ఈ రోజుల్లో కూడా ఇంత మంచి డాక్టర్‌ ఉంటారా - వాగులు దాటి గిరిజనులకు వైద్యం అందిస్తున్న, డా.అప్పయ్య!

ఈ రోజుల్లో కూడా ఇంత మంచి మనుషులు ఉన్నారా - వాగులు, వంకలు దాటి వెళ్ళి గిరిజనులకు వైద్యం అందిస్తున్న తెలంగాణ డాక్టర్!

Update: 2024-07-31 06:36 GMT

తెలంగాణలోని మొత్తం అటవీ ప్రాంతంలో 76 శాతం ములుగు జిల్లాలోనే ఉంటుంది. జిల్లాలో 70 ఎకరాల మేర వ్యాపించిఉన్న అటవీ ప్రాంతంలో 101 గిరిజన గ్రామాలు, గూడేలు ఉన్నాయి. అయితే భారీవర్షాలు కురిస్తే ఈ గిరిజన గ్రామాలు అన్నింటికీ బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. దానికి తోడు వర్షాకాలంతో వచ్చే సీజనల్ వ్యాథులు విజృంభిస్తాయి. దీనితో గిరిజన గూడేలలో నివశించే ఆదివాసుల కష్టాలు అన్నీ ఇన్నీ కాదు.

ములుగు, గోవిందరావుపేట మండలాల్లో వాగులు, వంకలు చాలా ఎక్కువ. కొండలు, గుట్టలపై నుంచి వస్తున్న వర్షపునీటితో పాటు అధిక వర్షాలు కురుస్తున్న అటవీ గ్రామాల చుట్టూ వరదనీరు వాగులై పొంగిప్రవహిస్తున్నాయి. ములుగు అటవీ ప్రాంతంలో బొగ్గువాగు, దయ్యాలవాగు, గుండ్లవాగు, జంపన్న వాగు, చిన్న వాగు ...ఇలా పలు వాగులు వర్షాకాలంలో మూడు నెలలపాటు విస్తారంగా వరదనీటి గలగలలతో ప్రవహిస్తుంటాయి.

ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదలతో ఈ అటవీ ప్రాంతంలోని గిరిజన గ్రామాలు, గొత్తికోయల గూడాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపూర్, కన్నాయిగూడెం, తాడ్వాయి, ములుగు, గోవిందరావుపేట మండలాల్లోని 101 గిరిజనగ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆ గ్రామాలకు వెళ్లాలంటే పలు వాగులు దాటుకుంటూ కాలినడకన ప్రయాణించాల్సిందే. దట్టమైన అటవీప్రాంతం కావడంతో వర్షాకాలంలో దోమలు వ్యాప్తిచెంది పలు సీజనల్ వ్యాథులు, మలేరియా, డెంగీ, వైరల్ జ్వరాలు విపరీతంగా సంభవిస్తున్నాయి. గిరిజనులు ఈ జ్వరాలతో తీవ్ర కష్టాలు పడుతున్నా వారికి వైద్యం సకాలంలో అందే సౌకర్యం లేదు. దీంతో తరచూ రోగాలతో గిరిజనులు మరణిస్తున్నారు. మలేరియా జ్వరం వచ్చినవారికి సత్వర వైద్యం అందకపోవటంతో, ఆ జ్వరం మెదడుకు సోకి మృత్యువాత పడుతున్నారు.

