త్వరలో 40వేల ఉద్యోగాల భర్తీ: రేవంత్

తెలంగాణ ఉద్యమం ఈ ప్రాంతం నుంచి ఉవ్వెత్తున ఎగసిందని గుర్తు చేసిన ముఖ్యమంత్రి.

Update: 2025-12-03 13:52 GMT

తెలంగాణలో అతి త్వరలో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. బుధవారం హుస్నాబాద్‌లో పర్యటించిన రేవంత్.. రూ. 262.78 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనతరం నిర్వహించిన సభలో పాల్గొని పలు కీలక విషయాలను పంచుకున్నారు. ఈ పర్యటనలో.. రూ. 44.12 కోట్లతో హుస్నాబాద్‌లో ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ. 45.15 కోట్లతో హుస్నాబాద్‌లో ATC ఏర్పాటుకు, రూ. 20 కోట్లతో హుస్నాబాద్ మునిసిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు, రూ. 8.60 కోట్లతో RTA యూనిట్ ఆఫీస్‌కు, రూ. 86 కోట్లతో హుస్నాబాద్ అర్బన్- కొత్తపల్లి ప్యాకేజీ-1 లో భాగంగా 4 లైన్ల రహదారి నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. దాంతో పాటుగానే రూ. 58.91 కోట్లతో హుస్నాబాద్- అక్కన్నపేట 4 లైన్ల రహదారి నిర్మాణానికీ శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హుస్నాబాద్‌ నియోజకవర్గంలో తాజా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ, త్వరలో మరొక 40,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి రూ.262 కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.

సభలో ప్రసంగిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు, “సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్‌ హుస్నాబాద్‌ నుంచి బహుజన ఉద్యమానికి దండుగా నిలిచారు. తెలంగాణ ఉద్యమం ఈ ప్రాంతం నుంచి ఉవ్వెత్తున ఎగసింది. కరీంనగర్‌లో ఇచ్చిన మాటను నిలబెట్టే ఉద్దేశంతోనే సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చారు. శ్రీకాంతాచారి స్ఫూర్తితో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. ప్రజాపాలన రెండున్నరేళ్లు పూర్తయ్యేలోగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం”.

అంతేకాక, గత పాలకుల ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకొని, రాష్ట్రంలో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులపై సీఎం వ్యాఖ్యానించారు. “కాంగ్రెస్‌ హయాంలో నిర్మించిన ఎస్‌ఆర్‌ఎస్పీ ఎలా ఉందో, భారత రాష్ట్ర సమితి కట్టిన కాళేశ్వరం ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలి. మన రాష్ట్రంలో అత్యధికంగా వరిని పండించాము. వ్యవసాయం అంటే దండగ కాదు, పండగ అని చేసి చూపించాం. రైతుల కోసం రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు పెట్టాము. వందలాది బస్సులకు ఆడబిడ్డలు యజమానులు అయ్యారు. 3.10 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. రూ.22,500 కోట్లు పేదల ఇళ్ల కోసం ఖర్చు చేస్తున్నాం. గజ్వేల్‌, సిద్దిపేట, సిరిసిల్లలో మొదలు పెట్టిన ప్రాజెక్టులు పూర్తయ్యాయి. కానీ హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని గౌరెల్లి ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు. గత పాలకుల మాదిరిగా హుస్నాబాద్‌ను నిర్లక్ష్యం చెయ్యం. త్వరలో గౌరెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తాం” అని సీఎం వెల్లడించారు.

Tags:    

Similar News