 చేతి గడియారాలు, ఇతర విలువైన వస్తువులను అధికారులు గుర్తించారు. దీంతో ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్​ విధించింది. ఆ తర్వాత అధికారులు కస్టడీలోకి తీసుకుని 8 రోజులు విచారించారు.

Tags:    

Similar News