కేటీఆర్ తెలివంతా చూపిస్తున్నారా ?
ఒకపార్టీ టికెట్ మీద గెలిచిన ఎంఎల్ఏలు మరో పార్టీలో చేరటం ముమ్మాటికి తప్పే
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నారు. ఫిరాయింపు ఎంఎల్ఏల విషయంలో కొద్దిరోజులుగా ఒకటే గోలచేస్తున్నారు. దమ్ముంటే బీఆర్ఎస్(BRS) నుండి కాంగ్రెస్(Telangana Congress)లోకి ఫిరాయించిన ఎంఎల్ఏలు(BRS defection MLAs)రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దమ్ముంటే రాజీనామాలు చేసి ఉపఎన్నికల్లో మళ్ళీ పోటీచేసి గెలవాలని చాలెంజులు విసురుతున్నారు. తమహయాంలో ఇతర పార్టీలనుండి తీసుకున్న(లాక్కున్న) ఎంఎల్ఏలు బహిరంగంగా, ధైర్యంగా తాము బీఆర్ఎస్ లో చేరామని ప్రకటించారని చెబుతున్నారు. అంత ధైర్యం ఇప్పుడు తమపార్టీలో నుండి కాంగ్రెస్ లో చేరిన ఎంఎల్ఏలకు ఎందుకు లేదని నిలదీస్తున్నారు. ఇక్కడే కేటీఆర్(KTR) అతి తెలివంతా బయటపడుతోంది.
ఫిరాయింపులు నైతికంగా తప్పు. ఒకపార్టీ టికెట్ మీద గెలిచిన ఎంఎల్ఏలు మరో పార్టీలో చేరటం ముమ్మాటికి తప్పే. అది ఒకరిద్దరు వెళ్ళినా లేదా గుంపుగా వెళ్ళినా నైతికంగా తప్పే అనటంలో సందేహంలేదు. పార్టీ ఫిరాయించటం తప్పన్న తర్వాత ధైర్యంగా ప్రకటిస్తే ఏమిటి ప్రకటించకపోతే ఏమిటి ? కాంగ్రెస్, టీడీపీల నుండి బీఆర్ఎస్ లోకి లాక్కున్న ఎంఎల్ఏలు తాము బీఆర్ఎస్ లో చేరామని ప్రకటించటాన్ని ధైర్యంగా కేటీఆర్ వర్ణిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. చేసిందే తప్పయినపుడు దాన్ని మళ్ళీ సమర్ధించుకోవటం విచిత్రమే. ఫిరాయింపులకు సంబంధించి అప్పట్లో కేసీఆర్ చేసిన పనే ఇపుడు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేస్తున్నారు. చేసిన, చేస్తున్న పనిలో కేసీఆర్, రేవంత్ ఇద్దరిదీ ఒకే పద్దతి. అప్పట్లో కేసీఆర్ చేసింది తప్పయితే ఇపుడు రేవంత్ చేస్తున్నదీ తప్పు. అప్పట్లో కేసీఆర్ చేసింది ఒప్పయితే ఇపుడు రేవంత్ చేస్తున్నదీ ఒప్పే.
అప్పట్లో ఫిరాయింపులకు వ్యతిరేకంగా టీడీపీ, కాంగ్రెస్ ఎంఎల్ఏలు స్పీకర్లకు ఎన్నిఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. ఇప్పటి స్పీకరూ పట్టించుకోలేదు. అప్పటికి ఇప్పటికి తేడా ఏమిటంటే న్యాయస్ధానాల జోక్యమే. కేసీఆర్ ఫిరాయింపులకు వ్యతిరేకంగా టీడీపీ, కాంగ్రెస్ ఎంఎల్ఏలు కోర్టుల్లో కేసులు వేసినా పెద్దగా స్పందించలేదు. ఇపుడు ఫిరాయింపులకు వ్యతిరేకంగా కేటీఆర్, వివేకానందగౌడ్, పాడికౌశిక్ రెడ్డి వేసిన కేసులపై సుప్రింకోర్టు సీరియస్ గా స్పందించింది. సుప్రింకోర్టు సీరియస్ అవటంవల్లే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందిస్తున్నారు.
అప్పట్లో ఫిరాయింపులతో కేసీఆర్ రాజీనామాలు చేయించలేదు. ఇపుడు ఫిరాయింపులు కూడా రాజీనామాలు చేయాలని అనుకోవటంలేదు. అప్పట్లో కేసీఆర్ 35 మంది ఎంఎల్ఏలు, 18 మంది ఎంఎల్సీలు, నలుగురు ఎంపీలను లాక్కున్నారు. కేసీఆర్ ఫిరాయింపులతో పోల్చితే రేవంత్ చేసింది తక్కువనే చెప్పాలి. అప్పట్లో ఫిరాయింపు ఎంఎల్ఏలు తలసాని శ్రీనివాసయాదవ్, సబితా ఇంద్రారెడ్డికి కేసీఆర్ మంత్రిపదవులు కూడా ఇచ్చారు. ఇపుడు రేవంత్ ఆపనిచేయలేదు. రేవంత్ ఫిరాయింపులను తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో కేటీఆర్ నోటికొచ్చింది మాట్లాడుతున్న విషయం అర్ధమైపోతోంది. ఇపుడు ఫిరాయింపుల ఎంఎల్ఏలను రాజీనామాలు చేయాలని రోజూ డిమాండ్ చేస్తున్న కేటీఆర్ అప్పట్లో ఫిరాయింపు ఎంఎల్ఏలతో ఎందుకు రాజీనామాలు చేయించలేదన్న వేములవాడ ఎంఎల్ఏ, విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నకు మాత్రం కేటీఆర్ సమాధానం చెప్పటంలేదు.