పరారీలో భోలే బాబా: అసలు ఎవరీ స్వామీజీ? కానిస్టేబుల్‌నుంచి బాబాగా ఎలా మారాడు?

యూపీలో 121 మంది చనిపోవటానికి కారణమైన భోలే బాబా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇప్పటివరకు ఎవరికీ తెలియని ఈ భోలే బాబా, అసలు ఎవరు, అతనికి ఈ స్థాయిలో ప్రజాదరణ ఎందుకు ఉంది అనే ప్రశ్నలు ఇప్పుడు దేశమంతటా మార్మోగుతున్నాయి

Update: 2024-07-08 10:42 GMT

పరారీలో భోలే బాబా: అసలు ఎవరీ స్వామీజీ? కానిస్టేబుల్‌నుంచి బాబాగా ఎలా మారాడు?

యూపీలో 121 మంది చనిపోవటానికి కారణమైన భోలే బాబా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇప్పటివరకు ఎవరికీ తెలియని ఈ భోలే బాబా, అసలు ఎవరు, అతనికి ఈ స్థాయిలో ప్రజాదరణ ఎందుకు ఉంది అనే ప్రశ్నలు ఇప్పుడు దేశమంతటా మార్మోగుతున్నాయి.

బాబా అసలు పేరు సూరజ్‌‌పాల్. యూపీ పోలీస్ శాఖలో 18 ఏళ్ళు కానిస్టేబుల్‌గా పని చేసి, 1999లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. నారాయణ్ సాకార్ హరి అని పేరు మార్చుకుని, ఆధ్యాత్మిక రంగంలోకి దిగాడు. ప్రవచనాలు మొదలుపెట్టాడు. కోవిడ్ సమయంలో ఇతను ఆంక్షలను ఉల్లంఘించి మరీ ప్రవచన కార్యక్రమాలు నిర్వహించేవాడని ఆరోపణలు ఉన్నాయి.

ఎప్పుడూ తెల్లదుస్తులు ధరిస్తూ, మామూలు బాబాలలాగా కాకుండా నున్నగా షేవ్ చేసుకుని ఉంటాడు. ఒక్కోసారి తెల్ల సూట్‌ కూడా వేసుకుంటాడు. నారాయణ్ సేన పేరుతో ఇతని అనుచరుల బృందం భద్రతా ఏర్పాట్లు చూస్తూ ఉంటుంది. వీరంతా గులాబీరంగు దుస్తులు ధరించి తెల్ల టోపీలతో లాఠీలు పట్టుకుని తిరుగుతూ ఉంటారు. బహదూర్‌నగరిలో ఇతని ఆశ్రమం 30 ఎకరాలలో ఉంటుంది. ఈ ఆశ్రమంలో ఏ విగ్రహాలూ ఉండవు. తనకు భక్తులు ఇచ్చిన విరాళాలను తాను ఉంచుకోనని, పంచేస్తూ ఉంటానని చెబుతుంటాడు.

భోలే బాబా ప్రవచనాలు దిగువ మధ్యతరగతిని ఆకట్టుకునేవిధంగా ఉంటాయని అంటున్నారు. దిగువ మధ్యతరగతివారు, దళితులు ఎక్కువగా ఈ సత్సంగాలకు హాజరవుతుంటారని చెబుతున్నారు. భోలో బాబా ఎస్‌సీ వర్గానికి చెందినవాడు.

Tags:    

Similar News