రేవంత్ కు ‘జూబ్లీ’ గెలుపు ఎందుకు అవసరమో తెలుసా ?
నిజానికి ఉపఎన్నికలో గెలుపు లేదా ఓటమి మూడు ప్రధాన పార్టీల్లో దేనిపైనా పెద్దగా ప్రభావం చూపవని అందరికీ తెలుసు
వచ్చేనెల 11వ తేదీన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక జరగబోతోంది. 14వ తేదీన ఫలితాలు వెలువడుతాయి. ఉపఎన్నికలో గెలిచేందుకు కాంగ్రెస్(Telangana Congress) తో పాటు బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP Telangana) కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. నిజానికి ఉపఎన్నికలో గెలుపు లేదా ఓటమి మూడు ప్రధాన పార్టీల్లో దేనిపైనా పెద్దగా ప్రభావం చూపవని అందరికీ తెలుసు. కాకపోతే ఉపఎన్నికలో గెలిచి తమపాలనపై జనాల్లో సానుకూలత ఉందని నిరూపించుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ కు ఉంది. అలాగే బీఆర్ఎస్ గెలిస్తే రేవంత్ ప్రభుత్వంపై జనాలంతా తీవ్ర వ్యతిరేకతంగా ఉన్నారని ఆ పార్టీ నేతలు కొద్దిరోజులు చెప్పుకుంటారు. తమ మీడియా ద్వారా ప్రభుత్వంపై విపరీతంగా వ్యతిరేక ప్రచారం చేయిస్తారనటంలో సందేహం కూడా లేదు. ఇక బీజేపీ గెలిస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండింటిపైనా జనాల్లో వ్యతిరేకత ఉందని ప్రచారం చేసుకుంటారు కమలనాదులు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కాంగ్రెస్ గెలుపు వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డికి చాలా చాలా అవసరం. ఇప్పటికే రేవంత్ కు పార్టీ, ప్రభుత్వంపై పట్టులేదని బాగా ప్రచారం జరుగుతోంది. మొన్ననే జరిగిన క్యాబినెట్ సమావేశంలో మంత్రుల్లో చాలామందికి రేవంత్ ఫుల్లుగా క్లాసు తీసుకున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. శనివారం ఢిల్లీలో పార్టీ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కూడా మంత్రుల్లో సమన్వయలోపం, రేవంత్ ను కొందరు మంత్రులు లెక్కచేయకపోవటం లాంటి అనేక అంశాలపై అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్లు కథనాలు వచ్చాయి. ఇలాంటివన్నీ కలిసి రేవంత్ ఇమేజిని డ్యామేజి చేశాయనటంలో సందేహంలేదు.
మంత్రి కొండాసురేఖ కూతురు సుస్మిత మీడియాలో రేవంత్ ను నోటికొచ్చినట్లు మాట్లాడింది. మంత్రుల్లో అడ్లూరి లక్ష్మణ్, గడ్డం వివేక్, పొన్నం ప్రభాకర్, కొండాసురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. వీళ్ళంతా వివాదాలతో మీడియాకు ఎక్కుతున్నారంటే రేవంత్ ను లెక్కచేయటం లేదనే భావన జనాల్లో బలపడిపోయింది. ఇక నాయిని రాజేంద్రరెడ్డి, అనిరుధ్ రెడ్డి, యెన్నంశ్రీనివాసులరెడ్డి, జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి లాంటి ఎంఎల్ఏలు, మాజీలు పార్టీ, ప్రభుత్వంపై బాహాటంగానే వ్యతిరేకంగా మాట్లాడేస్తున్నారు. అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన విషయాలు కూడా మీడియాలోను, పార్టీ సమావేశాల్లోను మాట్లాడుతున్నారు. ఇలాంటివన్నీ కలిసి పార్టీ, ప్రభుత్వంపై రేవంత్ కు పట్టులేదు అని జనాలు అనుకునేట్లుగా చేస్తున్నాయి.
ఈ నేపధ్యంలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక జరగబోతోంది. ఈఎన్నికలో గెలిచినా, ఓడినా కాంగ్రెస్ కు వచ్చే లాభమూ లేదు నష్టమూ లేదు. గెలిస్తే ప్రభుత్వ వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారం తప్పని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటారు. అదే ఓడితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల దాడులు పెరిగిపోవటం కన్నా కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రభుత్వంలో రేవంత్ బాగా బలహీనపడిపోతారు. కాంగ్రెస్ లోని రేవంత్ వ్యతిరేకులంతా ఏకమై పార్టీలోనే బలమైన వ్యతిరేకవర్గంగా తయారవుతారు అనటంలో సందేహంలేదు.
పార్టీలోనే ఎప్పుడైతే వ్యతిరేకవర్గం బలంగా తయారైందో అప్పటినుండే రేవంత్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయినట్లు లెక్క. అసలే కాంగ్రెస్ లో గ్రూపుల గోల చాలాఎక్కువగా ఉంటుంది. రేవంత్ ను చాలామంది మంత్రులు, ఎంఎల్ఏలు లెక్కచేయటంలేదనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది. ఇపుడు జరుగుతున్న వ్యతిరేక ప్రచారం అంతా ఉత్త ప్రచారం మాత్రమేకాదు నిజమేనని చాలామంది నమ్ముతారు. అప్పుడు రేవంత్ బలహీనపడటం ఖాయం. రేవంత్ బలహీనపడితే పార్టీతో పాటు ప్రభుత్వానికి కూడా తీరని నష్టం జరుగుతుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావటంలో రేవంత్ కష్టం చాలానే ఉంది. అయితే ఇవేవీ కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దగా పట్టించుకోదు.
ఒకవేళ జూబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ మీదున్న వ్యతిరేకత తగ్గుతుంది. పార్టీ, ప్రభుత్వంపై రేవంత్ పట్టు పెరుగుతుంది. ఇపుడు రేవంత్ ను లెక్కచేయని మంత్రులు కొంతకాలం జాగ్రత్తపడతారు. పార్టీతో పాటు ప్రభుత్వంలో స్ధానం సుస్ధిరమైతే ప్రతిపక్షాల మీదకు విరుచుకుపడే అవకాశం రేవంత్ కు దక్కుతుంది. గెలుపు కోసం మంత్రులు, ఎంఎల్సీలు, ఎంఎల్ఏలు, ఎంపీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, సీనియర్ నేతలకు ఇప్పటికే రేవంత్ డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పగించాడు. అయితే అందరూ సమిష్టిగా పార్టీగెలుపుకోసం ఎంతవరకు పనిచేస్తున్నారు ? అన్నదే ఇక్కడ కీలకం. అందుకనే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పార్టీకన్నా వ్యక్తిగతంగా రేవంత్ కే చాలా అవసరం. చివరకు ఏమవుతుందో చూడాలి.