బంగ్లాపై ఉత్కంఠ విజయం..సెమీస్ కు దూసుకెళ్లిన ఆప్ఘన్

ఆప్ఘన్ జట్టు సంచలనం సృష్టించింది. తొలిసారిగా ఐసీసీ ఈవెంట్ లో నాకౌట్ దశకు చేరింది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఎనిమిది పరుగులతో విజయం సాధించి..

Update: 2024-06-25 07:29 GMT

వావ్ వాటే మ్యాచ్.. ఆప్ఘన్, బంగ్లా మ్యాచ్ చూసిన వారు ఎవరైనా ఈ మాట అనాల్సిందే. గ్రూప్ 1, సూపర్ ఎయిట్ చివరి పోరులో భాగంగా బంగ్లాదేశ్, ఆప్ఘన్ తలపడ్డాయి.  వర్షం పలుమార్లు అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. చివరకు డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఆఫ్ఘన్ జట్టు ఎనిమిది పరుగుల చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఆ జట్టు సగర్వంగా సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. ఈ నెల 27 న జరిగే రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఆ జట్టు తలపడనుంది.

ఈ మ్యాచ్ గెలిస్తే ఆప్ఘన్ జట్టు ఐసీసీ ఈవెంట్ లో తొలిసారిగా సెమీస్ చేరినట్లు అవుతుంది. ముందురోజు భారత్ తో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు ఓడటంతో ఈ మ్యాచ్ కాబూలీవాలా టీమ్ ప్రతిష్టాత్మకంగా మారింది. అందుకోసం ఆ జట్టు తీవ్రంగా పోరాడింది.
కెప్టెన్ రషీద్ ఖాన్ నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు. మరో బౌలర్ నవీన్ ఉల్ హక్ మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే చివర్లలో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. అటు వర్షం కూడా పలుమార్లు వచ్చి ఇబ్బంది పెట్టింది. అయితే చివరిగా ముస్తాఫిజుర్ ను నవీన్ ఎల్భీగా వెనక్కి పంపడంతో ఆ జట్టు సంబరాల్లో మునిగి తేలింది. నవీన్ కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
మొదట బ్యాటింగ్ కు దిగిన ఆప్ఘన్ జట్టు నిర్ణీత ఓవరల్లో 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ 17.5 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయింది. వర్షం కారణంగా మ్యాచ్ ను 19 ఓవర్లకు కుదించి లక్ష్యాన్ని 114 పరుగులకు సవరించారు. ఆఫ్ఘన్ జట్టు గెలుపుతో కంగారు ఆశలు అడియాశలయ్యాయి. ఆ జట్టు సూపర్ ఎయిట్ లోనే వెనుదిరగాల్సి వచ్చింది. ఇంతకుముందు ఇదే పిచ్ పై జరిగిన మ్యాచ్ లో ఆప్ఘన్ జట్టు ఆస్ట్రేలియాను తొలిసారి ఓడించింది.
టాస్ గెలిచిన ఆఫ్ఘన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఒపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ 55 బంతుల్లో 43 పరుగులతో టాప్ స్కోర్ గా నిలిచాడు. రిషబ్ హొస్సేన్ (3/26) ఆకట్టుకున్నాడు. బంగ్లాదేశ్ జట్టులో లిట్టన్ దాస్ 49 బంతుల్లో 54 పరుగులు చేసి జట్టును గెలిపించేందుకు చివరిదాకా ప్రయత్నించాడు. దీంతో సూపర్ ఎయిట్ లో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే బంగ్లాదేశ్ ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది.
సంక్షిప్త స్కోర్లు: ఆఫ్ఘనిస్తాన్: 20 ఓవర్లలో 5 వికెట్లకు 115 (రహ్మానుల్లా గుర్బాజ్ 43; రిషబ్ హొస్సేన్ 3/26).
బంగ్లాదేశ్: 17.5 ఓవర్లలో 105 ఆలౌట్ (లిట్టన్ దాస్ 54 నాటౌట్; రషీద్ ఖాన్ 4/23).
Tags:    

Similar News