విశ్వవిజేతలు రావడం ఆలస్యం.. కారణం ఏంటంటే..

భారత క్రికెటర్లు ఇంటికి తిరిగి చేరుకోవడం కాస్త ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. బీసీసీఐ పంపిన ప్రత్యేక విమానం ఇంకా బార్బడోస్ చేరుకోలేకపోవడంతో..

Update: 2024-07-03 10:55 GMT

అమెరికా- వెస్టీండీస్ అతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచకప్ లో భారత్ రెండో సారి విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ పూర్తయిన తరువాత భారత క్రికెటర్లు బార్బడోస్ నుంచి బయల్దేరడం ఆలస్యం అయింది. అట్లాంటిక్ మహా సముద్రంలో ఏర్పడిన బెరిల్ హరికేన్ కారణంగా బార్బడోస్ లో ఉన్న ఎయిర్ పోర్ట్ ను మూసివేశారు. ఆటగాళ్లు అంతా హోటల్ గదులకే పరిమితం అయ్యారు. దీంతో బీసీసీఐ ప్రత్యేక విమానాన్ని మన క్రికెటర్లు, సిబ్బంది కోసం అక్కడికి పంపించింది. కానీ విమానం ఇంకా అక్కడికి చేరుకోలేదు. బెరిల్ హరికేన్ ఇప్పుడు కేటగిరీ 4 తుఫానుగా మారింది. తరువాత ఇది కేటగిరీ 5 కి మారి జమైకా వైపు వెళుతోంది.

AIC24WC ఎయిర్ ఇండియా ఛాంపియన్స్ 24 వరల్డ్ కప్ పేరుతో ఎయిర్ ఇండియా స్పెషల్ చార్టర్ ఫ్లైట్ భారత జట్టు, దాని సహాయక సిబ్బంది, ఆటగాళ్ల కుటుంబాలు, కొంతమంది బోర్డు అధికారులు, భారతీయ మీడియా కోసం వారిని తిరిగి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. శనివారం జరిగిన ఫైనల్లో రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు దక్షిణాఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

జూలై 2న అమెరికాలోని న్యూజెర్సీ నుంచి బయలుదేరిన విమానం స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో బార్బడోస్‌లో దిగాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం, విమానం ఇప్పుడు బార్బడోస్ నుంచి తెల్లవారుజామున 4:30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) బయలుదేరుతుందని భావిస్తున్నారు. ఢిల్లీకి చేరుకోవడానికి 16 గంటల విమాన సమయం పడుతుంది, ఉదయం ఆరుగంటలకు కల్లా ఆటగాళ్లు ప్రయాణానికి సిద్ధంగా ఉండాలి.
ఇక్కడి గ్రాంట్లీ ఆడమ్స్ అంతర్జాతీయ విమానాశ్రయం మంగళవారం తన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. ముందుగా, భారత జట్టు జూలై 2న స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరి బుధవారం రాత్రి 7.45 (IST) ఇండియాకి చేరుకోవాల్సి ఉంది. క్రీడాకారులను ప్రధాని నరేంద్ర మోదీ సత్కరించబోతున్నారు. అయితే దీని షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. భారత జట్టు, సిబ్బందికి బీసీసీఐ రూ. 125 కోట్ల భారీ నజరానా ప్రకటించింది.
Tags:    

Similar News