సత్తుపల్లిలో రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి
మరో ఇద్దరి పరిస్థితి విషమం
ఖమ్మం జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి ముగ్గురు మృత్యువాతపడ్డారు. సత్తుపల్లి మండలం కిష్టాపురంలో ఓ కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో మర్కట్ల శశి అనే 11 ఏళ్ల బాలుడు ఉన్నాడు. మర్కట్ల శశితో పాటు మహబూబ్ నగర్ వాస్తవ్యులైన 25 ఏళ్ల కె సాజిద్, సత్తుపల్లి కొంపల్లి కాలనీకి చెందిన 18 ఏళ్ల సిద్దేసి జాయ్ ఉన్నారు. చనిపోయిన మర్కట శశి అనే బాలుడు చంద్రుగొండ మండలానికి చెందినట్లు పోలీసులు చెప్పారు. సమాచారం అందుకున్న సత్తుపల్లి ఇన్స్‌పెక్టర్ శ్రీహరి తన టీంతో ఘటనస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మృత దేహాలను సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని చేరవేశారు. ఈ ప్రమాదంలో తలారీ అజయ్, ఇమ్రాన్ అనే మరో ఇద్దరు తీవ్రగాయాలకు గురికావడంతో చికిత్స నిమిత్తం సత్తుపల్లి ఆస్పత్రిలో చేర్చారు. గాయాలకు గురైన వారి పరిస్థితి విషమంగానే ఉంది. కిష్టారం అంబేద్కర్ కాలనీ వద్ద అదుపుతప్పిన కారు డివైడర్ ను ఢీ కొట్టడంతో ప్రమాదం సంభవించింది. వీఎం బంజర నుంచి సత్తుపల్లి వెళుతుండగా ప్రమాదం వాటిల్లింది. టాటా అల్ట్రోజ్ కారు అతి వేగంతో డివైడర్ ను ఢీ కొట్టడం వల్లే ప్రమాదం సంభవించినట్టు పోలీసులు తెలిపారు.