పవన్ కి తెలంగాణ తలుపులు తెరచుకుంటాయా?

తెలంగాణలోనూ బీజేపీతో కలిసి పని చేస్తామంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

Update: 2024-07-02 10:39 GMT

తెలంగాణలోనూ బీజేపీతో కలిసి పని చేస్తామంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు సాధించిన కమలనాథులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో వారికి పవన్ కరిష్మా తోడైతే మరింత బలోపేతం అవుతారని కొందరు అంటున్నారు.

అయితే, ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్న నాయకులు ఎంత పెద్దవాళ్ళయినా, తెలంగాణలో వారి ప్రభావం తక్కువగా ఉంటుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. దానికి ఉదాహరణగా 2014 ఎన్నికల్లో తెలంగాణలో వైసీపీ సాధించిన ఫలితాలను గుర్తు చేస్తున్నారు. వైఎస్‌కు తెలంగాణలో ఎంతో మంది అభిమానులు ఉన్నా వైసీపీ ఆ ఎన్నికల్లో 3 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది.

తెలంగాణ రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేయాలని పవన్ బాగా కోరిక ఉంది. 2020లో జరిగిన హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని చూసినా కమలనాథులు స్పందించలేదు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీయే జనసేనతో పొత్తుకు చొరవ చూపి 8 స్థానాలను కేటాయించింది. అయితే ఆ ఎనిమిది స్థానాలలోనూ జనసేన చిత్తుగా ఓడిపోయింది.

జనసేనకు ఏపీలో చూస్తే, గోదావరి జిల్లాలలో, కృష్ణా, గుంటూరు జిల్లాలలో, ఉత్తరాంధ్రలోని కొద్ది ప్రాంతాలలో తప్ప రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నిర్మాణం సరిగ్గాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ ఏపీలోనే పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయకుండా తెలంగాణలో అడుగు పెడితే రెండు పడవలపై కాళ్ళు పెట్టినట్లయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News