చెన్నూరు స్టేట్ బ్యాంక్ ను బురిడీ కొట్టించిన క్యాషియర్ అరెస్ట్
15 కిలోల బంగారం, రూ.1.60 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న రామగుండం పోలీసులు;
మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఎస్బిఐ బ్యాంకు క్యాషియర్ నరిగె రవీందర్ ను రామ గుండం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్ లైన్ బెట్టింగ్ లో 40 లక్షలు పోగొట్టుకున్న క్యాషియర్ తాను పని చేస్తున్న బ్యాంకును బురిడీ కొట్టించాలని ప్రయత్నించి చివరకు కటకటాల పాలయ్యాడు. బ్యాంకులో క్యాషియర్ గా పని చేస్తున్న నరిగె రవిందర్ ఖాతాను అడిట్ చేస్తుండగా అనుమానాస్పద డిపాజిట్లు కనిపించాయి. దీంతో లోతుగా దర్యాప్తు చేసిన అధికారులకు విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి.
ఆగస్టు 23వ తేదీన ఎస్బిఐ చెన్నూరు రీజినల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్తా ఫిర్యాదు మేరకు చెన్నూరు పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తే ఆ బ్యాంకులోనే పని చేస్తున్న క్యాషియర్ అక్రమాలు ఒక్కోటి వెలుగులోకి వచ్చాయి. రితేష్ కుమార్ గుప్తా ఫిర్యాదు ప్రకారం బ్యాంకులో 402 గోల్డ్ లోన్ ఖాతాల ఆభరణాలు (25.17 కిలోల బంగారం) ఉన్నాయి. వీటివిలువ రూ.12.61 కోట్ల వరకు ఉంది. బ్యాంకులో రూ.1.10 కోట్లు దుర్వినియోగం అయినట్టు రీజినల్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు అందుకున్న వెంటనే రామగుండం కమిషనర్ నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు బాధ్యతను జైపూర్ ఏసీపీ ఏ. వెంకటేశ్వర్ కు అప్పగించారు.దర్యాప్తు అధికారి బ్యాంకును తనిఖీ చేసి, సాంకేతిక ఆధారాలను సేకరించి, క్యాషియర్ నరిగె రవీందర్ ఖాతాలో ఆడిట్ నిర్వహించగా భారీగా అనుమానాస్పద డిపాజిట్లు ఉన్నట్లు తేలింది.
ప్రధాన నిందితుడు నరిగె రవీందర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో లక్షలు పోగొట్టుకున్నట్లు వెల్లడైంది. తన నష్టాన్ని పూడ్చుకోవడానికి క్యాషియర్ బ్రాంచ్ మేనేజర్ వెన్నపురెడ్డి మనోహర్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి లక్కాకుల సందీప్ సహకారం తీసుకుని మోసానికి పాల్పడ్డాడు. బ్యాంక్ కరెన్సీ ఛెస్ట్ తాళం మేనేజర్, క్యాషియర్ జాయింట్ గా ఉండేది. మేనేజర్ వెన్నపురెడ్డి మనోహర్ తన తాళాన్ని క్యాషియర్‌కు ఇచ్చినట్లు
దీన్ని ఆసరాగా చేసుకున్న క్యాషియర్ బ్యాంకును కొల్లగొట్టడానికి పథకం రచించాడు.అక్టోబర్ 2024 నుండి తరచూ గోల్డ్ లోన్ చెస్ట్ నుండి బంగారం తీసి, తన స్నేహితులైన కొంగోండి బీరష్ , కొడాటి రాజశేఖర్ , బొల్లి కిషన్ కు అప్పగించేవాడు. వీరు ఆ బంగారాన్ని ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలలో తాకట్టు పెట్టి, డబ్బును తమ ఖాతాల్లో జమ చేసుకుని కొంత కమిషన్ తీసుకుని మిగతా మొత్తాన్ని క్యాషియర్ రవీందర్‌కి బదిలీ చేసేవారు.
ఇప్పటివరకు నిందితులు 10 ప్రైవేట్ గోల్డ్ లెండింగ్ కంపనీలలో 44 మంది పేర్లపై 142 గోల్డ్ లోన్లు తీసుకున్నారు. క్యాషియర్ నరిగె రవీందర్ బ్రాంచ్ మేనేజర్‌తో కుమ్మక్కై తన భార్య, బావ మరిది, స్నేహితుల పేర్లతో తప్పుడు గోల్డ్ లోన్లు 42 మంజూరు చేయించాడు. బంగారం లేకుండానే రూ.1.58 కోట్లు అంటే 4.14 కిలోల బంగారం తాకట్టు పెట్టినట్లు చూపించాడు. ఆ మొత్తాన్ని నరిగె రవీందర్ తన ఖాతానుంచి విత్‌డ్రా చేసుకున్నాడు.ఏటీఎంలలో నగదు రీఫిల్ చేసే సమయంలో కూడా క్యాషియర్ డబ్బు అపహరించేవాడు.
దర్యాప్తు అధికారి ఇప్పటివరకు ముగ్గురు బ్యాంకు అధికారులు వారికి తోడ్పడిన 41 మందితో కలిపి మొత్తం 44 నిందితులను అరెస్టు చేశారు.
ఈ కేసులో ఇప్పటివరకు 15.23 కిలోల బంగారు నగలు రికవరీ అయ్యాయి. మిగతా బంగారు ఆభరణాలు రికవరీ చేయాల్సి ఉంది. గోల్డ్ లోన్ కంపెనీ మేనేజర్ ల పాత్ర పై విచారణ జరుగుతుంది.