బీఆర్ఎస్ లో పెరిగిపోతున్న కవిత టెన్షన్

అధికారంలో ఉన్నపుడు వాళ్ళు పాల్పడిన అవినీతి, సంపాదించిన ఆస్తుల గురించి జనాల్లో తిరుగుతు ప్రస్తావిస్తున్నారు

Update: 2025-12-03 07:40 GMT
Kalvakuntla Kavitha

ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ లో కల్వకుంట్ల కవిత టెన్షన్ పెరిగిపోతోంది. తమ అధినేత కేసీఆర్ కూతురు కదాని మొదట్లో ఆమెను ఉపేక్షించిన వారికి ఇపుడు కవిత విషయంలో ఎలా వ్యవహరించాలో అర్ధంకావటంలేదు. విషయం ఏమిటంటే కవిత బీఆర్ఎస్(BRS) లోని సీనియర్ నేతల్లో ఒక్కొక్కళ్ళని టార్గెట్ చేస్తున్నారు. అధికారంలో ఉన్నపుడు వాళ్ళు పాల్పడిన అవినీతి, సంపాదించిన ఆస్తుల గురించి జనాల్లో తిరుగుతు ప్రస్తావిస్తున్నారు. అంతంత ఆస్తులను ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్లు చేస్తున్నారు. దాంతో ఇపుడు(Kavitha) కవితకు ఏమి సమాధానం చెప్పాలో తెలీక చాలామంది సీనియర్లు అవస్తలు పడుతున్నారు.

ఇదేసమయంలో రేపు కవిత ఎవరిగురించి మాట్లాడుతారో ? ఏమని ఆరోపణలు చేస్తారో అనే టెన్షన్ కూడా పెరిగిపోతోంది. కవిత చేస్తున్న ఆరోపణలు పంచాయితి ఎన్నికల్లో అందరు బిజీగా ఉన్నపుడే చేస్తుండటంతో ఏమి మాట్లాడితే ఏమి సమస్యలు వస్తాయో అనేది ఇంకో సమస్యగా మారింది. బీఆర్ఎస్ లో ఉన్నపుడు కవిత డైరెక్టుగా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, రాజ్యసభ మాజీసభ్యుడు సంతోష్ పైన తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. హరీష్, సంతోష్ ఇద్దరూ పార్టీ అధినేత కేసీఆర్ కు మేనల్లుళ్ళు అవుతారన్న విషయం అందరికీ తెలిసిందే. పార్టీ అధికారంలో ఉన్నపుడే హరీష్, సంతోష్ లాంటి అనేకమందిపైన చాలా అవినీతి ఆరోపణలున్నాయి. అయితే అధికారంలో ఉన్నారు కదా ఆరోపణలను వీళ్ళు పట్టించుకోలేదు.


ఓటమితోనే సమస్యలు బయటపడ్డాయా ?

2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవటంతోనే పార్టీలోని లుకలుకలన్నీ బయటపడుతున్నాయి. కవిత రూపంలో బీఆర్ఎస్ కు పెద్ద సవాలు ఎదురైంది. హరీష్, సంతోష్ పై చేసిన ఆరోపణలతో పాటు సోదరుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంతో చివరకు కవితను కేసీఆర్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. దాంతో మండిపోయిన కవిత పార్టీతో పాటు ఎంఎల్సీ పదవికి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. జాగృతి సంస్ధను బలోపేతం చేసుకుంటు ఇపుడు దాని ఆధ్వర్యంలోనే ‘జనంబాట’ లో తిరుగుతున్నారు.

హరీష్, సంతోష్ పైన మొదలైన కవిత ఆరోపణలు, విమర్శలు మెల్లిగా మిగిలిన సీనియర్లపైన కూడా మొదలయ్యాయి. మాజీమంత్రి జగదీశ్వరరెడ్డిని లిల్లీపుట్ అని కవిత ఎద్దేవాచేశారు. ఎద్దేవాచేయటమే కాకుండా జగదీశ్వర్ పాల్పడిన అవినీతి వ్యవహారాలను ప్రశ్నించటంతో పార్టీలో కలకలం మొదలైంది. కవిత ఆరోపణలపై ఏ విధంగా స్పందించాలో జగదీశ్ కు అర్ధంకాలేదు. ఎందుకంటే కవిత అంటే మామూలు నేతకాదు స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ గారాలపట్టి. మిగిలిన నేతలపైన ఘాటుగా స్పందించినట్లే కవిత మీద కూడా ఆరోపణలు, విమర్శలు చేస్తే ఏమవుతుందో అన్న ఆలోచనతోనే జగదీష్ మెత్తగా స్పందించారు. అయితే కవిత మరింత రెచ్చిపోవటంతో ఏమిచేయాలో తెలీక మౌనంగా ఉండిపోయారు. తర్వాత జగదీష్ కూడా కాస్త గట్టిగానే మాట్లాడినా అప్పటికే తనపైన కవిత చేసిన ఆరోపణలు జనాల్లోకి విస్తృతంగా వెళ్ళిపోయాయి.


ధీటుగా బదులివ్వలేకపోతున్నారా ?

ఆ తర్వాత మరో మాజీమంత్రి నిరంజన్ రెడ్డిమీద తాజాగా మరో మాజీమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపైన కూడా కవిత అవినీతి ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. జనంబాట పట్టిన కవిత జిల్లాల్లో పాదయాత్ర చేస్తున్నపుడు బీఆర్ఎస్ లో మంత్రులుగా చేసిన వారిపైన అవినీతి ఆరోపణలతో రెచ్చిపోతున్నారు. నిరంజన్ అయినా ప్రశాంత్ అయినా కవిత ఆరోపణలను అంతేస్ధాయిలో తిప్పికొట్టలేకపోతున్నారు. కారణం ఏమిటంటే కేసీఆర్ కూతురు అన్న ఏకైక కారణమే మాజీమంత్రులను గట్టిగా తిప్పికొట్టనీయకుండా వెనక్కులాగుతోంది. తాను ఎవరిపైన ఆరోపణలు చేయదలచుకున్నారో వాళ్ళపైన కవిత డైరెక్టుగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. కవిత చేస్తున్న ఆరోపణలే జనాల్లోకి ఏకపక్షంగా విస్తృతంగా వెళ్ళిపోతున్నాయి.

కవితచేస్తున్న అవినీతి ఆరోపణలపై ఎలాగ స్పందించాలో ? ఎలాగ తిప్పికొట్టాలో అర్ధంకాక మాజీలంతా తలలు పట్టుకుంటున్నారు. అందుకనే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వెనుకుండి కవితతో తమపైన అవినీతి ఆరోపణలు చేయిస్తున్నారంటు అర్ధంలేని వాదన వినిపిస్తున్నారు. బీఆర్ఎస్ మాజీమంత్రులపైన కవిత చేస్తున్న అవినీతి ఆరోపణలనే మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు జనాల్లోకి బాగా తీసుకుని వెళుతున్నారు. పంచాయితీ ఎన్నికల్లో కూడా కవిత ఆరోపణలనే ఆయుధాలుగా ఉపయోగించుకుంటున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల సందర్భంగా కూడా కవిత ఇలాగే బీఆర్ఎస్ లోని మాజీలపై అవినీతి ఆరోపణలు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.

Tags:    

Similar News