అతి పురాతనమైన కథ తో "రాజు యాదవ్"

గత రెండు వారాలుగా పెద్ద తెలుగు సినిమాలు ఏవి విడుదల కాలేదు. అన్ని చిన్న సినిమాలే. దాంతోపాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసేస్తారు అన్న వార్తలు కూడా వచ్చాయి.

Update: 2024-05-24 11:04 GMT

గత రెండు వారాలుగా పెద్ద తెలుగు సినిమాలు ఏవి విడుదల కాలేదు. అన్ని చిన్న సినిమాలే. దాంతోపాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసేస్తారు అన్న వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో జబర్దస్త్ ఆర్టిస్ట్ గెటప్ శీను హీరోగా విడుదలైన సినిమా ఇది. ఈ మధ్యకాలంలో గెటప్ శీను చిరంజీవి వాల్తేరు వీరయ్య, సూపర్ హిట్ అయిన హనుమాన్ లాంటి సినిమాల్లో నటించాడు. సోలో హీరోగా రాజు యాదవ్ సినిమాతో ప్రేక్షకుల ను నవ్వించడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమా గతంలో విడుదలై, పర్వాలేదు అనిపించుకున్న సుహాస్ సినిమా " ప్రసన్న వదనం" లాంటి పాయింట్ తోనే దర్శకుడు కృష్ణమాచారి తీశాడు. రెండు సినిమాల్లో హీరోలకి యాక్సిడెంట్ అయ్యి ముఖానికి సంబంధించిన ఒక సమస్య వస్తుంది.సుహాస్ సినిమాలో, హీరో ముఖాలను గుర్తుపట్టలేని రుగ్మతకు గురి అయితే, ఈ సినిమాలో గెటప్ శ్రీను ఎప్పుడూ నవ్వుతూనే ఉండవలసిన సమస్యకు గురవుతాడు.ఈ సినిమాలో తండ్రి కొడుకుల మధ్య సంబంధాన్ని కూడా బాగా చూపించారని ప్రీవ్యూ చూసినవాళ్లు అభిప్రాయపడ్డారు. అయితే మొదటి సినిమా థ్రిల్లర్. గెటప్ శీను సినిమా మాత్రం కామెడీ అని అర్థమయిపోయింది. ఎప్పుడు నవ్వుతూనే ఉండాల్సిన సినిమాలో గెటప్ శీను ప్రేక్షకులను ఎంత మాత్రం నవ్వించాడో చూద్దాం.

పలువురికి నచ్చిన సినిమా!

రాజు యాదవ్ సినిమా విజయవంతం కావాలని హస్యబ్రహ్మ బ్రహ్మనందం కోరుకున్నాడు. ఈ సినిమాలో గెటప్ శ్రీను పెర్పార్మెన్స్ అద్బుతంగా ఉందని. థియేటర్లలో సినిమా చూసి గెటప్ శీనును ఆదరించండి అంటూ రిక్వెస్ట్ చేశాడు.. అలాగే చాలామంది గెటప్ శీను స్నేహితులు, జబర్దస్త్ ఆర్టిస్టులు ఈ సినిమా రివ్యూ చూసి కన్నీళ్లు పెట్టుకున్నారని వార్తలు వచ్చాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గెటప్ శీను నటన బావుందని మెచ్చుకోవడం.

కనిపించని "సహజత్వం"

"ఈ సినిమా కథ దర్శకుడు చెప్పిన వెంటనే ఒప్పేసుకున్నాను. అంతగా నచ్చింది ఆ పాత్ర నాకు. వాస్తవ సంఘటన మీద ఈ పాత రాసుకున్నప్పటికీ, నా పాత్ర మాత్రం కల్పితమే. ఇది నేను ఇంతవరకు చేసిన పాత్రల కన్నా ఛాలెంజింగ్ గా ఉన్న పాత్ర అని నాకు అనిపించింది. ఈ సినిమాలో నాది ఒక పాత్ర మాత్రమే. నేను ఈ సినిమా హీరో అని అనుకోలేదు. ఎన్ని కష్టాలు ఎదురైనా తల్లిదండ్రుల కలను నిజం చేసే ఈ పాత్ర, ఒక సినిమాలో నేను చేసిన పూర్తిస్థాయి పాత్ర. ఒక్కోసారి ఈ పాత్రకు నేను నూరు శాతం న్యాయం చేయలేనేమో అనిపించింది. దర్శకుడు నా పాత్రను చక్కగా తీర్చిదిద్దడం వల్ల, ఈ సినిమా సహజంగా అనిపిస్తుంది. ఇలాంటి ఫీల్ గుడ్, సహజత్వానికి దగ్గరగా తీసిన రియలిస్టిక్ సినిమా ఇది. ప్రేక్షకులు దీని ఆదరిస్తానని నమ్ముతున్నా. " అని విడుదలకు ముందు గెటప్ శీను మీడియాతో చెప్పాడు.

పైన చెప్పినవన్నీ సినిమాలో అంతగా కనిపించలేదు. సహజత్వానికి దగ్గరగా ఈ సినిమా తీశాడు దర్శకుడు అని గెటప్ శీను చెప్పాడు. అయితే చాలా మటుకు సినిమా ఆసహజత్వానికి మారుపేరైంది. నిజానికి దర్శకుడు డిఫరెంట్ పాయింట్( ఇంత ముందే చెప్పినట్లు ప్రసన్న వదనం సినిమాలో లాగా) మీద ఆధారపడి కథ రాసుకున్నాడు. సినిమా దగ్గరికి వచ్చేటప్పటికి చాలా సాధారణమైన కథ, గజిబిజి కథనం, లాజిక్ ను భూతద్దం పెట్టి వెతకాల్సిన పరిస్థితి. ఇలాంటి కథతో అన్ని భాషల్లో కలిపి లెక్కలేని సినిమాలు వచ్చాయి. శేషు, ఆర్ఎక్స్ 100, బేబీ, తాజ్ మహల్, ప్రేమిస్తే... ఇలా రాసుకుంటూ పోతే కొన్ని పేజీలు అవుతాయి.

