వరంగల్ లో బీఆర్ఎస్ చక్రం తిప్పేదెవరు?

కడియం శ్రీహరి పార్టీ మారడాన్ని ప్రచార అస్త్రంగా మార్చుకుని కాంగ్రెస్ వైపు గురిపెట్టారు హరీష్ రావు. కడియం కాంగ్రెస్లో చేరడంతో పార్టీలో జోష్ పెరిగిందని అన్నారు.

Update: 2024-04-03 16:48 GMT

పార్లమెంటు ఎన్నికలవేళ వరంగల్ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. కారణం.. టికెట్ టికెట్ ఇచ్చాక కడియం కావ్య అభ్యర్థిత్వం నుంచి తప్పుకోవడం, తండ్రి కడియం శ్రీహరితో కలిసి కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం, తిరిగి కాంగ్రెస్ నుంచి వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా నిలబడటం. ఆమెకి టికెట్ ఇవ్వడం కోసం ఆ సీటు ఆశించిన సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్, ఆరూరి రమేష్ లాంటి నాయకులకు బీఆర్ఎస్ అధిష్టానం మొండిచేయి చూపించింది. దీంతో పసునూరి కాంగ్రెస్ లోకి, ఆరూరి బీజేపీలోకి వలస వెళ్లిపోయారు. అంతకంటే ముందే తాటికొండ రాజయ్య ఆశించిన స్టేషన్ ఘనపూర్ టికెట్ కడియం శ్రీహరికి ఇచ్చింది బీఆర్ఎస్. ఎంపీ టికెట్ ఇస్తారనుకుంటే అది కూడా ఆయన కూతురు కావ్యకే ఇస్తారని తెలిసి పార్టీకి రాజీనామా చేశారు రాజయ్య.

కడియం ఫ్యామిలీ కోసం బీఆర్ఎస్ ముగ్గురు నేతల్ని వదులుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ పార్టీపై ఉన్న అవినీతి మరకలు, లిక్కర్ స్కాం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల నేపథ్యంలో పోటీ విరమించుకుంటున్నట్టు లేఖలో రాసి మరీ కడియం కావ్య, కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరడం గులాబీ శ్రేణుల్ని కించపరిచినట్టు అయ్యింది. కడియం శ్రీహరికి ఏం తక్కువ చేశామని పార్టీ మారారంటూ అగ్రనాయకత్వం మండిపడింది. పదవులు అనుభవించి కష్టకాలంలో వదిలివెళ్లడానికి మనసెలా వచ్చిందని పార్టీ నేతలు నిలదీయడం మొదలుపెట్టారు.

బీఆర్ఎస్ పరిస్థితి అనేక కారణాల వలన అధ్వాన్నంగా తయారైందని, నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారాల్సి వచ్చిందని మీడియాముఖంగా కడియం వెల్లడించారు. ఇక వీరు హస్తం గూటికి చేరిన రోజుల వ్యవధిలోనే హై కమాండ్ వరంగల్ ఎంపీ టికెట్ కడియం కావ్యకి కేటాయించింది. మరోవైపు బీఆర్ఎస్ వరంగల్ లోక్ సభ కి సరైన అభ్యర్థిని ఎంపిక చేయడానికి సతమతమవుతోంది. ఉద్యమ నేతలు పెద్ది స్వప్న, ఎర్రోళ్ల శ్రీనివాస్, జోరిక రమేష్, తాటికొండ రాజయ్యల పేర్లతో పాటు తాటికొండ రాజయ్యని ఆ స్థానంలో నిలబెట్టడానికి పరిశీలిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

కడియం శ్రీహరి పార్టీ మారిన తర్వాత వరంగల్ జిల్లా చింతగట్టులో బీఆర్ఎస్ పార్లమెంటు విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, పలువురు ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంటు అభ్యర్థి ఎంపికపైనా హరీష్ రావు చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాదు కడియం శ్రీహరి పార్టీ మారడాన్ని ప్రచార అస్త్రంగా మార్చుకుని కాంగ్రెస్ వైపు గురిపెట్టారు హరీష్ రావు. కడియం కాంగ్రెస్ లో చేరడంతో పార్టీలో జోష్ పెరిగిందని అన్నారు. ఆయన నిత్యం మాట్లాడే నీతి, నిజాయితీలు ఉంటే బీఆర్ఎస్ జెండాపై గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు.

వరంగల్ అభ్యర్థి కొరతతో ఆందోళనలో బీఆర్ఎస్ శ్రేణుల్లో హరీష్ రావు స్పీచ్ ఉత్సాహాన్నిచ్చింది. పార్టీని గెలిపించి కడియం ఫ్యామిలీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని కార్యకర్తల్లో కసి పెరిగింది. వరుసగా పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ శ్రేణుల్లో మనోధైర్యం నింపుతున్న హరీష్ రావు వరంగల్ లో ట్రబుల్ షూట్ చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఆయన రంగంలోకి దిగితే మ్యాజిక్ చేస్తారని భావిస్తున్నారు. అయితే కేసీఆర్ అధికారికంగా ఆ బాధ్యతలు హరీష్ రావుకి అప్పజెప్పలేదు.

గతంలోనూ కడియంని ఓడించడంలో హరీష్ రావు కీలక రోల్

2009 ఎన్నికల్లో తాటికొండ రాజయ్య కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా 2011 లో కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. దీంతో ఆ స్థానానికి ఉపఎన్నిక జరగగా కడియం శ్రీహరిపై తాటికొండ రాజయ్య 32 వేల 638 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే అప్పటికే రాజయ్యపై మహిళల్ని వేధిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రజల్లో ఆయనపై వ్యతిరేకత వచ్చింది. కానీ హరీష్ రావు ఉపఎన్నికలు ముగిసేవరకు నియోజకవర్గంలోనే ఉండి తెలంగాణ సెంటిమెంట్ తో పాటు ఎన్నికల వ్యూహాలు రచించి కడియం శ్రీహరిని ఓడించడంలో కీ రోల్ ప్లే చేశారు. అందుకే వరంగల్ లో మరోసారి హరీష్ రావు చక్రం తిప్పుతారా అనే చర్చ తెరపైకి వస్తోంది.

Tags:    

Similar News