‘తెలంగాణను మరవడం అభిప్రాయమా.. పొరపాటా?’
బీజేపీ నేత చర్య తమను ఎంతో బాధించింది. ప్రధాని మోదీని వివరణ కోరిన మాజీ మంత్రి కేటీఆర్.;
భారతదేశ మ్యాప్‌లో తెలంగాణ లేకపోవడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారితీస్తోంది. ఈ అంశంపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్.. బీజేపీ అధిష్టానాన్ని, ప్రధాని మోదీని ప్రశ్నించారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిందా? లేకుంటే పొరపాటు మాత్రమేనా? అనేది వివరించాలని డిమాండ్ చేశారు. ఇది నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని అన్నారు కేటీఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి పదేళ్లు పూర్తయినా.. ఇప్పటికీ బీజేపీ ఆ విషయం గుర్తులేదు, అర్థం కాలేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాల పాటు పోరాడి వందల మంది చేసిన ప్రాణ త్యాగాలకు ప్రతీక ప్రత్యేక తెలంగాణ, ఈ విషయాన్ని బీజేపీ ప్రభుత్వం మర్చిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు.
అసలు సమస్య ఇదే..!
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మాధవ్.. మంత్రి నారా లోకేష్‌కు భారతదేశ చిత్రపటాన్ని బహూకరించారు. అందులో అన్ని రాష్ట్రాలు ఉన్నాయి.. ఒక్క తెలంగాణ తప్ప. తెలంగాణ ప్రదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఉండటం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిని తెలంగాణ నేతలు, ప్రజలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇది తెలంగాణ సంస్కృతి, ప్రజలను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఎక్స్(ట్విట్టర్) వేదికగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ చర్యలపై వివరణ ఇవ్వాలని కోరారు.
మా చరిత్రను తొలగిస్తే మేమెవరం?
తెలంగాణ అస్తిత్వాన్ని, భౌగోళిక గుర్తింపును మర్చిపోవడం, అసలు గుర్తించకపోవడమే బీజేపీ అధికారిక విధానమా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘దశాబ్దాలపాటు తెలంగాణ సాంస్కృతిక గుర్తింపు కోసం, చరిత్రలో తమకు సరైన చోటు దక్కడం కోసం, ప్రత్యేక భౌగోళిక గుర్తింపు, ప్రత్యేక రాష్ట్రం కోసం ఎనలేని పోరాటాలు చేసింది తెలంగాణ గడ్డ. అయితే మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మా సాంస్కృతిక గుర్తింపుని అస్తిత్వాన్ని ప్రశ్నార్ధకం చేసేలా భారతదేశ చిత్రపటాన్ని ఉపయోగించారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ బహుమతిగా ఇచ్చిన మ్యాపులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని మాత్రమే చూపించడం దారుణం’’ అని అన్నారు.
‘‘తెలంగాణ రాష్ట్రం అస్తిత్వాన్ని లెక్కచేయకుండా చేసిన చర్య మమ్మల్ని తీవ్రంగా బాధించింది. ఇది పూర్తిగా అనుచితమైంది. భారతదేశ చిత్రపటం నుంచి మా చరిత్రనే తొలగిస్తే మేమెవరం?, ఇది మీ పార్టీ అధికారిక అభిప్రాయమా?, లేదా ఈ చర్య కేవలం ఒక పొరపాటా అనే విషయంపై మీరు వెంటనే స్పష్టత ఇవ్వాలి. ఇది తెలంగాణ ప్రజల త్యాగాలు, రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటాలను, బలిదానాలను అగౌరవపరచడమే కాకుండా మా చరిత్రను నిర్లక్ష్యం చేసిన బిజెపి నేతలు క్షమాపణ చెప్పాలి. పొరపాటైతే, తెలంగాణ ప్రజలని అపహాస్యం చేసినందుకు మీ పార్టీ నాయకత్వం వెంటనే క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు కేటీఆర్.