అమెరికాపై విండీస్ గెలుపు, ఆసక్తికరంగా మారిన సెమీస్ బెర్త్

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్ లో అమెరికాపై వెస్టీండీస్ ఘన విజయం సాధించింది. ఒపెనర్ షై హోప్ అజేయంగా 82 పరుగులు సాధించాడు.

Update: 2024-06-22 10:14 GMT

అమెరికా- వెస్టీండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్ లో శనివారం ఉదయం జరిగిన మ్యాచ్ లో అమెరికాపై విండీస్ తొమ్మిది వికెట్లతో గెలుపొందింది. విండీస్, అమెరికా విధించిన 129 పరుగుల లక్ష్యాన్ని కేవలం 10. 5 ఓవర్లలో చేధించింది. ఒపెనర్ షాయ్ హోప్ అమెరికా బౌలర్లపై ఆధిపత్యం చెలాయించి 82 పరుగులతో అజేయంగా నిలిచారు.

ఒపెనర్ షై హోప్ కేవలం 32 బంతుల్లోనే 82 పరుగులు సాధించాడు. అందులో ఎనిమిది సిక్స్ లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. షై కి జోడిగా పూరన్ కూడా బ్యాట్ ఝలిపించడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. పూరన్ కూడా 13 బంతుల్లోనే మూడు సిక్స్ లు, ఓ ఫోర్ తో 27 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. మరో ఒపెనర్ జాన్సన్ చార్లెస్ 14 బంతుల్లో 15 పరుగులు సాధించి పెవిలియన్ చేరాడు. వీరు ఇరువురు మొదటి వికెట్ కు 67 పరుగులు సాధించారు. రెండో వికెట్ కు పూరన్ తో కలిసి హోప్ కేవలం 23 బంతుల్లోనే 63 పరుగులు జోడించారు.
ముందు బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ ఆండ్రీ రస్సెల్ 3/31, రోస్టన్ చేజ్ 3/19 ధాటికి 20 ఓవర్లలో కేవలం 129 పరుగులే సాధించింది. అమెరికా జట్టులో ఏ బ్యాట్స్ మెన్ కూడా క్రీజులో సౌకర్యంగా కదలలేదు. గత మ్యాచ్ లో దక్షిణాఫ్రికా పై 81 పరుగులు సాధించిన ఓపెనర్ గౌస్ ఒక్కడే 29 పరుగులు చేశాడు. మరో బ్యాట్స్ మెన్ నితీష్ కుమార్ 20 పరుగులు సాధించాడు. మిగిలిన వారంతా ఇలా వచ్చి అలా వెళ్లారు. అమెరికా కెప్టెన్ ఆరోన్ జోన్స్(11), న్యూజిలాండ్ తరఫున క్రికెట్ ఆడి, ప్రస్తుతం అమెరికా తరఫున ఆడుతున్న కోరే అండర్సన్ చాలా నిదానంగా ఆడారు.
విండీస్ విజయంతో గ్రూప్ 2 లో సెమీస్ బెర్త్ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచుల్లో దక్షిణాఫ్రికా గెలిచి తన బెర్త్ ను దాదాపు ఖరారు చేసుకున్నట్లే. మిగిలిన ఒక్క స్థానం కోసం ఇంగ్లండ్, విండీస్ పోటీపడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న నెట్ రన్ రేట్ చూసుకుంటే విండీస్ ముందున్నప్పటికీ తన తదుపరి మ్యాచ్ అది పటిష్ట దక్షిణాఫ్రికాతో తలపడాలి. ఇంగ్లండ్ మరో మ్యాచ్ లో అమెరికాతో ఢీ కొంటుంది.
దక్షిణాఫ్రికా ప్రస్తుత ఫామ్ ను చూసుకుంటే విండీస్ చాలా కష్టపడితేనే విజయం లభించదని అర్ధమవుతుంది. కానీ వరల్డ్ కప్ కు ముందు కరేబియన్ దీవుల్లోనే విండీస్- సౌత్ ఆఫ్రికా టీ20 సిరీస్ ఆడాయి. అందులో ప్రోటీస్ జట్టు ఘోరంగా ఓడిపోయింది. ఇది కరేబియన్ జట్టుకు కలిసోచ్చే అంశమే అయినా.. ఇంగ్లండ్, అమెరికాను భారీ తేడాతో ఓడిస్తే దాని నెట్ రన్ రేట్ కూడా మెరుగు పడే అవకాశం ఉంది. ఏదీ ఏమైనా గ్రూప్ 2 లో ఆ ఒక్క బెర్త్ కోసం ఆసక్తికర ఫైట్ జరగబోతుందనడంలో సందేహం లేదు.
Tags:    

Similar News