ఈ ముగ్గురిలో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ ఎవరికో ?
అనేకమందితో మాట్లాడిన కమిటి చివరకు శుక్రవారం మూడుపేర్లను రికమెండ్ చేసినట్లు సమాచారం
తొందరలో జరగబోయే జూబ్లీహిల్స్(Jubilee Hills) అసెంబ్లీనియోజకవర్గం ఉపఎన్నికలో మంత్రుల కమిటి మూడుపేర్లను సిఫారసుచేసింది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) నుండి గెలిచిన మాగంటి గోపీనాధ్(Maganti Gopinath) మరణించిన విషయం తెలిసిందే. ఎంఎల్ఏ మరణంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఉపఎన్నిక ఖాయం అవటంతో కాంగ్రెస్(Telangana Congress) తరపున పోటీచేయటానికి చాలామంది నేతలు గట్టిప్రయత్నాలు చేసుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, నవీన్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎంఎల్ఏ దానం నాగేందర్(Danam Nagendar), సీనియర్ నేత బండిరమేష్ లాంటి మరికొందరు టికెట్ రేసులో ఉన్నారు.
ఆశావహులతో మాట్లాడి ముగ్గురు గట్టినేతల పేర్లను సిఫారసుచేసేందుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ తో ఒక కమిటి ఏర్పాటుచేశారు. ఈ కమిటి ఆశావహులతో చాలాసార్లు మాట్లాడింది. అధిష్ఠానం నుండి రేవంత్, మంత్రుల కమిటీకి ఒక సూచన వచ్చింది. అదేమిటంటే పోటీచేయే అభ్యర్ధి కచ్చితంగా స్ధానికుడే అయ్యుండాలని. అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన నేతలనే పోటీచేయించాలని అధిష్ఠానం డిసైడ్ అయ్యింది. ఈ పద్దతిలోనే మంత్రుల కమిటి ఆశావహులతో మాట్లాడింది. అనేకమందితో మాట్లాడిన కమిటి చివరకు శుక్రవారం మూడుపేర్లను రికమెండ్ చేసినట్లు సమాచారం. ముగ్గురు నేతలు ఎవరంటే బండి రమేష్, దానం నాగేందర్, నవీన్ యాదవ్.
ఈ ముగ్గురిలో దానం బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన విషయం అందరికీ తెలిసిందే. తొందరలోనే దానంపై అనర్హత వేటుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకనే తనకు జూబ్లీహిల్స్ అసెంబ్లీలో పోటీచేసే అవకాశం ఇవ్వాలని గట్టిగాపట్టుబడుతున్నారు. తనకు టికెట్ ఇస్తే గెలుపుఖాయమని అనుకుంటున్నారు. జూబ్లీహిల్స్ ఎంఎల్ఏగా గెలిచి వెంటనే ఖైరతాబాద్ ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయాలని అనుకుంటున్నారు. అప్పుడు ఎంఎల్ఏ అనర్హత వేటునుండి తప్పించుకోవచ్చన్నది దానం ఆలోచన. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించగానే పార్టీ చెప్పినమాట కాదనకుండా సికింద్రాబాద్ ఎంపీగా పోటీచేసిన విషయాన్ని దానం అధిష్ఠానం దగ్గర గుర్తుచేస్తున్నారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ తరపున పోటీచేసిన దానం ఓడిపోయారు. అదేవిషయాన్ని ఇపుడు గుర్తుచేస్తు తనకు జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాల్సిందే అని దానం గట్టిగా పట్టుబడుతున్నారు.
నవీన్ యాదవ్ ఎంఐఎం పార్టీలో ఉండి పోయిన ఎన్నికల్లోనే కాంగ్రెస్ లోకి వచ్చారు. అలాగే చాలాకాలం బీఆర్ఎస్ లో పనిచేసిన బండి రమేష్ 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరారు. కుకట్ పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయారు. ఆర్ధికంగా దానం, నవీన్, బండి ముగ్గురూ బలవంతులే. బండి కమ్మ సామాజికవర్గంకు చెంది నేత కావటం మరింతగా ప్లస్ అయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గం నేతలకు గట్టి పట్టుంది.
