కాంగ్రెస్ ను బీఆర్ఎస్ రెండుదెబ్బలు కొట్టబోతోందా ?
మొదటిదెబ్బ విషయంచూస్తే ఉపఎన్నికలో ఎవరుగెలుస్తారో ఇప్పుడే చెప్పటంకష్టం.
కాంగ్రెస్ పార్టీని రెండుదెబ్బలు కొట్టడానికి బీఆర్ఎస్ కాచుక్కూర్చున్నదా ? అవుననే అంటున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆదివారం రాజేంద్రనగర్ కు చెందిన కొందరు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతు కాంగ్రెస్ ను రెండుదెబ్బలు కొట్టేందుకు బీఆర్ఎస్(BRS) రెడీగా ఉందని హెచ్చరించారు. ఆ రెండుదెబ్బలు ఏమిటంటే మొదటిదేమో జూబ్లీహిల్స్ అసెంబ్లీ(Jubilee Hills by poll) ఉపఎన్నికలో కాంగ్రెస్(Telangana Congress) ను ఓడించటం. రెండో దెబ్బ ఏమిటంటే రాజేంద్రనగర్ లేదా ఖైరతాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ను ఓడించటం. ఫిరాయింపు ఎంఎల్ఏలకు వ్యతిరేకంగా మళ్ళీ సుప్రింకోర్టుకు వెళ్ళబోతున్నట్లు కేటీఆర్ చెప్పారు.
మొదటిదెబ్బ విషయంచూస్తే ఉపఎన్నికలో ఎవరుగెలుస్తారో ఇప్పుడే చెప్పటంకష్టం. అయితే బీఆర్ఎస్ గెలిచేసినంతగా పార్టీప్రచారం చేసుకుంటోంది. సోషల్ మీడియా, మీడియాలో అభ్యర్ధి మాగంటిసునీత గెలుపు ఖాయమన్నట్లుగా విపరీతంగా ఫోకస్ చేస్తున్నారు. బీఆర్ఎస్ కు మద్దతుగా వేలాది సోషల్ మీడియా గ్రూపులు, వందలాది యూట్యూబ్ ఛానళ్ళతో సునీతకు మద్దతుగా కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ కుమార్ యాదవ్ కు వ్యతిరేకంగా విపరీతంగా ప్రచారం హోరెత్తించేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోతుందని కేటీఆర్ పదేపదే చెబుతున్నారు.
ఇక రెండోదెబ్బ రాజేంద్రనగర్ ఉపఎన్నికలో గెలుపట. ఇక్కడ ఉపఎన్నిక ఎలావస్తుంది ? 2023 ఎన్నికలో బీఆర్ఎస్ తరపున గెలిచిన ప్రకాష్ గౌడ్ తర్వాత పరిణామాల్లో కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. ప్రకాష్ తో పాటు మరో తొమ్మిదిమంది ఎంఎల్ఏలు కూడా కాంగ్రెస్ లోకి ఫిరాయించిన విషయం తెలిసిందే. పదిమంది ఫిరాయింపు నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు ఖాయం, బీఆర్ఎస్ గెలుపుఖాయమని కేటీఆర్ ఏడాదిగా చెబుతున్నారు. అదే విషయాన్ని పార్టీలో చేరిన వారిని ఉత్సాహపరిచేందుకుని మరోసారి అదేమాట చెప్పినట్లున్నారు. రెండేళ్ళ తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రావటం ఖాయం, కేసీఆర్ ముఖ్యమంత్రి అవటం ఖాయమని మరోసారి చెప్పారు.
బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఎవరెవర్ని ఏంచేయాలి, ఎవరి బెండ్ ఎలా తీయాలో తీసి తీరుతామని వార్నింగ్ ఇచ్చారు. అందరి జాతకాలు తనకుతెలుసని, లెక్కలన్నీ పక్కాగా తేలుస్తామని కేటీఆర్ వార్నింగ్ ఇవ్వటం ఆశ్చర్యంగా ఉంది. కేటీఆర్ చెప్పినట్లుగా ఫిరాయింపు ఎంఎల్ఏలు పదిమంది మీదా అనర్హత వేటుపడే అవకాశాలు పెద్దగా కనబడటంలేదు. ఖైరతాబాద్ ఫిరాయింపు ఎంఎల్ఏ దానం నాగేందర్ మీద వేటుపడే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఎంఎల్ఏగా గెలిచిన దానం 2024 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా సికింద్రాబాద్ నుండి పోటీచేశారు. దానం కాకుండా మిగిలిన తొమ్మిదిమంది ఫిరాయింపు ఎంఎల్ఏల మీద వేటుపడేందుకు అవకాశాలు తక్కువనే అనిపిస్తోంది. మరి కేటీఆర్ ఆశిస్తున్నట్లుగా ఎంతమంది మీద వేటుపడుతుందో ఎన్ని నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు వస్తాయో చూడాలి.