కేటీఆర్ కార్ రేసు వర్సెస్ రేవంత్, మెస్సీ: హైదరాబాద్ ఇమేజిపై చర్చ

బ్రాండ్ అంబాసిడర్ గా మెస్సీ పెట్టుబడుల కన్నా పర్యాటక రంగంపైన ప్రభావం చూపే అవకాశముంది

Update: 2025-12-02 08:24 GMT
Revanth-Messi and KTR-Formula car race

ఇపుడిదే విషయమై సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతోంది. అప్పట్లో ఫార్ములా కార్ రేసును నిర్వహించటం ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని ప్రపంచానికి చాటిచెప్పినట్లుగా (BRS)బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్(KTR)కేటీఆర్ కొన్ని వందలసార్లు చెప్పుంటారు. ఉద్దేశ్యం మంచిదే అయ్యుండచ్చు కాని ఆచరణలో చివరకు జరిగింది ఏమిటి ? తెరవెనుక ఒప్పందాలు, క్విడ్ ప్రో కో, ఎలక్టోరల్ బాండ్లు, నియమ, నిబంధనలను ఉల్లంఘించి కోట్లాది రూపాయల చెల్లింపు. ఫలితంగా బ్రాండ్ ఇమేజి పెరిగిందా లేకపోతే తగ్గిందా ? కేటీఆర్ మీద ఏసీబీ, ఈడీ కేసులు నమోదుచేసి విచారణలు జరుపుతున్నాయి. కేటీఆర్ ఆదేశాలను పాటించినందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ తో పాటు హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన బీఎల్ఎన్ రెడ్డి మీద కూడా కేసులు, విచారణలు. చివరకు బ్రిటన్లోని ఫార్ములా ఈ ఆపరేషన్స్ సీఈవో మీద కూడా కేసులు, విచారణలు.

ఫార్ములా కార్ రేసు పేరుతో కేటీఆర్ కోట్లాది రూపాయలు కొల్లగొట్టినట్లుగా ఏసీబీ కోర్టుకు చెప్పింది. కేటీఆర్ నిర్వాకంవల్ల తెలంగాణ ప్రభుత్వానికి వందలాది కోట్ల రూపాయలు నష్టం జరిగిందని దర్యాప్తు నివేదికలో చెప్పింది. తెరవెనుక ఒప్పందాల వల్ల కార్ రేసు నిర్వహణ నుండి మధ్యలోనే తప్పుకున్న ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ బీఆర్ఎస్ కు రు. 45 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చినట్లు ఏసీబీ నివేదిక స్పష్టంచేసింది. నియమ, నిబంధనలను ఉల్లంఘించి బ్రిటన్ కంపెనీకి కోట్లరూపాయలు చెల్లించిన కారణంగా తెలంగాణ ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ రు. 8 కోట్లు జరిమానా విధించినట్లు కూడా ఏసీబీ నివేదికలో స్పష్టంచేసింది. కేటీఆర్ అధికార దుర్వినియోగం కారణంగా తెలంగాణ పరువు పోయిందని ఏసీబీ నివేదికలో అర్ధమవుతోంది. ఈడీ రంగంలోకి దిగి ఫార్ములా కార్ రేసు వ్యవహారంలో మనీల్యాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తోంది.

ఏ కోణంలో చూసినా కేటీఆర్ చెప్పినట్లుగా తెలంగాణ ఇమేజీ ఏమీ పెరగలేదు సరికదా దెబ్బ తినేసిందని రేవంత్ అండ్ కో పదేపదే ఆరోపిస్తున్నారు. కేటీఆర్ కు సహకరించినందుకు చాలామంది ఇపుడు కేసులు, విచారణలను ఎదుర్కొంటున్నారన్నది వాస్తవం.

ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే ఈనెల 13వ తేదీన ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం లియొనల్ మెస్సీ హైదరాబాదుకు వస్తున్నాడు. ఉప్పల్ స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్ లో పాల్గొనబోతున్నాడు. మెస్సీ జట్టుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జట్టుకు మ్యాచ్ జరగబోతోంది. మెస్సీ హైదరాబాదుకు వచ్చి రేవంత్ జట్టుతో మ్యాచ్ ఆడటం వల్ల తెలంగాణకు పెట్టుబడుల వరద ఏమీ పారదు. తెలంగాణకు మెస్సీని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలన్నది రేవంత్ ఆలోచన. మెస్సీ బ్రాండ్ అంబాసిడర్ అవటం వల్ల తెలంగాణలో అద్భుతాలు ఏమీ జరిగిపోవు. అయితే ప్రపంచంలో హైదరాబాద్ ఇమేజి పెరగటం అయితే ఖాయమనే అనిపిస్తోంది. ఎలాగంటే ప్రపంచంలో ఫుట్ బాల్ ను సుమారు 150 దేశాలు ఆడుతాయి. ఫుట్ బాల్ ఆడే అన్నీ దేశాల్లోను లియొనల్ మెస్సీ అంటే తెలీని వారుండరు.

హైదరాబాదులో మెస్సీ పాల్గొనే మ్యాచ్ లైవ్ రిలే ఉంటుంది. కాబట్టి మ్యాచ్ జరిగినపుడు ప్రపంచంలోని ఫుట్ బాల్ ప్రేమికుల్లో అత్యధికులు తప్పకుండా మ్యాచ్ చూసే అవకాశముంది. అన్ని కోట్లమంది మ్యాచ్ ను చూసినపుడు మెస్సీ ఆడబోతున్న లేదా ఆడుతున్న మ్యాచ్ హైదరాబాదులో జరగబోంతోందని లేదా జరుగుతోందని అందరికీ తెలుస్తుంది. ఆ విధంగా మ్యాచ్ కారణంగా హైదరాబాద్ తప్పకుండా ప్రపంచంలోని చాలా దేశాలకు చేరువవుతుంది. ఆదేశాల్లోని జనాల్లో కొంతమంది అయినా హైదరాబాద్ గురించి గూగులమ్మను అడగకుండా ఉంటారా ? ఎందుకంటే మెస్సీ హైదరాబాదులో మ్యాచ్ ఆడుతున్నాడంటే ఎందుకు ఆడుతున్నాడు ? సందర్భం ఏమిటనే విషయమై తన అభిమానులు గూగుల్ లో వెతక్కుండా ఉంటారా ? అప్పుడు హైదరాబాద్ గురించి తెలుసుకోకుండా ఉంటారా ? ఈ విధంగా ప్రపంచదేశాల్లో హైదరాబాద్ ఇమేజి పరిచయం అవుతుంది కదా.

బ్రాండ్ అంబాసిడర్ గా మెస్సీ పెట్టుబడుల కన్నా పర్యాటక రంగంపైన ప్రభావం చూపే అవకాశముంది. పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలు మెస్సీని చూసి పెట్టరు. వారికి కావాల్సిన సౌకర్యాలు, లాభాలు, రాయితీల్లాంటివి ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. అదే పర్యాటకరంగం అంటే తెలంగాణలోని పర్యాటక ప్రదేశాల గురించి డీటైల్డ్ గా గూగుల్ లో కాని లేదా తెలంగాణ పర్యాటక శాఖ వెబ్ సైట్లో కాని చూస్తే సరిపోతుంది. ఎలాగూ హైదరాబాదుకు చాలా దేశాలతో ఇంటర్నేషనల్ ఎయిర్ కనెక్టివిటి ఉంది కాబట్టి పర్యాటకరంగానికి మెస్సీ కారణంగా కొంత ఉపయోగం జరిగే అవకాశముంది. తెలంగాణలో ప్రముఖ పర్యాటకరంగాలగురించి మెస్సీతో చెప్పిస్తే ప్రపంచ పర్యాటక ప్రేమికులు మరింత ఆకర్షితులవుతారు. కేటీఆర్ ఫార్ములా కార్ రేసు వల్ల హైదరాబాద్ ఇమేజి పెరిగిందా ? లేకపోతే రేవంత్- మెస్సీ మ్యాచ్ వల్ల హైదరాబాద్ ఇమేజి పెరుగుతుందా ?

Tags:    

Similar News