కలెక్టర్ ముందే మనోజ్, మోహన్ బాబు గలాటా..
మంచు కుటుంబ అంశం రంగారెడ్డి కలెక్టర్ ఎదుట విచారణ జరిగింది. తనకు రక్షణ కల్పించాలని మోహన్ బాబు ఇటీవల కలెక్టర్ లేఖ రాశారు.;
మంచు కుటుంబ కథా చిత్రం మరోసారి వివాదాస్పదంగా మారింది. కొంత కాలంగా వీరి కుటుంబ తగాదాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. కొన్ని రోజుల నుంచి వీరి కుటుంబం అంతా కూడా వార్తలకు దూరంగా ఉంది. కాగా తాజాగా మనోజ్, మోహన్ బాబు.. తమ తగాదాకు సంబంధించి కలెక్టర్‌ను ఆశ్రయించారు. వారి కుటుంబ అంశం రంగారెడ్డి కలెక్టర్ ఎదుట విచారణ జరిగింది. తల్లిదండ్రులు, వృద్ధులు, సంరక్షణ, పోషణ చట్టం కింద తనకు రక్షణ కల్పించాలని మోహన్ బాబు ఇటీవల కలెక్టర్ లేఖ రాశారు.
బాలాపూర్ మండలం జల్‌పల్లి గ్రామంలో తానుంటున్న ఇంట్లోకి మనోజ్ అక్రమంగా ప్రవేశించారని, ఆస్తులు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. మోహన్ బాబు వేసిన పిటిషన్‌పై రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ సోమవారం విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు, మనోజ్ ఇద్దరూ కూడా సోమవారం మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. దాదాపు రెండు గంటల పాటు జిల్లా మెజిస్ట్రేలి వీరిని విచారించారు. ఈ నేపథ్యంలోనే ‘‘నా స్వార్జిత ఆస్తిపై ఎవరికీ హక్కు లేదు. మనోజ్ నా ఆస్తులు నాకు అప్పగించాలి’’ అని మోహన్ తేల్చి చెప్పారు. ఈ క్రమంలో మనోజ్, మోహన్ బాబులకు వాగ్వాదం జరిగింది.
కలెక్టర్ ముందే ఇద్దరూ రెచ్చిపోయారు. తీవ్ర పదజాలంతో దూషించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకుని.. అక్కడ గొడవపడకూడదని చెప్పడంతో మోహన్ బాబు, మనోజ్ బయటకు వెళ్లిపోయారు. కాగా వీరి కుటుంబ సమస్యపై విచారణను జిల్లా మెజిస్ట్రేట్ వచ్చే వారానికి వాయిదా వేశారు.