ములుగు జిల్లా అటవీ గ్రామాల్లో ఇటీవల 21 మలేరియా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్న సమాచారం తెలుసుకున్న ములుగు జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ అల్లెపు అప్పయ్య వెంటనే రంగంలోకి దిగారు. తన వైద్య సిబ్బందిని సమాయుత్తం చేసుకుని బయలుదేరారు. తన బృందంలో వాజేడు వైద్యాధికారి కొమరం మధుకర్, పెనుగోలు హెల్త్ అసిస్టెంట్ చిన్న వెంకటేష్, కొంతమంది ఆశావర్కర్ లను వెంట తీసుకువెళ్లారు. ఈ వైద్యబృందం ప్రాణాలకు తెగించి మూడు పెద్ద వాగులు దాటి, గుట్టలు ఎక్కి దిగి 16 కిలోమీటర్ల దూరం నడిచి వాజేడు మండలంలోని పెనుగోలు గిరిజన గూడానికి రాత్రి 7 గంటలకు చేరుకుంది. గిరిజనులకు వైద్య సేవలు అందించింది. మరుసటిరోజు ఉదయం నుంచి గ్రామంలో పర్యటించి రోగాలు, దోమల పట్ల అవగాహన కల్పించారు. ఇంటింటికి తిరిగి రోగుల రక్తనమూనాలు సేకరించి పరీక్షించగా గ్రామంలో ఇద్దరికి మలేరియా సోకిందని తేలింది. విషపురుగుల బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తాము గిరిజనులకు సూచించామని డాక్టర్ అప్పయ్య ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. వైరల్, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించామని, జ్వరం వచ్చిన వెంటనే పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకోవాలని సూచించామన్నారు. గిరిజనులకు మందులు, దోమతెరలు ఇచ్చి తిరిగివచ్చామని డాక్టర్ అప్పయ్య చెప్పారు.

వాగుల్లోని నీరు తాగితే రోగాలు వస్తాయని, నీటిని కాచి వడపోసి తాగాలని తాము సూచించామని వాజేడు వైద్యాధికారి డాక్టర్ కొమరం మధుకర్ చెప్పారు.

ఈ 101 గిరిజన గ్రామాల్లో ప్రస్తుతం 400 మందికి పైగా మహిళలు గర్భవతులుగా ఉన్నారని వైద్యాధికారులు గుర్తించారు. వీరిని అన్ని సౌకర్యాలున్న బంధువుల గ్రామాలకు వెళ్లాలని సూచించారు. బంధువులు లేని గర్భవతులను ప్రసవానికి ముందుగానే సమీపంలోని ప్రాథమిక వైద్య కేంద్రాలకు తరలించామని అప్పయ్య చెప్పారు.

గూడేలలో ఉన్న విద్యావంతులైన యువతీ,యువకులనే కమ్యూనిటీ హెల్త్ వర్కర్లుగా నియమించి వారి వద్ద మందుల స్టాకు ఉంచాలని నిర్ణయించినట్లు డాక్టర్ అప్పయ్య ‘ఫెడరల్ తెలంగాణ’కు తెలిపారు. మలేరియా రాకుండా దోమల నియంత్రణకు చర్యలు తీసుకోవడంతో పాటు వాంతులు, విరోచనాలు, డయేరియా సోకితే కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు మందులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. అటవీ గ్రామాల్లో మలేరియాను నివారించేందుకు స్ప్రేయింగ్ ఆపరేషన్ చేయిస్తున్నామని, త్వరలో గిరిజనులకు 34వేల దోమతెరలను ఉచితంగా పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు.

డాక్టర్ అప్పయ్య బృందాన్ని వైద్యశాఖ ఉన్నతాధికారులు, స్థానిక మంత్రి సీతక్కలు అభినందించారు.

ములుగు మండలంలోని మారుమూల అంకన్న గూడెంకు చెందిన డాక్టర్ అల్లెపు అప్పయ్య కష్టపడి ఎంబీబీఎస్ చదివి ప్రభుత్వ వైద్యుడిగా చేరి ప్రస్తుతం సొంత జిల్లాకే వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా చేస్తున్నారు. తోటి గిరిజనుల కష్టాలు తెలిసి ఉండటంతో మారుమూల గిరిజన, కోయ గూడాలకు వైద్యం అందించటానికి ప్రయత్నిస్తున్నారు. అప్పయ్యను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ వైద్యుడిగా గుర్తించి తెలంగాణ ఎక్స్ లెన్స్ అవార్డును ప్రదానం చేసింది.

Tags:    

Similar News