క్రికెట్ నుంచి రిటైర్ మెంట్ ప్రకటించిన పుజారా
రాహుల్ ద్రావిడ్ వారసుడిగా టెస్ట్ క్రికెట్ లో అడుగుపెట్టిన సౌరాష్ట్ర బ్యాట్స్ మెన్;
By : The Federal
Update: 2025-08-24 09:32 GMT
గంటలకు గంటలు క్రీజులో పాతుకుపోయి.. బౌలర్లకు విసుగు తెప్పించి పరుగులు రాబట్టడం అతని నైజం.. అవసరమైతే తన శరీరాన్ని గోడగా నిలబెడతాడు కానీ తన వికెట్ మాత్రం ఇవ్వడు. భారత క్రికెట్ కు రెండో తరం ‘ది వాల్’ గా పేరు పొందిన చటేశ్వర్ పుజరా గురించే ఈ ఉపోద్ఘాతం అంతా.
భారత్ క్రికెటర్ చటేశ్వర్ పుజారా అన్ని రకాల క్రికెట్ నుంచి తన రిటైర్ మెంట్ ప్రకటించారు. ఆయన ఈ మేరకు ఎక్స్ లో ట్వీట్ చేశారు. ‘‘భారత జెర్సీ ధరించడం, జాతీయ గీతం పాడటం, నేను మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతీసారి నా వంతు ప్రయత్నం చేయడం.. దాని నిజమైన అర్థాన్ని మాటల్లో చెప్పడం అసాధ్యం. అన్ని విషయాలు మంచిగా ముగియాలి. అపారమైన కృతజ్ఞతతో నేను భారత క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను. అందరి ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు’’ అని ఈ సౌరాష్ట్ర బ్యాట్స్ మెన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం పుజారా వయస్సు 37 సంవత్సరాలు.
పుజారా భారత్ తరఫున 103 టెస్టులకు ప్రాతినిధ్యం వహించాడు. కేవలం ఐదు వన్డేలు మాత్రమే ఆడాడు. 2010 లో బెంగళూర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా అరంగ్రేటం చేశాడు.
అతని కెరీర్ లో 19 సెంచరీలు, 35 అర్థ సెంచరీలు సాధించాడు. టెస్ట్ క్రికెట్ లో 7,195 పరుగులు చేశాడు. అతను 2023 నుంచి భారత్ తరఫున క్రికెట్ ఆడలేదు. పుజారా చివరి టెస్ట్ లండన్ లోని ఓవల్ లో ఆస్ట్రేలియాతో జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్,
కోచ్ లు.. మెంటర్లకు ధన్యవాదాలు..
పుజారా బీసీసీఐ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్, ఫ్రాంచైజీలు, కోచ్ లు, మెంటర్లు మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు.
‘‘రాజ్ కోట్ అనే చిన్న పట్టణానికి చెందిన చిన్నపిల్లవాడిగా నా తల్లిదండ్రులతో పాటు నేను స్టార్లను లక్ష్యంగా చేసుకుని బయల్దేరాను. భారత క్రికెట్ జట్టులో భాగం కావాలని కలలు కన్నాను.’’ అని పుజారా ఎక్స్ లో రాసుకొచ్చారు.
ఈ ఆట నాకు చాలా ఇస్తుందని నాకు అప్పుడు తెలియదు. అమూల్యమైన అవకాశాలు, అనుభవాలు, ఉద్దేశ్యం, ప్రేమ అన్నింటికంటే ముఖ్యంగా నా రాష్ట్రానికి, గొప్ప దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించింది’’ అన్నారు.
‘‘నా క్రికెట్ లో కెరీర్ లో అవకాశం, మద్దతు ఇచ్చినందుకు బీసీసీఐ, సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంవత్సరాలుగా నేను ప్రాతినిధ్యం వహించగలిగిన అన్ని జట్లు, ప్రాంచైజీలు, కౌంటీలను నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’
‘‘క్రికెట్ నన్ను ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాలకు తీసుకెళ్లింది. అభిమానుల ఉద్వేగభరితమైన మద్దతు శక్తి ఎల్లప్పుడూ స్థిరంగా ఉన్నాయి.’’ అన్నారు. నా గురువులు, కోచ్ లు ఆధ్యాత్మిక గురువుల అమూల్యమైన మార్గదర్శకత్వం లేకుండా నేను ఇంత దూరం వచ్చేవాడిని కాదు. వారికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను.
20 వేల కి పైగా ఫస్ట్ క్లాస్ పరుగులు..
పుజారా 43.60 సగటుతో 7,195 పరుగులతో భారత్ లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 21,301 పరుగులు సాధించాడు. మరో దేశవాళీ సీజన్ దగ్గర పడుతుండటంతో పుజారా సౌరాష్ట్ర తరఫున ఆడతాడని భావించారు. కానీ పుజారా మాత్రం తన రిటైర్ మెంట్ కు ఇదే మంచి సమయని భావించాడు.
ఈ మధ్య కాలంలో పుజారా క్రికెట్ వ్యాఖ్యతగా మొగ్గు చూపాడు. ఇటీవల ఇంగ్లాండ్ వేదికగా జరిగిన టెండూల్కర్- ఆండర్సన్ సిరీస్ లో ఆయన వ్యాఖ్యతగా కనిపించాడు. గత నెలలో కూడా క్రికెట్ ఆడటానికి సిద్దంగా కనిపించాడు. కానీ ఇంతలోనే తన మనసు మార్చుకున్నాడు.
రాహుల్ తరువాత పుజారా ఇన్నింగ్స్ కు గోడలా మారాడు. విదేశాలలో అద్భుతంగా రాణించాడు. 2018, 2021 వరుసగా ఆస్ట్రేలియా పర్యటనలలో అతను ఉత్తమంగా ప్రదర్శన కనపరిచారు. ఈ రెండు సిరీస్ లను భారత్ గెలుచుకుంది.