ఆటోలో ఇద్దరి మృతదేహాలు, అసలేం జరిగింది ?
చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ కింద నిలిపున్న ఒక ఆటోలో ఇద్దరు యువకులు చలనం లేకుండా ఆటోలో ఉండటాన్ని స్ధానికులు గమనించారు
హైదరాబాద్ పాతబస్తీలోని ఒక ఆటోలో ఇద్దరి మృతదేహాలు బుధవారం ఉదయం కలకలం సృష్టించాయి. చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ కింద నిలిపున్న ఒక ఆటోలో ఇద్దరు యువకులు చలనం లేకుండా ఆటోలో ఉండటాన్ని స్ధానికులు గమనించారు. ఎంతసేపైనా అక్కడినుండి ఆటో కదలటంలేదు, యువకుల్లో చలనం కనబడలేదు. దాంతో స్ధానికులు ఆటోదగ్గరకు వచ్చి గమనించారు. అనుమానంవచ్చి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఫ్లైఓవర్ కింద ఉన్న ఆటో దగ్గరకు చేరుకున్న పోలీసులు యువకులను పరీక్షించారు. ఇద్దరు మరణించినట్లు నిర్ధారణ చేసుకున్నారు.
డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగానే యువకులు ఇద్దరు మరణించినట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. ఎలా నిర్ధారించారంటే ఘటనా స్ధలంతో పాటు ఆటోలో డ్రగ్స్ తీసుకున్న ఇంజెక్షన్లు, డ్రగ్స్ ప్యాకెట్ ను పోలీసులు గమనించారు. అందుకనే డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగానే యువకులు మరణించి ఉంటారని ప్రాధమికంగా పోలీసులు నిర్ధారించింది. స్ధానికుల సాయంతో చనిపోయిన యువకులను ఇర్ఫాన్, మహమ్మద్ జహంగీర్ అని గుర్తించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టమ్ కోసం ఆసుపత్రికి తరలించారు.
డ్రగ్స్ ను అరికట్టేందుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నిప్రయత్నాలు చేస్తున్న పెద్దగా ఉపయోగం కనబడటంలేదు. యధేచ్చగా డ్రగ్స్ సరఫరా, వినియోగం జరుగుతునే ఉంది. ఏదో రూపంలో డ్రగ్స్ అమ్మకాలు, కొనుగోళ్ళు జరుగుతున్నాయి. రేవ్ పార్టీల పేరుతో, కొన్ని పబ్బుల్లో డ్రగ్స్ వినియోగం విపరీతంగా ఉంది. పోలీసులు ఎన్నిసార్లు ఫామ్ హౌసులపైన, పబ్బులు, సమాచారం వచ్చిన ప్రతిచోటా దాడులు చేస్తున్నారు, డ్రగ్స్ స్వాధీనం చేసుకోవటంతో పాటు వినియోగిస్తున్న వారిని కూడా అదుపులోకి తీసుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపటంలో భాగంగా రేవంత్ ప్రభుత్వం ఈగల్ అనే వ్యవస్ధను ప్రత్యేకంగా ఏర్పాటుచేసినా పెద్దగా ఉపయోగం కనబడటంలేదు. ఆఫ్రికా దేశాల నుండి నగరానికి వచ్చిన కొందరి కారణంగానే డ్రగ్స్ సరఫరా, వినియోగం బాగా పెరిగిపోతోందని పోలీసులు గుర్తించారు. తాజా ఘటనను దర్యాప్తుచేస్తున్న పోలీసులకు ఎలాంటి సమాచారం దొరుకుతుందో చూడాలి.