కొత్త పాయింటు- పాత కథ- ఆసక్తి కలిగించని కథనం

ఇక కథ గురించి చెప్పాలంటే, హీరో రాజు యాదవ్ (గెటప్ శీను) క్రికెట్ ఆడుతుండగా బాల్ ముఖానికి తగిలి తీవ్రమైన గాయం అవుతుంది. స్నేహితులు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర కి తీసుకెళ్తే, ఆ డాక్టరు కుట్లు వేయడంలో కన్ఫ్యూజ్ కావడం వల్ల, రాజు ముఖం నవ్వుతున్నట్లు తయారవుతుంది. దాన్ని మళ్ళీ ఒరిజినల్ కి తేవాలంటే 4 లక్షలు ఖర్చు అవుతుంది. రాజు తండ్రి దగ్గర అన్ని డబ్బులు ఉండవు. దాంతో ఏం చేయాలో తెలియక రాజు తిరుగుతుంటే, స్వీటీ(అంకిత కారత్) అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పరిచయం అవుతుంది. అన్ని సినిమాల్లో లాగే రాజుకి ఆమె మీద ప్రేమ పుడుతుంది. ఇంతవరకు ఓకే. దాని తర్వాత సినిమాలో ఏం జరిగిందో, అందరితో పాటు దర్శకుడికి కూడా తెలియలేదు. దాంతో సినిమా నడుస్తూ నడుస్తూ, ఓ రెండు గంటల తర్వాత అయిపోతుంది. మధ్యలో కొన్ని పాటలు(ఒకటి రెండు బానే ఉన్నాయి). హీరో గారి ప్రేమ ప్రహసనాలు, మందు తాగడాలు తప్ప సినిమాలో ఇంకేమీ కనిపించదు. . అక్కడక్కడ సినిమా కొంచెం ఆసక్తికరంగా ఉంది అనిపించిన మరుక్షణం, దర్శకుడు దాన్ని చెడగొట్టుకున్నాడు.

మెరిసిన శీను- మురిపించిన అంకిత

ఈ సినిమాలో ఏదన్నా ప్రస్తావించదగ్గ విషయం ఉందంటే, అది గెటప్ శీను నటన. బాగానే చేశాడు.. కానీ గుడ్ యాక్టింగ్ ఇన్ ఏ బ్యాడ్ మూవీ. ఎప్పుడు నవ్వుతున్నట్టు ముఖం పెట్టి నటించడం కొంచెం కష్టమే. ఆ విషయంలో గెటప్ శ్రీను ను అభినందించాలి. ఈ సినిమాలో ఇంకొక ప్రస్తావించదగ్గ అంశం హీరోయిన్ (లేక విలన్?) గా నటించిన ముంబై భామ అంకిత కారత్. చూడ్డానికి అందంగా ఉండటమే కాకుండా, కొంచెం నటించింది కూడా. ఆ అమ్మాయిని చూసిన వాళ్ళు ఎవరైనా సరే బోల్డ్ సన్నివేశాల్లో ఈ అమ్మాయి సరిపోతుంది అనిపించేలా ఉన్న అమ్మాయి, ఆ సన్నివేశాలకు పూర్తి న్యాయం చేసింది. ఎవరన్నా ఈ సినిమా గురించి చెప్పి ఈ సన్నివేశాల గురించి చెప్తే, యువ ప్రేక్షకులు ఈ సినిమాను చూసే అవకాశం ఉంది. ఈ సినిమాకు సంగీతం అందించిన హర్షవర్ధన్ ఒకటి రెండు పాటలు వినదగ్గవిగా స్వరపరిచాడు. అందుకు అతని అభినందించాలి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన సురేష్ బొబ్బిలి కూడా కొంచెం కష్టపడ్డాడు.

క్లారిటి లేని దర్శకుడు

ఈ మధ్యకాలంలో సినిమాలు తీస్తున్న యువ దర్శకులు, డిఫరెంట్ పాయింటు మీద తీయాలని కథ రాసుకొని, అలాగే తీస్తే బాగుండదని, ఇంకోలా తీయడం మొదలుపెట్టి, చివరకు మరోలా సినిమా తీస్తున్నారు. ఈ సినిమా ద్వారా దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడో ఎవరికీ అర్థం కాదు.

చివరగా చెప్పాలంటే ఈ పాయింట్ మాత్రమే కొత్తది. మిగతాది తాజ్ మహల్ అంత పురాతనమైనది, తెలుగు సినిమాల్లో చితక్కొట్టబడిన కథాంశం తో తీసిన సినిమా, కనీసం సరిగ్గా రాసుకుని, సరిగ్గా తీసి ఉంటే కొంచెమైనా చూడదగ్గదిగా ఉండేదేమో. ఏ కోణంలో చూసిన ఈ సినిమాను చూడటం కష్టమే. ఈ మధ్యకాలంలో సినిమాలు రావడం లేదు. దర్శకుడికి ఉత్సాహం ఉందని తెలుస్తుంది గానీ, సినిమాలో తనకు నచ్చిన సన్నివేశాలను, ఎక్కువసేపు చిత్రీకరించడం ద్వారా దర్శకుడు తన సినిమాని తానే చెడగొట్టుకున్నాడు. ఇది చాలావరకు ప్రేక్షకులను నిరాశపరిచే సినిమా.

Tags:    

Similar News