గెలుపుకు కాంగ్రెస్ అవస్ధలుపడుతోందా ?

అధికారంలో ఉండికూడా అభ్యర్ధి గెలుపు అనుమానాస్పదంగా మారటమే కాంగ్రెస్ పార్టీ నేతలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది;

Update: 2025-02-22 10:41 GMT
Graduate MLC Candidate Narendra Reddy

అధికారంలో ఉండికూడా అభ్యర్ధి గెలుపు అనుమానాస్పదంగా మారటమే కాంగ్రెస్ పార్టీ నేతలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విషయం ఏమిటంటే ఈనెల 27వ తేదీన తెలంగాణలో మూడు ఎంఎల్సీ సీట్లకు ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ మూడింటిలో రెండు టీచర్ కోటాలో భర్తీ అవుతున్న ఎంఎల్సీ సీట్లయితే మూడోది గ్రాడ్యుయేట్ కోటాలో భర్తీ అవ్వాల్సిన సీటు. రెండు టీచర్ ఎంఎల్సీ సీట్లకు కాంగ్రెస్ పోటీచేయటంలేదు. గ్రాడ్యుయేట్ సీటు మీద మాత్రమే ప్రధానంగా దృష్టిపెట్టింది. చాలాకాలంగా కాంగ్రెస్ ఎందుకనో టీచర్ కోటాలో భర్తీ అయ్యే ఎంఎల్సీ సీట్లకు పోటీచేయటంలేదు. ఓన్లీ గ్రాడ్యుయేట్ అండ్ స్ధానికసంస్ధల కోటా ఎంఎల్సీ సీట్లకు మాత్రమే పోటీపడుతోంది.

ఇందులో భాగంగానే ఇపుడు కూడా ఉమ్మడి మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ సీటుకు పోటీచేస్తోంది. కాంగ్రెస్(Congress) తరపున అల్ఫోర్స్ విద్యాసంస్ధల ఛైర్మన్ వీ నరేంద్రరెడ్డి పోటీచేస్తున్నారు. బీజేపీ(BJP) అభ్యర్ధిగా చినమైల్ అంజిరెడ్డి పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్(TRS) టోటల్ ఎన్నికలకే దూరంగా ఉంటోంది కాబట్టి పోటీ కాంగ్రెస్-బీజేపీ మధ్యనే. బీఆర్ఎస్ పోటీచేయటంలేదు కాబట్టి, కాంగ్రెస్ అధికారంలో ఉందికాబట్టి బీజేపీని ఈజీగా ఓడించేయచ్చని ముందు అనుకున్నారు. నామినేషన్ వేస్తే చాలు గెలుపు గ్యారెంటీ అన్న ఆలోచనతో కాంగ్రెస్ టికెట్ కోసం చాలామంది గట్టిగా ప్రయత్నించారు. ఆర్ధికంగా మంచిస్ధితిలో ఉన్నారు కాబట్టి, అందునా విద్యాసంస్ధల ఛైర్మన్ కాబట్టి గెలుపు ఖాయమని నరేంద్రరెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది.

అభ్యర్ధి ఎంపిక విషయంలో ఏదైతే ప్లస్ పాయింట్ అవుతుందని అనుకున్నారో పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్లస్ పాయింట్లే మైనస్ గా మారుతున్నట్లు బాగా ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఏమిటంటే నరేంద్రరెడ్డి వ్యవహారశైలే అనే ప్రచారం ఎక్కువగా ఉంది. తన విద్యాసంస్ధల్లో చదివిన పూర్వ విద్యార్ధులు, ప్రస్తుత విద్యాసంస్ధల తల్లి, తండ్రులు తనకు ఓట్లేస్తే చాలు గెలుపుగ్యారెంటీ అని ముందు అభ్యర్ధి అనుకున్నారు. అయితే నామినేషన్ వేసిన తర్వాత ప్రచారం మొదలుపెట్టినపుడు కాని విషయం బోధపడలేదు. అదేమిటంటే ఓట్లకోసం అభ్యర్ధి తరపున ప్రచారం చేస్తున్నవారికి ఎదురుదెబ్బలు తగులుతున్నట్లు సమాచారం. మళ్ళీ ఇందులో కూడా రెండు కారణలున్నాయి. అవేమిటంటే మొదటిది కాంగ్రెస్ పార్టీ నేతలను విశ్వాసంలోకి అభ్యర్ధికి తీసుకోకపోవటం. పార్టీపరంగా ప్రచారం చేయాలంటే చాలా డబ్బులు ఖర్చుచేయాల్సుంటుందన్న ఆలోచనతో అభ్యర్ధి లోకల్ నేతలను దూరంపెట్టినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.

దాంతో ఏమైందంటే పైనాలుగు జిల్లాల్లోని స్ధానికనేతలు, ప్రజాప్రతినిధులు నరేంద్రరెడ్డి ప్రచారానికి దూరంగా ఉండిపోయారని సమాచారం. ఓటర్లనమోదు, ప్రచారం మొత్తం అభ్యర్ధి సొంతమనుషులే చూసుకుంటున్నారు. ప్రచార బాధ్యతలంతా విద్యాసంస్ధల్లో పనిచేస్తున్న వారికే అప్పగించారు కాబట్టి నరేంద్రరెడ్డికి తమ అవసరంలేదని అనుకున్న లోకల్ లీడర్లలో చాలామంది అసలు ప్రచారంలోకే దిగలేదు. ఇదేసమయంలో తమ ఛైర్మన్ను గెలిపించుకోవాలని ప్రచారంలోకి దిగిన సిబ్బందికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దాంతో టెన్షన్ పెరిగిపోయిన అభ్యర్ధి వెంటనే తన పరిస్ధితిని రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళినట్లు సమాచారం. అందుకనే ఇన్నిరోజులు పట్టించుకోని రేవంత్(Revanth) కూడా రెండురోజులుగా నరేంద్రరెడ్డిని గెలిపిచుకోవాలని పదేపదే చెబుతున్నారు.

