కాల్పుల ఘటనతో ట్రంప్ విజయావకాశాలు పెరుగుతాయా?

పెన్సిల్వేనియాలో శనివారంనాడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల ఘటన అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేదానిపై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది.

Update: 2024-07-31 07:06 GMT

పెన్సిల్వేనియాలో శనివారంనాడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల ఘటన అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేదానిపై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. దీనిపై రెండు పరస్పర భిన్న వాదనలు వినబడుతున్నాయి.

సానుభూతి పెరిగి ఎన్నికలు ఏకపక్షంగా ట్రంప్ వైపు మొగ్గుతాయన్నది మొదటి వాదన. ఎవరైనా ప్రధాన రాజకీయ నాయకుడిపై హత్యాయత్నం జరిగి అతను ప్రాణాలతో బయటపడితే, ఆ నిర్దిష్ట సమయంలో అతనికి సహజంగానే సానుభూతి పెరుగుతుంది. ప్రస్తుతానికి ట్రంప్‌కు ఇది కలిసొచ్చే అంశంగానే చెప్పుకోవచ్చు. మరోవైపు, ఈ పరిణామంతో ట్రంప్‌కు అమెరికా ప్రజల దృష్టిలో ఒక పోరాట యోధుడి ఇమేజ్ వస్తుందని అతని అభిమానులు, రిపబ్లికన్ పార్టీ అభిమానులు అంటున్నారు.

అసలు డెమోక్రాట్స్ వలనే ఈ కాల్పుల ఘటన జరిగిందని, వారు ట్రంప్‌పై లేనిపోని కట్టుకథలను ప్రచారం చేస్తున్నారని, విషం చిమ్ముతున్నారని వారు ఆరోపిస్తున్నారు.

కాల్పుల ఘటన ట్రంప్ విజయావకాశాలపై ప్రభావం చూపేఅవకాశాలు తక్కువని కూడా ఒక వాదన వినిపిస్తోంది. ఎన్నికలు జరిగేది నవంబర్ 5 వ తేదీన కాబట్టి, మధ్య ఉన్న ఈ నాలుగున్నర నెలలు చాలా ఎక్కువ కాలమని, ఈ మధ్యలో చాలా పరిణామాలు జరుగవచ్చని అంటున్నారు. ట్రంప్‌ను దోషిగా తేలుస్తూ పలుకేసుల్లో ఇటీవల సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పులు మొదలైన అంశాలతో ఆయనను వ్యతిరేకించేవారు ఈ కాల్పుల ఘటనవలన ఏర్పడే తాత్కాలిక సానుభూతితో మారబోరన్న వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు బైడెన్ ఇటీవల ముఖాముఖి చర్చలో తొట్రుపడటంతో ట్రంప్‌కు ఇది కలిసొస్తుందని అనుకుంటున్నప్పటికీ, అసలు డెమోక్రాట్ అభ్యర్థిగా బైడెన్‌నే మారుస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. అదే జరిగితే ట్రంప్ విజయావకాశాలు తగ్గటం ఖాయం.

Similar News