రేవంత్ ప్రభుత్వానికి కోమటిరెడ్డి వార్నింగ్
కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతు ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం ఇరకాటంలో పడేట్లుగా కామెంట్లు చేశారు;
దేశంలో పూర్తి ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ మాత్రమే. ఈ విషయం ఇప్పటికే అనేకసార్లు నిర్ధారణ అయ్యింది. ఇపుడీ విషయం ఎందుకంటే తాజాగా కాంగ్రెస్ పార్టీ(Telangana Congress) మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి(Komatireddy Rajagopal Reddy) తమ ప్రభుత్వానికి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతు ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం ఇరకాటంలో పడేట్లుగా కామెంట్లు చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే యువతతో పెట్టుకుంటే ఎలాంటి ప్రభుత్వమైనా మనుగడ సాధించటం కష్టమన్నారు. మొన్ననే నేపాల్లో(Nepal)యువత రెచ్చిపోవటంతో ఏమైందో అందరం చూశామన్నారు. అంటే తెలంగాణలో కూడా యువత ప్రభుత్వం మీద రెచ్చిపోతారు అని చెప్పకనే చెప్పటం అన్నమాట.
ఏవిషయంలో రేవంత్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించటం లేదని మండిపోయారు. ఉద్యోగాలకోసం యువత పెట్టుకున్న ఆశలను ప్రభుత్వం వమ్ముచేయకూడదని హితవు చెప్పారు. యువత రెచ్చిపోతే ఏమవుతుంది అనేందుకు నేపాల్ లో జరిగిన ఘటనలే ఉదాహరణలుగా గుర్తుచేశారు. ఆ పరిస్దితి తెలంగాణలో తెచ్చుకోవద్దని రేవంత్ కు వార్నింగ్ ఇచ్చారు. యువత రెచ్చిపోతే వాళ్ళని ఆపటం కష్టమన్నారు.
ఇదంతా కోమటిరెడ్డి ఎందుకు మాట్లాడారో ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది. ఇప్పటి వ్యాఖ్యల నేపధ్యం ఏమిటంటే మంత్రిపదవికోసం చాలాఆశలుపెట్టుకున్న ఎంఎల్ఏ భంగపడ్డారు. తనకు మంత్రిపదవి ఇచ్చి తీరాల్సిందే అని కోమటిరెడ్డి చాలా గట్టిగా డిమాండ్ వినిపించారు. అయితే ఎంఎల్ఏ ఎంత డిమాండ్ చేసినా అధిష్ఠానం పట్టించుకోలేదు. అధిష్ఠానంపైన ఉన్న కోపాన్ని కోమటిరెడ్డి తరచూ రేవంత్ ప్రభుత్వంపై చూపిస్తున్నారు. తనకు సంబంధంలేని విషయాలతో పాటు రేవంత్ వివిధకార్యక్రమాల్లో మాట్లాడిన మాటలకు పూర్తివిరుద్ధంగా కౌంటర్లతో రెచ్చిపోతున్న విషయం అందరు చూస్తున్నదే. ఇపుడు యువతను అడ్డుపెట్టుకుని నేపాల్ పోలికతో సొంత ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వటం కూడా రేవంత్ మీద ఆగ్రహంతోనే అని అర్ధమవుతోంది. ఇంతటి పూర్తి ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ ఏ పార్టీలో అయినా కనబడుతుందా ?