నరేంద్రరెడ్డి గెలుపు బాధ్యతలను పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(PCC president Bomma Mahesh) కు రేవంత్ అప్పగించినట్లు పార్టీవర్గాలు చెప్పాయి. పనిలోపనిగా అభ్యర్ధిగెలుపు కోసం పై జిల్లాల్లోని మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొన్నం ప్రభకర్ కూడా అప్పగించారు. అలాగే ఇన్చార్జిమంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కూడా గట్టిగా చెప్పారు. దాంతో ఏడుమంది మంత్రులు రంగంలోకి దిగి ఎంఎల్ఏలను కూడా ప్రచారంలోకి దింపారు. ఎన్నికల ప్రచారం 25వ తేదీ సాయంత్రంతో ముగుస్తుంది. అంటే మంత్రులు, ఎంఎల్ఏలు ఎంత ప్రచారంచేసినా ఈ మూడురోజులే చేయాలి. అందుకనే మంత్రులు, ఎంఎల్ఏలు ఓటర్లను పోలింగ్ కేంద్రాలవారీగా వర్గీకరించి డైరెక్టుగా కలిపే ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యక్తిగతంగా నరేంద్రరెడ్డిని చూసికాకుండా పార్టీని చూసి అభ్యర్ధిని గెలిపించాలని ఓటర్లను రిక్వెస్టులు చేస్తున్నారు.

చిన్నమైల్ పరిస్ధితేంటి ?

గెలుపుకు ఒకవైపు కాంగ్రెస్ అభ్యర్ధి నానా అవస్ధలుపడుతుంటే మరోవైపు బీజేపీ అభ్యర్ధి చిన్నమైల్ అంజిరెడ్డి పరిస్ధితి కూడా అంతంతమాత్రంగానే ఉందని గ్రౌండ్ రిపోర్టు అందుతోంది. ఆర్ధికంగా ఇద్దరు అభ్యర్ధులు ఎవరికి ఎవరూ తీసిపోరు. కాకపోతే వ్యక్తిగతంగా ఇద్దరికీ కొన్ని మైనస్సులున్నాయి. ప్రచారంలో చిన్నమైల్ బాగానే చేసుకుంటున్నప్పటికీ ఓటర్లలో పెద్ద సానుకూలత లేదనే చెప్పాలి. ప్రచారంలో మెదక్ ఎంపీ రఘునందనరావు, కరీంనగర్ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్, ఆదిలాబాద్ ఎంపీ గోడంనగేష్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తమవంతు పాత్రను నిర్వర్తిస్తున్నారు. అయితే పార్టీకి ఓటర్లలో పెద్దగా బేస్ లేదు. దీనికి కారణం ఏమిటంటే గ్రాడ్యుయేట్ నియోజకవర్గం ఎంఎల్సీ ఎన్నికలో కేవలం గ్రాడ్యుయేట్లు మాత్రమే ఓట్ వేస్తారు. ఈఎన్నికకు మామూలు జనాలతో ఎలాంటి సంబంధం ఉండదు. ఈ విషయం బీజేపీకి పెద్ద మైనస్ అనే చెప్పాలి.

రేవంత్ ఇమేజీనే గెలిపించాలా ?

రేవంత్ ముఖ్యమంత్రి కాగానే సుమారు 50వేల ఉద్యోగాలు భర్తీచేశాడు. డీఎస్సీ నిర్వహించి టీచర్ ఉద్యోగాలు భర్తీచేయటం, గ్రూప్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించటం ప్లస్ పాయింట్లనే చెప్పాలి. దీనివల్ల నిరుద్యోగుల్లో ప్రభుత్వం మీద పాజిటివ్ ఇమేజి ఏర్పడింది. మూడురోజుల్లో ప్రచారం ముగుస్తుందనగా మంత్రులు, ఎంఎల్ఏలను రంగంలోకి దింపటంతో నరేంద్రరెడ్డి గెలుపు మీద కాస్త ఆశలు పెరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికైతే ఇద్దరు అభ్యర్ధులకు గెలుపోటములకు చెరిసగం అవకాశముంది. నరేంద్రరెడ్డి అభ్యర్ధి అవటమే కాంగ్రెస్ పార్టీకి మైనస్ అనే ప్రచారంతో డ్యామేజీ జరుగుతోంది. విద్యాసంస్ధల ఛైర్మన్ పోటీలో ఉంటే గెలుపుకు గ్యారెంటీ ఓట్లుంటాయి. కాని పూర్వ విద్యార్ధులు, ప్రస్తుత విద్యార్ధుల తల్లి,దండ్రులే ఎందుకు ఓట్లేయాలని అడుగుతున్నారంటేనే నరేంద్రరెడ్డికి ఉన్న ఇమేజి ఏమిటో అర్ధమైపోతోంది. అందుకనే నరేంద్రరెడ్డి గెలిస్తే పార్టీ, ప్రభుత్వం మహిమగాను, ఓడితే అభ్యర్ధే బ్యాడ్ అనే ప్రచారం కూడా ఊపందుకుంటోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News