గ్లోబల్ సమ్మిట్ కు మోదీ హాజరవుతారా ?
బుధవారం ఉదయం మోదీని కలిసి సమ్మిట్ లో పాల్గొనేందుకు ముఖ్యఅతిధిగా హాజరవ్వాలని రిక్వెస్ట్ చేయబోతున్నారు
ఈనెల 8,9 తేదీల్లో హైదరాబాదులో జరగబోతున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2047’కు ప్రధానమంత్రి నరేంద్రమోదీని(Narendra Modi) ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆహ్వానించబోతున్నారు. మంగళవారం మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటన తర్వాత తిరిగి రేవంత్(Revanth) హైదరాబాద్ చేరుకుంటారు. సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళతారు. ఈరోజు రాత్రి ఢిల్లీలోని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత(Rahul Gandhi)రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను సమ్మిట్ కు ఆహ్వానిస్తారు.
బుధవారం ఉదయం మోదీని కలిసి సమ్మిట్ లో పాల్గొనేందుకు ముఖ్యఅతిధిగా హాజరవ్వాలని రిక్వెస్ట్ చేయబోతున్నారు. ఎలాగూ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి కేంద్రమంత్రులు, ఎంపీలను కూడా పార్లమెంటులోనే కలిసి సమ్మిట్ కు ఆహ్వానించాలని నిర్ణయించారు.
రేవంత్ షెడ్యూల్ బాగానే ఉన్నా ఇక్కడ రెండు పాయింట్లు కీలకంగా ఉన్నాయి. అవేమిటంటే అసలు రేవంత్ ను కలవటానికి మోదీ అపాయిట్మెంట్ ఇస్తారా ? ఒకవేళ రేవంత్ ను కలిసినా సమ్మిట్ కు మోదీ హాజరవుతారా ? అన్నది కీలకం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మోదీని రేవంత్ ఇప్పటికే చాలాసార్లు కలిశారు. రేవంత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని అనుకుంటున్న మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, ఫ్యూచర్ సిటి, రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో రెండోదశ విస్తరణ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని మోదీని కలిసినపుడల్లా రేవంత్ అడుగుతునే ఉన్నారు. అయితే రేవంత్ ఎన్నిసార్లు అడిగినా పై ప్రాజెక్టులను మోదీ ఏమాత్రం పట్టించుకోలేదు.
మెట్రో విస్తరణకు సంబంధించి దేశంలోని బెంగుళూరు, కొచ్చి, ముంబాయ్, చెన్నై తదితర మెట్రోనగరాల్లోని ప్రాజెక్టులకు నిధులు ఇస్తున్న కేంద్రప్రభుత్వం హైదరాబాదును మాత్రం పట్టించుకోవటంలేదని రేవంత్ బహిరంగంగా ఆరోపించినా, అసంతృప్తి వ్యక్తంచేసినా మోదీ లెక్కచేయటంలేదు. ఇలాంటి సందర్భంలో మోదీని కలవబోతున్న రేవంత్ మళ్ళీ పెండింగ్ ప్రాజెక్టులు, నిధులను అడుగుతు సమ్మిట్ కు ముఖ్య అతిధిగా హాజరుకావాలని రిక్వెస్టుచేయబోతున్నారు. తెలంగాణలో జరుగుతున్నది, జరగబోయేదాన్ని దృష్టిలో పెట్టుకుంటే మోదీ హాజరుపై అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒకవేళ హాజరైనా సమ్మిట్ కు సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడేసి వెళ్ళిపోతారనే వాదన కూడా వినబడుతోంది. చివరకు మోదీ ఏమిచేస్తారో చూడాలి.