కడియం శ్రీహరి సంచలన ప్రకటన
కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారే కాని కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్లు కడియం ఎక్కడా చెప్పలేదు.
ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టేషన్ ఘన్ పూర్ ఎంఎల్ఏ కడియం శ్రీహరి చేసిన ప్రకటన సంచలనంగా మారింది. శుక్రవరం మీడియాతో మాట్లాడుతు నియోజకవర్గం అభివృద్ధికోసమే తాను కాంగ్రెస్(Telangana Congress) తో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్(BRS) నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పదిమంది ఎంఎల్ఏల్లో కడియం శ్రీహరి(Kadiyam Srihari) కూడా ఉన్నారు. ఫిరాయింపులకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జారీచేసిన నోటీసులు కడియంకు కూడా అందింది. స్పీకర్ పంపిన నోటీసుకు సమాధానం ఇవ్వటానికి సమయం కావాలని కడియం అడిగితే అందుకు స్పీకర్ అంగీకరించారు.
ఫిరాయింపుల్లో ఎంతమందిపై అనర్హత వేటుపడుతుందనే విషయమై రాజకీయంగా జోరుగా చర్చలు జరుగుగున్నాయి. ఫిరాయింపుల్లో చాలామంది తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని కాంగ్రెస్ లో చేరలేదని స్పీకర్ కు సమాధానమిచ్చారు. ఈ నేపధ్యంలో కడియం చేసిన ప్రకటన సంచలనంగా మారింది. కడియం ప్రకటనను గమనిస్తే తాను కాంగ్రెస్ లోకి మారినట్లుగా పరోక్షంగా అంగీకరించినట్లు అర్ధమవుతోంది. ఎన్నికలసమయంలో తనను ఎంఎల్ఏగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీఇచ్చినట్లు చెప్పారు. అప్పటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. తనపార్టీ ఓడిపోయినా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్న హామీని నిలబెట్టుకోవాలనే తాను కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారే కాని కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్లు కడియం ఎక్కడా చెప్పలేదు.
తననియోజకవర్గానికి అన్యాయం జరగకూడదన్న ఆలోచనతోనే ఏడాదిన్నరగా కాంగ్రెస్ పార్టీతో కలిసి తాను పనిచేస్తున్నట్లు స్పష్టంచేశారు. దేవాదుల కాల్వలు బాగుచేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కోరినట్లు చెప్పారు. నియోజకవర్గం అభివృద్ధికి రేవంత్ అండగా ఉన్నట్లు చెప్పారు. నియోజకవర్గం అభివృద్ధికి రేవంత్ నిధులు అందించినట్లు కూడా కడియం తెలిపారు. బీఆర్ఎస్ లో నుండి తాను కాంగ్రెస్ లోకి ఫిరాయించాను అని కడియం స్పష్టంగా చెప్పలేదు. కాకపోతే నియోజకవర్గం అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇంతమాత్రానికే కాంగ్రెస్ లోకి కడియం ఫిరాయించినట్లు బీఆర్ఎస్ నిరూపించలేకపోవచ్చు. కడియం తాజా వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఏ విధంగా స్పందిస్తుంది ? స్పీకర్ నోటీసుకు ఎంఎల్ఏ ఏమని సమాధానం ఇస్తారో చూడాలి.