తెలంగాణలో ఈరోజు నుంచే ఇళ్ల వద్ద ఓటింగ్

తెలంగాణ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో నేటి నుంచి హోం, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభం అయింది. CEC 85 ఏళ్ళు దాటిన వృద్ధులకు హోమ్ ఓటింగ్ కు అవకాశం కల్పించింది.

Update: 2024-05-03 05:32 GMT

తెలంగాణ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో నేటి నుంచి హోం, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభం అయింది. కేంద్ర ఎన్నికల సంఘం 85 ఏళ్ల వయస్సు దాటిన వృద్ధులకు హోమ్ ఓటింగ్ కు అవకాశం కల్పించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఉప ఎన్నిక) అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 638 మంది 12 D ఫార్మ్ ద్వారా హోమ్ ఓటింగ్ కి అప్లై చేసుకున్నారు. వీరిలో 572 మందికి ఎన్నికల సంఘం ఇంటి నుంచి ఓట్ వేసేందుకు ఆమోదం తెలిపింది.

హైదరాబాద్ లోక్ సభ సెగ్మెంట్ పరిధిలో 182 మంది అప్లై చేయగా 129 మందికి, సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో 398కి గానూ 385 మందికి, కంటోన్మెంట్ పరిధిలో 58 మంది అప్లై చేసుకోగా 58 మందికి హోమ్ ఓటింగ్ కి ఆమోదం లభించింది. 

అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు ప్రాంతాలవారీగా హోమ్ ఓటింగ్ మ్యాపింగ్ ని రూపొందించారు. సికింద్రాబాద్ లో 27 రూట్ల కోసం 27 బృందాలు, హైదరాబాద్ లో 24 రూట్ల కోసం 10 బృందాలు, కంటోన్మెంట్ లో 3 రూట్ల కోసం 3 బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసుల సమక్షంలో ఎన్నికల సిబ్బందితో కూడిన టీంలు ఇళ్ల వద్దకు వెళ్లి వృద్ధులతో ఓటు వేయించనున్నారు. హోం ఓటింగ్ ఈరోజు మొదలై మే 5వ తేదీ వరకు కొనసాగుతుంది.

మే 8 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్...

ఎన్నికల విధుల్లో పని చేసేవారి కోసం ఈరోజు నుంచే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. జిల్లాల్లో రిజర్వ్ స్టాఫ్ తో కలిపి దాదాపు 23 వేల మంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. వీరిలో 19,500 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం అప్లై చేసుకున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ కి సంబంధించిన ఓటర్ల కోసం గన్ ఫౌండ్రి లోని ఆల్ సెయింట్స్ హై స్కూల్లో, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఓటర్ల కోసం కేంద్రీయ విద్యాలయంలో, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

కాగా, గురువారం జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయంలో హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డోస్ పాల్గొన్నారు. సమావేశంలో హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఓటింగ్ పూర్తయిన అనంతరం మిగిలిన బ్యాలెట్ పేపర్లను సంబంధిత ఏఆర్ఓ కి అప్పగించాలని సూచించారు.

Tags:    

Similar News