మంత్రుల కమిటి కూడా పై ముగ్గురి పేర్లను సిఫారసు చేయటమే కాకుండా వారికి ఉన్న ప్లస్సులు, మైనస్సులను కూడా తమ రిపోర్టులో పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు వివరించింది. ఈ రిపోర్టుపై చర్చించేందుకు తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ శనివారం హైదరాబాదుకు వచ్చారు. మీనాక్షి-బొమ్మ ఇద్దరు మూడుపేర్లపై చర్చించిన తర్వాత రేవంత్ తో సాయంత్రం లేదా రాత్రికి భేటీ అవుతారు. ఆ తర్వాత జాబితాను అధిష్ఠానంలో కీలకనేత, జాతీయ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో మాట్లాడుతారు. జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నకారణంగా అభ్యర్ధి ఎంపికపై అగ్రనేత రాహుల్ గాంధితో రేవంత్ చర్చించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవకాశం ఉంటే ఖర్గే కూడా భేటీలో పాల్గొనే అవకాశముందని పార్టీవర్గాల సమాచారం. జూబ్లీహిల్స్ టికెట్ కోసం ఖమ్మం, నిజామాబాద్ నేతలు కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు పార్టీ నేతలు చెప్పారు. అయితే స్ధానికులకే టికెట్ అన్న అధిష్ఠానం సూచనతో చాలామంది ఆశావహుల పేర్లను మంత్రుల కమిటి పక్కనపెట్టేసింది.
సునీతే అభ్యర్ధి
బీఆర్ఎస్ తరపున మాగంటి సునీతకే బీఆర్ఎస్ టికెట్ ఇవ్వబోతోంది. దివంగత ఎంఎల్ఏ మాగంటి గోపీనాధ్ భార్యే సునీత. రాజకీయాలకు కొత్తయినా సునీతకు బీఆర్ఎస్ టికెట్ ఎందుకు ఇచ్చిందంటే గోపి మరణం తాలూకు సానుభూతి ఓట్లుపడి గెలిపిస్తుందని. కాంగ్రెస్ పార్టీయేమో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమపథకాల అమలు వల్ల అభ్యర్ధి గెలుస్తాడని ఆశలు పెట్టుకుంది. ఇదేసమయంలో బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ ప్రభుత్వంమీద వ్యతిరేకత+సానుభూతి వల్ల సునీత గెలుపు ఖాయమని అనుకుంటోంది. బీజేపీ ఇంకా అభ్యర్ధిపై కసరత్తు చేస్తోంది. బహుశా లంకల దీపక్ రెడ్డికి టికెట్ దక్కవచ్చని పార్టీవర్గాల్లో చర్చ నడుస్తోంది.
మైనారిటీలే కీలకమా ?
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనారిటీ ఓట్లే కీలకం కాబోతున్నాయి. సవరించిన ఓటర్లజాబితా ప్రకారం నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 3.99 లక్షలు. వీరిలో ముస్లిం మైనారిటీల ఓట్లే సుమారు లక్షకు పైగా ఉన్నాయి. అలాగే సీమాంధ్రుల ఓటర్లు ముఖ్యంగా సినీపరిశ్రమకు చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ముస్లింల ఓట్ల తర్వాత ఎస్సీ, కమ్మ, యాదవ, రెడ్డి ఓట్లు కీలకం. కాంగ్రెస్ తరపున ఎవరు పోటీచేసినా ఎంఐఎం సహకారం పూర్తిగా దొరికితే గెలుపుఖాయమనే చర్చ జరుగుతోంది. 2023ఎన్నికల్లో ఇక్కడనమోదైన ఓటింగ్ 48శాతం మాత్రమే. పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు, వివిధ రంగాల్లోని ప్రముఖులు చాలామంది ఇదే నియోజకవర్గంలో ఉన్నారు. అయితే వీరిలో పోలింగుకు వచ్చేవారు తక్కవే. పోయిన ఎన్నికల్లో 48శాతం ఓటింగ్ నమోదయ్యిందంటే బస్తీల్లోని ఓటర్లు, మధ్య తరగతి జనాలు పోలింగులో పాల్గొనబట్టే. మరీ రాబోయే ఉపఎన్నికలో ఏమి జరుగుతుందో చూడాలి.